Telugu Moral Stories for kids I

నాన్నా పులి వచ్చే!




ఒక ఊరిలో సోమయ్య అనే పల్లెటూరి రైతు ఉన్నాడు. అతనికి పొలం ఉంది. గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో ఒక రోజు మందని తోలుకు వెళ్తూ తన కొడుకు గంగడిని కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు. మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు. సరే అన్నాడు గంగడు. "ఇక్కడ పెద్ద పులి వస్తూ ఉంటుంది జాగ్రత్త", అని హెచ్చరించి, "ఒక వేళ పులి వస్తే కేక వేయమని" చెప్పి తాను పొలంలోని కూలీలతో పనులు చేయించడంలో నిమగ్నమైపోయాడు సోమయ్య.

గంగడు ఆకతాయి కుర్రాడు. తండ్రిని ఒక ఆట పట్టించాలని అనుకున్నాడు. "నాన్నా! నాన్నా!పులి వచ్చింది" అని పెద్దగా అరిచాడు. నిజంగా పులి వచ్చిందేమోనని సోమయ్య కూలీలతోనూ , కర్రలతోనూ పరిగెత్తుకు వచ్చాడు. కానీ గంగడు నవ్వుతూ "పులీ లేదు గిలీ లేదు. హాస్యానికి కేక వేసాను!" అన్నాడు. సోమయ్య , కూలీలు వెళ్లిపోయారు.

మళ్ళీ కాసేపటికి "నాన్నా! నాన్నా! పులి" అని అరిచాడు. సోమయ్య వాళ్లు మరొకసారి వచ్చారు . "ఈ సారి కూడా వేళాకోళమే" అన్నాడు గంగడు. సోమయ్య గంగడ్ని కోప్పడి వెళ్ళిపోయాడు.
మరికొద్ది సేపటికి పులి నిజంగానే వచ్చింది. ఈ సారి మళ్లీ "నాన్నా!నాన్నా! పులి" అని గట్టిగా అరిచాడు. ఎంత అరిచినా సోమయ్య వాళ్లు వినిపించుకోలేదు.

హాస్యానికే మళ్ళా గంగడు అరిచాడని లెక్క చేయలేదు. పులి మాత్రం గొర్రె పిల్లనొకదానిని మెడ పట్టుకుని ఈడ్చుకు వెళ్ళిపోయింది. గంగడు ఏడుస్తూ నవ్వులాటకి అబద్దమాడితే అపాయం ముంచుకొస్తుందని తెలుసుకున్నాడు.

సింహం - చిట్టెలుక 



ఒక అడివిలో ఒక సింహం ఉన్నది. ఆ అడివిలోనే ఒక చిట్టెలుక కూడా ఉన్నది. ఒకనాడు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా పక్కనే ఉన్న కన్నంలో నుండి చిట్టెలుక అటూ ఇటూ పరుగెడుతూ ఆ సింహం కాలుకు తగిలింది. సింహం ఒక్కసారి పంజా విదిలించి తన కాలు క్రింద చిట్టెలుకను అదిమి పట్టింది. చిట్టెలుక గడగడా వణుకుతూ "మృగరాజా ! నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు. ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తాను" అన్నది దీనంగా.

చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి "ఏమన్నావూ! నీవు నాకు సహాయం చేస్తావా? నా కాలిగోరంత లేవు! ఈ అడివికి రాజును నేనెక్కడ? కన్నంలో దాక్కునే నీవెక్కడ? పిసరంత ప్రాణం గల నువ్వెక్కడ? అలాంటి నీవు నాకు బదులు ఉపకారం చేస్తావా? ఎంత విచిత్రం? సరేలే ఫో! " అని సింహం పెద్దగా నవ్వుతూ చిట్టెలుకని వదిలింది. బతుకు జీవుడా అని చిట్టెలుక పారిపోయింది.

కొన్నాళ్ల తరువాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకున్నది. వల తాళ్లు గట్టిగ ఉండడంతో సింహం ఎంత గింజుకున్నా తప్పించుకోలేకపోయింది. కొంతసేపటికి వేటగాడు వచ్చి తనను బంధించి బోనులో పెడతాడో లేక ప్రాణమే తీస్తాడో నని విచారించ సాగింది. అటువైపు పరుగెడుతున్న చిట్టెలుక సింహం దీనస్థితి చూసింది. అయ్యో పాపం అని జాలి పడింది. వల తాళ్లను తన వాడి దంతాలతో గబగబా కొరకసాగింది. అది చూసి సింహం ఆశ్చర్యపోయింది. సంతోషించింది కూడా. వలతాళ్లు కొరకడం వల్ల సింహం వల నుండి బయటపడింది. చిట్టెలుక ముఖం చూడడానికి సింహానికి సిగ్గనిపించింది.

"ఒకనాడు నేను నిన్ను నా కాలిగోటితో సమానమన్నాను. ఈసడించుకున్నాను. ఈ రోజు నీవే నా ప్రాణం కాపాడావు! నన్ను క్షమించు" అన్నది సింహం. ఆనాటి నుండి అవి స్నేహంగా జీవించినవి.

Comments