Telugu Moral stories for kids II

మేకపోతు గాంభీర్యం 




అడివికి వెళ్లిన మేకల మంద నుండి ఒక మేకపోతు తప్పిపోయింది. ఎంత వెతికినను ఆ మేకపోతునకు ఆ మంద కనిపించలేదు. రాత్రి అయ్యింది. దానికి దారి తెలియక అటూ ఇటూ తిరిగి చివరకు ఒక కొండ గృహ కనబడితే లోపలి పోయి పడుకున్నది మేకపోతు.

కొంతసేపటికి ఆ గృహలో నివసించే సింహం తన నివాస స్థలానికి వచ్చి తన గృహలో పడుకున్న మరో జంతువును చూసింది. చీకట్లో మేకపోతు కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. పెద్ద గడ్డమూ , వాడి కొమ్ములు వున్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కొంత భయం కలిగింది. ఈ వింత జంతువు తనను చంపడానికే వచ్చిందని గృహలోనికి వెళ్లక ఏమి చేయాలో  తోచక బయటనే నిలబడి వున్నది.

మేకపోతు కూడా సింహాన్ని చూడగానే గుండెలో గుబులు బయలుదేరినది. సింహం కూడా తనని చూచి భయపడినది అని గమనించింది మేకపోతు. భయాన్ని బయటకి కనపడకుండా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని అందులోనే ఉండిపోయింది.  సింహం బారి నుండి ఎలా తప్పించుకోవాలి ? అని ఆలోచిస్తూ ఉండిపోయింది. తెలతెలవారుతుండగా మేకపోతు ధైర్యం కూడగట్టుకుని గృహ ముందుకు వచ్చి " ఎవరు నీవు? " అని గద్దించింది సింహాన్ని. " నేను సింహాన్ని మృగరాజును.. " అని భయంతో అన్నది.

మేకపోతు ధైర్యం కూడగట్టుకుని " ఓ నీవేనా ? ఆ సింహానివి? మృగరాజువు కూడానా? నా అదృష్టం పండింది. వెతకబోయినది కాలికి తగిలినట్టు నీ కొరకే వెతుకుతున్నాను. వేయి ఏనుగులని లెక్కలేని పులులను చంపాను తెలుసా? సింహాన్ని చంపే వరుకు ఈ గడ్డం తీయనని భీష్మ ప్రతిజ్ఞ చేసాను. ఇప్పటికి నా దీక్ష పూర్తి అయ్యినట్లే ! నిన్ను చంపి ఈ గడ్డానికి విముక్తి కలిగిస్తాను. " అని రెండు కాళ్ళు ఎత్తి మేకపోతు ఒక్క దూకు దూకింది. హడలిపోయి సింహం పరుగు లంకించుకుంది. బ్రతుకు జీవుడా అని ఆ మేకపోతు అక్కడి నుండి వెళ్ళిపోయి , అడవికి వచ్చిన మేకల మందలో కలిసిపోయింది.

బాతు-బంగారుగుడ్డు 



ఒక గ్రామంలో సూరయ్య అనే రైతు ఉన్నాడు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. అతను ఒక బాతు పిల్లను తెచ్చి పెంచసాగాడు. ఆ బాతు పిల్ల పెరిగి పెద్దదైంది. ఒకనాడు అది ఒక బంగారు గుడ్డు పెట్టింది. సూరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతినిత్యము పెడుతూ ఉండేది.

సూరయ్య దంపతులకు బంగారం రోజూ లభించడంతో ఆనందంతో ఒళ్ళు మరిచిపోయారు. ఆ దంపతులిద్దరికీ దురాశ కలిగింది. ఒక రోజు సూరయ్య దంపతులు " ఈ బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతున్నది కదా! కావున దీని పొట్టలో ఇంకను చాలా బంగారు గుడ్లు వుండి  తీరాలి. ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి ఉండడం కంటే ఆ బాతును కోసి , దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే మంచిది. " అని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు.

ఆలస్యమెందుకని సూరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చారు. కానీ అందులో ఒక బంగారు గుడ్డు కూడా కనబడలేదు. సూరయ్య దంపతులు నెత్తి నోరు కొట్టుకుని కృంగి కృశించారు.  

Comments