Telugu Moral stories for Kids III


తాటి చెట్టు - మర్రి విత్తనము 



ఒక కాకి తాటి చెట్టు పై కూర్చోని మర్రి పండును తినుచుండెను. పండులోని ఒక మర్రి గింజ రాలి తాటి మట్టల మధ్య పడినది. ఆ చిన్న విత్తును చూచి ఎగతాళిగా నవ్వినది తాటి చెట్టు.
" నా కాయలు ముంతడేసి , గింజలు చారెడేసి వున్నాయి. ఇనుప గుండ్ల లాంటి నా కాయలను చూచినా అందరికి భయమే అందుకే నా నీడన నిలబడరు. మనుషులు గాని , జంతువులు గాని  నా కాయ రాలి పడ్డ నలిగిపోవు వారి నడ్డి. ఇంత చిన్న గింజ నుండి ఎంత పెద్ద మొక్క వచ్చును. పక్కనున్న నన్ను చూచి భయపడునో లేక నా కాయ పడి నలిగిపోవచ్చును. " అని తాటి చెట్టు ఆ గింజ మీద జాలిపడి రకరకాలుగా నవ్వుకున్నది. ఎగతాళి చేసినది.

కాకి ఎగిరిపోయినది. మర్రి విత్తనము మాట కూడా మరిచినది తాటి చెట్టు. కొంతకాలం జరిగిన తరువాత మర్రి గింజ మొలకెత్తి చిన్న చెట్టుగా అవతరించింది. సంవత్సరం గడిచింది. కొంత కాలానికి తాటిని మించి పెరిగిపోయింది మర్రిచెట్టు. తాటి చెట్టుకు ఆనుకుని పెరిగింది మర్రిమాను. కొంతకాలానికి విర్రవీగిన తాటి చెట్టు మర్రి మానులో కలిసిపోయి ప్రాణాలు విడిచింది.

గురు సందేశం 



ఒక రోజు గురువు గారు తన ప్రియశిష్యుడితో దగ్గరలో నున్న ఒక అడవికి వెళ్లారు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు. దగ్గరలో వున్న నాలుగు మొక్కలను చూసారు. అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క , రెండవది కొంచెం పెద్ద మొక్క , మూడవది దాని కన్నా కొంచెం పెద్దది. నాల్గవది పెద్ద చెట్టు.

గురువుగారు తన శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దానిని లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కని లాగేసాడు. ఇప్పుడు రెండో మొక్కని కూడా లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు కొంచెం కష్టపడి దానిని కూడా లాగేసాడు. మూడవ దానిని కూడా లాగమన్నాడు. తన శక్తి అంతా ఉపయోగించి కష్టంతో దానిని కూడా లాగేసాడు. బాగా ఎదిగిన చెట్టును చూపుతూ ఇప్పుడు దీన్ని లాగేయడానికి ప్రయత్నించమన్నాడు.

ఆ పిల్లవాడు చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ప్రయత్నించినా చెట్టును కదిలించలేకపోయాడు. అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో గురువుగారు ఇలా అన్నాడు. " చూడు నాయనా ! మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాతబడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. మొక్కై వంగనిది మానై వంగునా? అనే విధంగా ఎంత ప్రయత్నించినా ఆ అలవాట్లు మనల్ని వదిలి పోవు " అన్నాడు గురువుగారు. శిష్యుడికి నీతి అర్థం అయ్యి గురువుగారికి నమస్కరించాడు. 

Comments