Telugu Moral Stories for kids IV

కుందేలు తెలివి 



ఒక అడివిలో ఒక ముసలి సింహం మృగరాజుగా చెలామణి అవుతూ ఉంది. మేక , ఎలుగు , లేడి , దుప్పి , జింక , కోతి , కుందేలు వంటి చిన్న చిన్న జంతువులని పట్టి ఇష్టం వచ్చినట్టు చంపి ప్రతి రోజూ తినేస్తూ ఉంది. ఒకరోజు ఈ సన్నకారు జంతువులన్నీ ఒక మహాసభ జరిపి సింహం బాధ చాలా ఎక్కువగా ఉంది. దానిని తప్పించుకునే మార్గం ఆలోచించాలనుకున్నాయి. ఆ మాట విన్న ఎలుగుబంటి , " అందరమూ కలిసి ఒకేసారి సింహం మీద పడి చంపి వేద్దామా? " అంది. " అది జరిగే పని కాదు. ఆ పని మనం చేయలేము కదా! " అని అరిచాయి మిగతా జంతువులు.

ఈ లోపున నక్క " మనం మృగరాజుతో ఒక సంధి చేసుకుందాము " అని సలహా ఇచ్చింది. " ఏమని ఒప్పందం చేసుకుందాము " అని జింక అడిగింది. అప్పుడు నక్క ఇలా అంది ఉత్సాహంగా " అది మనల్ని రోజుకు ఎన్నో చంపే బదులు రోజుకు మనలో ఒకరిని సింహానికి ఆహారంగా పంపుదాం , ఎలా ఉంది ? నా సలహా " అంది. " సహబాష్  చాలా బాగుంది " అన్నాయి అన్నీ. ఈ విషయం మృగరాజు సింహానికి చెప్పగానే తాను వేటాడే శ్రమ లేకుండా ఆహరం దానంతట అదే తన వద్దకు వస్తుందని భావించి అంగీకారం తెలిపింది. అలా ప్రతిరోజూ - ఒక రోజు జింక , రెండో రోజు మేక , మూడో రోజు కోతి , నాల్గోనాడు ఎలుగు , ఐదో రోజు గొర్రె ఆహారంగా వెళ్ళసాగాయి. ఇలా మృగరాజుకు వేటాడనవసరం లేకుండానే రోజులు గడిచి పోతున్నాయి.

ఒక రోజున సింహానికి ఆహారంగా వెళ్లే వంతు కుందేలు మీద పడింది. కుందేలు తెలివి తేటల్లో దిట్ట. మంచి ఉపాయం వేసి మృగరాజు వద్దకు అనుకున్న సమయానికి వెళ్లకుండా కావాలని ఆలస్యం చేసింది. సింహానికి ఆకలి ఎక్కువ అయ్యి ఆగ్రహావేశంలో ఉంది. ఇంతలో కుందేలు రానే వచ్చింది. దాని మీద కోపంతో " ఏమింత ఆలస్యం , కుందేలా ! " అని గర్జించింది. దానికి సమాధానంగా ," నాతో మరొక జంతువును కూడా పంపారు. అయితే దాన్ని దారిలో ఒక సింహం అడ్డం వచ్చి చంపి తినేసింది. నేను తప్పించుకొని నీ వద్దకు వచ్చాను " అని అబద్దం చెప్పింది కుందేలు.

సింహం కోపంతో పెద్దగా గర్జిస్తూ " ఏమిటి ? నాకంటే బలమైన సింహం మరొకటి ఈ అడవిలో ఉందా ? దాన్ని చూపించు నాకు " అని అరిచింది కోపంగా! " రండి మహాప్రభూ " అని చెప్పి సింహాన్ని ఒక దిగుడు బావి దగ్గరకు తీసుకొని వెళ్లి చుడండి లోపల ఉంది " అన్నది కుందేలు. దాని ప్రతిబింబం నీళ్లలో చూసుకొని సింహం దానిని చంపడానికి ఆ బావిలో దూకి చచ్చిపోయింది. అలా కుందేలు చిన్నదైనా తన తెలివితేటలతో పెద్ద సింహాన్ని మట్టుపెట్టింది. అడివిలోని జంతువులన్నీ చాలా సంతోషపడినవి. 

Comments