Telugu Moral Stories for Kids 12 - Minakshi Minapa rottelu

మీనాక్షి - మినపరొట్టెలు

అనగనగ అవంతి దేశాన్ని విశాలవర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. తన దేశంలో ఎవరూ భిక్షాటన చేయకుండా జీవించాలని అనుకున్నాడు. దానితో దేశంలో భిక్షాటన వృత్తిని పూర్తిగా రద్దు చేసేసాడు. ఒకవేళ ఎవరైనా జాలితో దానం చేసినా అది నేరం అవుతుందని దానికి కఠిన శిక్ష ఉంటుందని దండోరా వేయించాడు. ఇదిలా ఉండగా మాధవరం అనే గ్రామంలో మీనాక్షి అనే పేద యువతి ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం మీనాక్షి మినపరొట్టెలు తయారుచేస్తూ ఉండగా ఒక సాధువు మీనాక్షి ఇంటి వద్ద సొమ్మసిల్లి పడిపోయాడు. అది చూసిన మీనాక్షి ఆ సాధువు ముఖం మీద నీళ్లు చిలకరించింది. స్పృహ వచ్చిన సాధువు "అమ్మ! నేను తీర్థ యాత్రలు చేస్తూ దేశమంతా తిరుగుతున్నాను. దారి మధ్యలో దొంగలు నా దగ్గర ఉన్న వస్తువులని, డబ్బులను గుంజుకున్నారు. మూడు రోజులనుండి ఏమి తినలేదు. ఈ దేశంలో మహారాజు ఆదేశానికి భయపడి ఎవరి ఇంటికి వెళ్లి అడిగినా ఒక ముద్ద అన్నం కూడా దానం చేయడం లేదు. అందువల్ల నీరసంతో స్పృహ కోల్పోయాను." అని చెప్పాడు.




అప్పుడు మీనాక్షి "అయ్యా ! ఇప్పుడే మినపరొట్టెలు చేసాను వాటిని తిని మీ ఆకలి తీర్చుకోండి" అని అంది. అప్పుడు సాధువు "అమ్మ! నీది చాలా మంచి మనసు నీకోసం చేసుకున్న రొట్టెలు నాకు పెడతానంటున్నావు, అంతే కాదు మినపరొట్టెలు నాకు దానం చేయడం వల్ల నీకు శిక్ష పడుతుంది. అందువలన నిర్దాక్షిణ్యంగా నీ చేతులు నరికేస్తారు అది నాకు ఇష్టం లేదు." అన్నాడు సాధువు. ఇప్పుడు అవన్నీ ఆలోచించకండి, ముందు మీ ప్రాణం నిలబెట్టుకోండి నా చెయ్యి పోయినా పరవాలేదు అని చెప్పి ఆ రొట్టెలను సాధువుకు పెట్టింది మీనాక్షి. వాటిని కడుపునిండా తిని మీనాక్షికి కృతఙ్ఞతలు చెప్పి ఆమె సంతోషంగా ఉండాలని ఆశీర్వదించాడు సాధువు. ఇదంతా చూసిన రాజభటులు మీనాక్షిని బంధించి సభలో ప్రవేశపెట్టారు. మీనాక్షి తాను రొట్టెలు పెట్టిన మాట నిజమేనని ఒప్పుకుంది. వెంటనే మహారాజు నేరం ఒప్పుకున్నా మీనాక్షికి కుడి చేయి నరికి వేయమని ఆజ్ఞాపించాడు.

కానీ రాజు మీనాక్షి యొక్క మంచితనం, అందం వలన ముగ్దుడై మీనాక్షి గురించి ఆరా తీయగా ఆమె యొక్క సేవా భావం రాజుకు తెలిసింది. కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది. దానితో చలించిన విశాలవర్మ తాను చేసిన తప్పు గ్రహించి కుడి చేయి లేని మీనాక్షిని వివాహం చేసుకున్నాడు. ఇది రాజు యొక్క మొదటి భార్య ఇందుమతి అస్సలు నచ్చలేదు.మీనాక్షి రాజుకు దగ్గర కావడం ఇందుమతి సహించలేకపోయింది. ఎలాగైనా ఆమెను అంతఃపురం నుండి పంపించేయాలని అనుకుంది. తగిన సమయం కోసం ఎదురు చూడ సాగింది. కొన్ని రోజులకు మీనాక్షికి మగ శిశువు జన్మించాడు. ఇలా ఉండగా రాజు ఒకసారి పొరుగు దేశం వెళ్ళాడు. ఇదే అదనుగా భావించి ఇందుమతి తన మనుషులందరినీ చేరదీసి మీనాక్షి ఒక మంత్రగత్తె, రాజును మాయ చేసింది లేకపోతే ఇలా చెయ్యి లేని దానిని రాజు ఎలా పెళ్లి చేసుకున్నాడు, వింతగా లేదు అని చెప్పుడు మాటలు ప్రచారం చేసింది. ఇది విన్న రాజమాత మీనాక్షికి నగర బహిష్కరణ శిక్ష విధించింది. ఆమెను రాజభటులు అడవిలో విడిచిపెట్టారు.



మీనాక్షి ఏమి చేయాలో తెలియక విలపించసాగింది. కొంత సేపటికి చంటిపిల్లాడు ఆకలితో గుక్కపెట్టి ఏడ్చాడు. పాలు లేకపోవడం వలన కనీసం మంచినీళ్లు అయినా పడదామని చెరువులోకి దిగింది. ఒక చేయి ఉండడం వల్ల నీరు తీసుకునేటప్పుడు పిల్లడు చేతిలోనుండి జారి చెరువులో పడ్డాడు. మీనాక్షి ఎంతో ఆవేదనతో రోదించసాగింది. ఈలోగా ఆ దారిలో వెళ్తున్న సాధువు మీనాక్షిని చూసి ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని ప్రశ్నించాడు. మీనాక్షి జరిగినదంతా చెప్పింది. అప్పుడు సాధువు "నీవు ఆ రోజు నాకు రొట్టెలు పెట్టి నన్ను కాపాడావు, నేను నా శక్తిని ఉపయోగించి నీ ఋణం తీర్చుకోవాలి. కానీ ఋణం తీర్చుకోవాలని నా స్వార్థం కోసం శక్తులు వాడలేని స్థితిలో ఉన్నా" అని అన్నాడు. అప్పుడు మీనాక్షి "అయ్యా ! మీరు మీ శక్తులను ప్రజల కోసమే వాడండి. నాకు ప్రత్యుపకారం చెయ్యాలని మీ శక్తిని క్షీణింపచేసుకోకండి" అని అంది. ఇలాంటి పరిస్థితిలో కూడా మీనాక్షి యొక్క గొప్ప మనస్సును చూసిన సాధువు "అమ్మ! నీలాంటి వాళ్ళు కారణజన్ములు. నా శక్తి నశించిన పరవాలేదు నీకు మూడు వరాలు ఇస్తాను కోరుకో" అన్నాడు. అప్పుడు మీనాక్షి తన బిడ్డను బ్రతికించమని కోరింది. వెంటనే మీనాక్షి చేతిలో బిడ్డ చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యాడు. 

దానికి మీనాక్షి సంతోషించి "అయ్యా! నాకు ఇంకేమి వద్దు." అని చెప్పింది. సాధువు అంతటితో ఆగకుండా ఆమె కుడి చెయ్యి మళ్ళా వచ్చేలా చేసి ఆమెను దీవించి వెళ్ళిపోయాడు. అదే దారిలో పొరుగు రాజ్యం నుండి తిరిగి వస్తున్న రాజు మీనాక్షిని చూసి జరిగిన విషయం తెలుసుకుని ఇందుమతికి తగిన శిక్ష వేసి మీనాక్షిని రాణిగా ఏ లోటు లేకుండా చూసుకున్నాడు.


Keyword : Telugu Moral Stories for kids

Comments