పాము - కప్పలరాజు
మందవిషము అనే ముసలిపాము ఒకటి ఉండేది. అది ఒకనాడు ఆహారము ఎచ్చటను దొరకక ఆకలి బాధ భరించలేక అటు ఇటు తిరుగుతూ ఒక చెరువు ఒడ్డునగల వందలాది కప్పలను చూసింది. ఆ కప్పలను చూసి ఎలాగైనా వాటిని తిని కొంత కాలము హాయిగా గడపవలెనని నిశ్చయించుకుని విచారములో మునిగి ఉన్నట్లు నటించుచు నెమ్మదిగా పాకుతూ చెరువు ఒడ్డునకు పోయినది. అక్కడున్న కప్పలు పాముని చూసి భయపడి పారిపోయాయి.
అప్పుడు పాము " ఓ మండూకములారా ! నేను మీ రాజుగారితో ఒక మనవి చేసుకొనుటకు వచ్చితిని , కానీ మిమ్మల్ని చంపుటకు రాలేదు , కనుక నన్ను చూసి మీరు భయపడవలసిన పని లేదు " అని చెప్పగా ఆ కప్పలకు రాజైన జలపాదుడు ఆశ్చర్యపడి " సర్పరాజా ! మండూకరాజగు జలపాదుడను వాడను నేనే ఇక్కడే ఉన్నాను . కనుక మీ మనవి ఏమిటో తెలుపుము " అన్నాడు. " కప్పలరాజా ! చిత్తగించుము నేను ఇంతవరకు పొట్టకొరకు ఒకరిని యాచించకుండానే కాలం గడిపి తిని , ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనుక చచ్చెనట్లు నేటి నుండి మీ సేవకుడినై బ్రతకవలసిన దురవస్థ కలిగి నిన్ను ఆశ్రయిస్తున్నాను. " అని చెప్పింది.
దానికి కప్పలరాజు " సర్పరాజా ! నీకు కలిగిన నష్టమేమిటి ? నీవు నన్ను ఆశ్రయించుటకు కారణమేమిటి ?" అని అడిగాడు. అందుకు మండవిషము దుఃఖపూరితమగు కంఠస్వరముతో ఇలా చెప్పింది " మండూక మహారాజా ! ఎంతవారికైనను కర్మ దాట వశము కాదు. నిన్న రాత్రి నేను ఆహారము కోసం తిరుగుచుండగా ఒక బ్రాహ్మణ బాలుడు చీకటిలో వచ్చుచు నన్ను త్రొక్కాడు. అందువలన నేను కోపించి గట్టిగా కాటు వేశాను. క్రమంగా నా విషం శరీరమంతా పాకి ఆ బాలుడు మూర్చపోయాడు. అప్పుడు ఆ బాలుని తల్లిదండ్రులు అతడు చనిపోయాడనుకుని గుండెలు బాదుకుని ఏడ్చుచుంటిరి. ఆ సంగతి తెలిసిన వారి బంధువు మరియు మంత్రశాస్త్రం తెలిసిన వాడైన ఒక బ్రాహ్మణుడు మంత్రం వేసి బాలునికి మందు సహితం ఇచ్చి బ్రతికించెను. పిమ్మట బాలుని తండ్రి నన్ను చూచి కోపం పట్టలేక ఇలా శపించాడు. " నా కుమారుని బాధించిన ఓ పాడు సర్పమా ! తినుటకు తిండి దొరకక నీకు ఆహారమగు కప్పలకు వాహనమై వాటిని మోయుచు అవి దయతలచి పెట్టిన ఆహారము తిని బ్రతుకుదువు గాక ! నీ పొగరు అణుగుగాక "
మృత్యువునైనను తప్పించుకొనవచ్చుగాని ఆ బ్రాహ్మణుడి శాపం తప్పించుకొనుట ఎంతవారికైనను సాధ్యం కాదు. కావున నిన్ను ఆశ్రయించి బ్రతకదలిచి వచ్చితిని. నీకు వాహనంగా ఉండి మోయుచు నీవు దయతో పెట్టిన ఆహారము తిని బ్రతుకుదును. దయవుంచి నన్ను నీవు సేవకునిగా గ్రహించి కాపాడుము అని పలికింది.
జలపాదుడు ఆ మాటలు నిజమని నమ్మి మందవిషమును చూచి జాలిపడి అతని కోరిక తీర్చడానికి అంగీకరించాడు. తరువాత అతడు తన మంత్రులతో కలిసి ఆనందముగా ఆ పాము పైకెక్కి కూర్చుని చెరువు చుట్టూ తిప్పమని ఆజ్ఞాపించాడు. మందవిషము ఆ కప్పలను కొంత దూరము మోసుకుని పోయి అలసినట్లు నటించి వేగముగా కదిలి వాటిని భక్షించెను. కనుక శత్రువులను నమ్మరాదు. తీయని మాటలు విని మోసపోరాదు.
Comments
Post a Comment