Telugu Moral stories for kids V

రామలింగడు - నలుగురు దొంగలు 




శ్రీకృష్ణదేవరాయులవారి కొలువులో తెనాలి రామలింగడు ఒక మహాకవి. ఎంతటి వారినైనా తన తెలివితో ఓడించగలడు. రాజును సంతోషపరచి బహుమతులు ఎన్నో పొందేవాడు. నలుగురు పేరు మోసిన దొంగలు రేపు రామలింగడి ఇంటిని దోచుకోవాలని పథకం వేసి దొంగలు రామలింగడి ఇంటి వెనుక తోటలో అరటిచెట్ల పొదలో నక్కి ఉన్నారు.

రామలింగడికి భోజనం వేళయింది. చేతులు కడుగుకోవడానికి రామలింగడు పెరటిలోకి పోయాడు. అనుకోకుండా అరటిచెట్లు వైపు చూసాడు. చీకటిలో దాగిన దొంగల్ని గమనించాడు. రామలింగడు కంగారుపడకుండా ఒక ఉపాయం ఆలోచించాడు. భార్యను పిలిచి పెద్దగా " ఊరిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ రోజు నగలు నాణాలు ఇంటిలో ఉంచకూడదు. వాటిని ఒక సంచిలో మూట కట్టి ఈ బావిలో పడేద్దాం !" అన్నాడు. ఆ మాటలు దొంగలు విన్నారు. రామలింగడి ఉపాయం ఫలించింది. తరువాత రామలింగడు భార్య చెవిలో ఏదో చెప్పాడు.

ఇంటిలోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు. ఒక మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదకబోయిన తీగ కాలికి తగిలిందని దొంగలు సంతోషించారు. అందరూ నిదురపోయేదాకా ఉంది తరువాత బావిలో దిగుదాం అని దొంగలు నిర్ణయించుకున్నారు. బాగా చీకటి పడింది. అందరూ నిదురపోయారు. ఆ నల్గురు దొంగలు అరటిచెట్ల వెనకనుండి లేచి బావిలోకి తొంగి చూశారు. మొదట ఒకడు బావిలోకి దిగి నగల మూట కోసం చాలా సేపు వెతికాడు. నీరు ఎక్కువగా ఉన్నందున నగల మూట దొరకలేదు.

నీరు బయటకు తోడితే మంచిదని మరొక దొంగ చెప్పాడు. సరేనని చేద బావిలోకి విడిచి చాలాసేపు నీరు తోడిపోశారు. రామలింగడు దొంగలు నీరు తోడిపోయడం చూశాడు. మళ్ళీ ఉపాయం ఆలోచించాడు. చప్పుడు చేయకుండా పెరటిలోకి పోయి అరటి చెట్లకి నీరు బాగా పారేలాగా పాదులు చేసాడు. వంతులవారీగా దొంగలు బావిలోని నీరు తొడసాగారు. ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. కానీ అరటిచెట్లకి నీరు బాగా పారింది. తెల్లవారు ఝామున  కోడి కూసే వేళవరకూ తోడిపోశారు. చివరకు మూట దొరికింది. కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు. ఎంతో ఆశగా చూస్తూ మూటముడి విప్పారు. అందులో నగలకు బదులు నల్ల రాళ్లు ఉన్నవి. దొంగలకు నోట మాటరాలేదు.

రామలింగడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది. సిగ్గుతో తలవంచుకుని పారిపోయారు. ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతోమందిని దోచుకోగలిగారు. కానీ రామలింగడి ఇంటిని మాత్రం దోచుకోలేక పోయారు. తెలివిగా రామలింగడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషపడి బహుమతులతో గౌరవించాడు.

చీమ - పావురము 



నది ఒడ్డున ఒక మర్రిచెట్టుపై ఒక పావురం ఉండేది. దానికి నదిలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమ కనబడినది. " ఆ చీమను ఎలాగైనా కాపాడాలి " అనుకున్నది పావురము.

వెంటనే ఒక మర్రి ఆకును కోసి చీమకు దగ్గరగా నీళ్లలో వేసింది పావురం. ఆ ఆకుపై చీమ ఎక్కి కూర్చుంది. తేలుతున్న ఆ ఆకు ఒడ్డును చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది. పావురంను చూసి అది చేసిన సహాయానికి తన ధన్యవాదాలు తెలియజేసింది చీమ.

చీమ కొంత దూరం ప్రయాణం చేస్తూ విల్లమ్ములతో అటువైపు వస్తున్న ఒక వేటగాణ్ణి చూసింది. ఆ వేటగాడు పక్షులకోసం నాలుగు వైపుల గాలిస్తూ , చెట్టు కొమ్మపై కూర్చుని తినడంలో నిమగ్నమైన పావురాన్ని వేటగాడు చూసాడు. చీమ దీనిని గమనించింది.

ఒక్క క్షణంలో వేటగాడు చెట్టు వెనక దాక్కొని బాణం ఎక్కుపెట్టి పావురానికి గురి పెట్టాడు. ఇది గమనించిన చీమ పరుగున వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయం చూసి చీమ వేటగాణ్ణి కుట్టింది. బాణం మాత్రం దూసుకుంటూ వెళ్ళిపోయింది. బాధతో వేటగాడు అరిచాడు. బాణం గురి తప్పింది. పావురం అక్కడి నుండి మరోచోటుకు ఎగిరిపోయింది.

తాను ఎలా రక్షింపబడ్డానన్న సంగతి పావురానికి తెలియలేదు. కానీ చీమకు మాత్రం తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు సంతోషం కలిగింది. మంచివారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుంది.

Comments