పులి - కొంగ
జంబూ ద్వీపములో ఒక అడివి ఉండేది. అందులో ఒక కొండ గుహలో పులి ఒకటి నివసించేది. దానికి సమీపములో గల ఒక జువ్వి చెట్టుపై ఒక కొంగ కాపురం ఉంది. పులి ఒకనాడు ఒక గొర్రెపోతును వేటాడి చంపి తింటుండగా దాని గొంతుకలో ఒక ఎముక గ్రుచ్చుకున్నది. దాని వలన పులికి చాలా బాధ కలిగింది. అది ఆ ఎముకను బయటకి తీయడానికి చాలా ప్రయత్నించింది. తలను అనేకసార్లు కిందకీ మీదికి ఆడించింది. నేలపై పడి దొర్లాడింది. అడివి అంతా మారుమ్రోగేలా గాండ్రించింది బాధతో. ఎన్ని చేసినా ఎముక మాత్రం బయటకు రాలేదు. ఆ పులి పడుతున్న బాధనంతా జువ్వి చెట్టుపైనున్న కొంగ చూసింది.
" పాపం ఎందుకు బాధపడుతోందో " అని జాలిపడింది. తక్షణమే ఆ పులి వద్దకుపోయి " నీకు కలిగిన కష్టమేమిటి? ఎందుకిలా ఏడుస్తున్నావు? " అని అడిగింది కొంగ. కొంగ మాటలు విని పులి " అన్నా ! నా గొంతులో ఒక ఎముక గ్రుచ్చుకున్నది. ఎంత ప్రయత్నించినా అది వూడిపడక నన్ను ఎంతో బాధపెడుతోంది , బాధకు ఆగలేక ఏడుస్తున్నాను. ఇంతలో దైవంలా నీవు వచ్చావు. నీవు కాక నాకు యీ సమయంలో సహాయపడగలవారు ఎవరూ లేరు. నీ పొడవైన ముక్కుతో నా గొంతులో గ్రుచ్చుకున్న ఎముకను తీసి నా ప్రాణాలు కాపాడు నీ మేలు ఎన్నటికీ మరువను. నన్ను నమ్ము. " అని బ్రతిమాలింది.
అప్పుడు కొంగ తన పొడవైన ముక్కును పులి నోటిలో పెట్టి నెమ్మదిగా దాని గొంతులో గ్రుచ్చుకొని వున్న ఎముకను పైకి తీసి పారవేసింది. తక్షణం పులికి కలిగిన బాధ తగ్గింది. అందువలన అది ఎంతో ఆనందించింది. కొంగను అనేక విధముల కొనియాడింది. ఆ నాటి నుండి అవి రెండు స్నేహముగా వుండసాగినవి. అప్పుడప్పుడు కలిసికొని ఆడి పాడి ఆనందించేవి. ఇలా కొంత కాలం జరిగింది. ఒకనాడు ఆ పులికి ఎంత ప్రయత్నించినా ఆహరం దొరకలేదు. క్రమంగా దానికి ఆకలి ఎక్కువై ఆకలి బాధకు ఆగలేక అది తనలో ఇలా అనుకుంది.
" అయ్యో! నేను ఎవరి ముఖం చూచానో గాని చిన్న పిట్ట అయినా దొరకలేదు. నేనీ ఆకలి బాధకు ఆగలేకున్నాను , ఏం చేయను ? ఇప్పుడు నా మిత్రుడైన కొంగను చంపి తినడం కంటే నా ఆకలి బాధ తీర్చుకొనుటకు మరియొక మార్గం లేదు. మిత్రద్రోహం చేయుట మంచిది కాదు. కానీ ప్రాణాలు కాపాడుకోవడం నా ధర్మం. తప్పు కాదు అని నిశ్చయించుకుంది. పూర్వము ఒకప్పుడు తన గొంతుకలో ఎముక గ్రుచ్చుకొన్నప్పుడు ఏడ్చినట్లు ఏడుస్తూ బాధ నటించసాగింది. ఆ సమయంలో కొంగ అక్కడకి వచ్చి , " మిత్రమా , ఎందుకిలా ఏడుస్తున్నావు? " అని అడిగింది.
" మిత్రుడా ! నీవు లోగడ చేసిన ఉపకారానికి నేను ప్రత్యుపకారము చేయకముందే తిరిగి మరొక ఆపద తెచ్చి పెట్టుకున్నాను. పూర్వములాగా నా గొంతుకలో నేడు ఒక ఎముక గ్రుచ్చుకొని చాలా బాధించుతోంది. నాడు నీవు నా గొంతునుండి ఎముక తీసి నన్ను కాపాడినట్లే ఇప్పుడు కాపాడుము. నీ మేలు ఎప్పటికి మరువను. నేను సంపాదించిన ఆహారంలో నీకు కొంత భాగము యిస్తుంటాను. " అని పులి చెప్పింది. కొంగ దాని మాటలు నిజమని నమ్మి ముందులాగా పులి నోటిలో తన తలనుంచి ఎముకను తీయుటకు ప్రయత్నించింది. అదే సమయమని పులి దాని మెడ కొరికి చంపివేసింది.
దుర్మార్గులు మిత్రద్రోహం చేయుటకైనను జంకరు , మేలు చేసినవారికైనను హాని చేయదలిచెదరు.
Comments
Post a Comment