Telugu Moral Stories for Kids VII

నీలి రంగు నక్క 




ఒక అడివిలో ఒక నక్క ఉండేది. ఒకనాడు అది చీకటి పడిన తరువాత ఒక గ్రామములో తిరుగుతూ పొరపాటున ఒక చాకలి బానలో పడింది. నీలిరంగు నీటితో నిండివున్న ఆ బాననుండి ఎంత ప్రయత్నించినా అది పైకి రాలేకపోయింది. మరికొంత సేపటికి సూర్యోదయమైంది. అప్పుడు చాకలివాడు అక్కడికి వచ్చి కాళ్ళు పైకి పెట్టుకుని , కళ్ళు మూసుకొని , పళ్ళు బయటపెట్టుకుని వున్న ఆ నక్కనుచూచి నిజంగా చచ్చిందనుకున్నాడు. నెమ్మదిగా దానిని ఆ బాననుండి బయటకులాగి ఎత్తుకునిపోయి ఊరిబయట పడవేసిపోయాడు.

అప్పుడు ఆ నక్క " బ్రతుకుజీవుడా " అనుకుని పైకి లేచి అడివిలోకి పారిపోయింది. కొంతసేపటికి అది తన శరీరమంతా నీలిరంగులో ఉండటం చూసి మురిసిపోయింది. " నేను ఇప్పుడు మహా విష్ణువువలె నీలవర్ణం గలవాడను , ఉత్తమ కులం గలవాడను అయ్యాను. కనుక నేనీ రంగుచూపి ఉపాయంతో ఈ అడవిలో ఉన్న జంతువులకు రాజునై పాలించుతాను. " అని నిశ్చయించుకున్నది. ఇలా ఆలోచించుకుని అది ఆ అడవియందున్న నక్కలన్నిటిని పిలిచి సభచేసి " మిత్రులారా ! మన దేవత నన్ను యీ అడవికి రాజుగా ఉండమని ఆజ్ఞాపించింది , అందువల్లనే నా దేహమంతా నీలవర్ణమైంది. మీరందరూ సంతోషంగా ఉండాలంటే నా ఆజ్ఞ ప్రకారము యీ అడివిలో ఉండాలి. " అని చెప్పింది. నక్కలు ఆ నీలవర్ణపు నక్క మాటలు నమ్మి సాష్టాంగ నమస్కారము చేశాయి.

" చిత్తము ప్రభూ ! తమ ఆజ్ఞానుసారము చేయుదుము " అని పలికి ఆ నక్కను భక్తి శ్రద్ధలతో సేవింపసాగాయి. వాటిని చూచి క్రమముగా ఆ అడివియందున్న సింహములు , పులులు , ఏనుగులు , ఇతర జంతువులు కూడా ఆ నీలవర్ణపు నక్కకు భయపడి తిరగసాగినవి. ఈ విధముగా పెద్ద పెద్ద జంతువులు తనని సేవించడం చూచి ఆ నక్కకు గర్వం పెరిగింది. క్రమంగా అది తన జాతివారిని చూసి అసహ్యపడసాగింది. పెద్ద పదవులు అన్నియూ పెద్ద జంతువులకు ఇచ్చి చిన్న చిన్న పనులకు నక్కలను నియమించసాగింది. తనను చూడడానికి వచ్చిన నక్కలను కలవకుండా తిప్పి పంపేది. అందువలన ఒకనాడు అడివిలో ఉన్న నక్కలు అన్నీ కలిసి సభ చేశాయి. " స్వజాతి వాడని అభిమానించి రాజుగా ఎన్నుకున్నందుకు మనల్ని నీచంగా చూస్తున్నాడు. అనేకవిధాలుగా అవమానిస్తున్నాడు . అవమానంతో బ్రతికే కంటే మరణించడం మంచిది. " అని చింతించాయి.

ఒక ముసలి నక్క లేచి , " సోదరులారా ! గొప్ప జంతువులు మనము చేసిన ప్రచారము నమ్మి దాని రంగును చూసి మోసపోయినవి. ఇది మహిమ గల నక్క అని నమ్మి రాజుగా కొలుస్తున్నాయి. ఇప్పుడు మనం దాని నిజస్వరూపము బయట పెట్టవలెను. అప్పుడు గాని దానికి బుద్ధి రాదు " అని ఒక ఉపాయం చెప్పింది.

ఆ ఉపాయంప్రకారం నక్కలన్ని సాయంత్రం ఆ నీలవర్ణపు నక్క దగ్గరకు చేరి గట్టిగా ఊళ పెట్టాయి. నక్క తన జాతి స్వభావం వల్ల వాటితో కలిసి తాను కూడా ఊళ పెట్టసాగింది.
అక్కడ ఉన్న మిగిలిన జంతువులు ఇది చూసి ఆశ్చర్యపోయాయి. వాటిలో ఒక సిమహాము " ఇది మామూలు నక్కయే గాని దేవలోకమునుండి ఊడిపడినది కాదు. మనము రంగు చూసి మోసపోయాము. మనవంటి పెద్దలను ఇలా అవమానించినందుకు తగిన ఫలము అనుభవించాలి ! " అని నీలవర్ణపు నక్కపై పడి చంపింది. కనుక అనువు  గాని వేషములు ఆపదలు మూలము. 

Comments