Telugu Moral Stories for Kids VIII

కోతి - మొసలి



ఒక అడవిలో కొన్ని కోతులు నివసించేవి. అందులో బలవర్ధనుడు అనే ఒక వానరుడు ఆహరం నిమిత్తం అటు ఇటు తిరుగసాగాడు. ఒక నది ఒడ్డున చక్కగా పళ్ళు ఉన్న ఒక మేడి చెట్టును చూసి ముచ్చట పడ్డాడు. చెట్టుపైకెక్కి ఒక పండు తిన్నాడు. అది ఎంతో రుచిగా ఉన్నందున ఆ కోతి తిరిగి తన నివాసమునకు పోక , ఆ నాటి నుండి మేడి చెట్టుపై నివసించసాగింది. అది ఆ మేడి పండ్లు భుజించి సమీపమునే ఉన్న నదిలో నీరు త్రాగి హాయిగా కాలము గడపసాగింది. ఇలా ఉండగా , ఒకనాడు ఆ కోతి తింటున్న పండు ఒకటి నదిలో పడి " బుడింగ్ " అని ధ్వనిచేసింది. ఆ ధ్వని కోతి చెవులకు ఎంతో ఇంపుగా అనిపించింది.

అందువలన అది మరికొన్ని పండ్లు కోసి నదిలోకి విసిరి ఆ శబ్దమునకు సంతోషపడసాగింది. అప్పుడు ఆ నదిలో నివసించుచున్న క్రకచము అను మొసలి ఒడ్డునకు వచ్చి ఆ కోతి విసురుతున్న మేడి పండ్లను చూసి , ఒక పండు తీసి తిన్నది. అది ఎంతో రుచిగా ఉండుట వలన ఆ కోతి విసిరిన పండ్లు అన్నియూ తిని పైకి వచ్చి చెట్టుపైనున్న కోతిని చూసి ఇలా అంది.

" కోతిబావా! నాకు మేడిపండ్లను తినవలెనని ఎంతో కాలము నుండి కోరికగా ఉన్నది. కోసిపెట్టు పుణ్యాత్ములు ఎవరునూ లేక నా కోరిక తీర్చుకొనలేక పోవుచున్నాను కనుక నా యందు దయయుంచి కొన్ని పండు కోసి పెట్టుము " అన్నది. ఆ కోతి జాలిపడి అనేక పండ్లు కోసి పెట్టినది. మొసలి ఆ పండ్లను తిని ఎంతో ఆనందించెను. ఇలా ప్రతి దినము ఆ కోతి పండ్లు కోసి పెట్టుచుండగా మొసలి వాటిని తిని ఆనందించసాగింది. క్రమముగా అది తన ఇంటిని , భార్యను మరచిపోయింది. కోతితో ఆడుతూ , పాడుతూ అక్కడే ఉండిపోయింది.
దాని భార్య తన భర్త జాడ తెలియక దిగులుపడి వెతుకసాగింది. కొంతకాలమునకు అది తన భర్త కోతితో స్నేహము చేసి ఇంటి ముఖము పట్టుటలేదని తెలిసి దుఃఖపడింది. వారి స్నేహాన్ని ఎలాగైనా చెడగొట్టాలని చూడసాగింది.

ఇలా ఉండగా క్రకచము ఒకనాడు మేడిపండ్లను తీసికొని ఇంటికి వచ్చుచుండగా దాని భార్య చూసి , గబగబా లోనికిపోయి , పడుకుని రోగముతో వున్నట్లు నటించసాగింది. కొంతసేపటికి క్రకచము అచ్చటకు వచ్చి భార్యను చూసి " ఓయి , నీవిట్లు పడుకుని ఉండుటకు కారణమేమి ? " అని ప్రశ్నించింది. ఆమె ప్రక్కనున్న చెలికత్తె యిలా చెప్పింది.

" అయ్యా ! నీవు కొంతకాలమునుండి ఇంటికి వచ్చుటలేదు. నీ జాడ తెలియక ఈమె బెంగ పెట్టుకుని ఏడ్చి ఏడ్చి తీరని రోగము తెచ్చి పెట్టుకున్నది. కోతి యొక్క గుండెకాయ తెచ్చి యిచ్చినచో మంచి ఔషధము తయారు చేసి యిచ్చి రోగము బాగుచేయగలమని వైద్యులు చెప్పారు. ఇతర మందులు ఎన్ని ఇచ్చినా ఈమె రోగము తగ్గకున్నది. నిన్ను చూసి ప్రాణము విడువవలెనని నీ రాక కోసం ఎదురుచూస్తున్నది. " అని చెప్పెను. క్రకచము ఆ మాటలు విని యిలా ఆలోచించింది.

" నా భార్యను ఎట్లయినను బ్రతికించుకొనవలెను. నా మిత్రుడు తప్ప ఈ ప్రాంతములో మరియొక కోతి లేదు. నేను ఏమి చేయుదును ? బలవర్ధనుడు నాకు నచ్చిన స్నేహితుడు అతన్ని చంపుట దోషమే. కానీ నా భార్యను బ్రతికించుకొనుటకు వేరే మార్గము లేదు. ఏ విధముగా చూసిన భార్యకన్నా స్నేహితుడు ఎక్కువ కాదు. కనుక దాన్ని చంపి నా భార్యను బ్రతికించుకుంటాను " అని నిశ్చయించుకుని కోతి వద్దకు వెళ్ళింది. కోతి మొసలిని చూసి " మిత్రుడా ! ఒకటి రెండు రోజులలో తిరిగి వచ్చెదనని ఇంటికి పోయినవాడవు ఇప్పుడే వచ్చితివేమి ?" అని అడిగింది.

క్రకచము నవ్వి " మిత్రమా ! ఇంతకాలము నుండి నీతో స్నేహముగా ఉన్నాను గాని నిన్ను ఒకసారి కూడా నా యింటికి తీసుకుపోలేదు. నిన్ను తీసుకురాలేదని నా భార్య నిష్ఠురముగా మాట్లాడింది. అందువలన నిన్ను తీసుకుపోతాను నా వీపు పై కూర్చుని మా యిల్లు చూచుటకు రమ్ము " అని కోరింది. కోతి మొసలి మాటలు నమ్మి చెట్టు దిగివచ్చి వీపు మీద కూర్చుంది. మొసలి కొంత దూరం వెళ్లిన తరువాత తాను చేస్తున్న పనికి చింతించసాగింది. ఇది గమనించిన కోతి " మిత్రమా ! ఇంటి వద్ద అంతా కుశలమే కదా ? ఎందుకు దిగులుగా ఉన్నావు ? " అని అడిగింది.

దీర్ఘాలోచనలో ఉన్న మొసలి మైమరిచి అసలు విషయం నోరు జారింది. ఆ మాటలు విన్న కోతి ఉలిక్కిపడింది. " ఈ నీచుని మాటలు నమ్మి చేతులారా చావు తెచ్చుకున్నాను. దీని నుండి ఎలాగైనా బయటపడాలి. " అని ఆలోచిస్తూ ఉండగా  ఒక ఉపాయము తట్టింది. కోతి మొసలిని చూసి ఇలా అంది. " ఓయి ! ఎంత పని చేసితివి. ఈ సంగతి నాకు ముందే చెప్పివుంటే నా గుండెను తెచ్చేవాడిని. ముసలివాడిని అగుటచే ఇంత దూరం మోసికొని రాలేక ఇంటి వద్ద దాచి ఉంచాను. ఎంత తెలివి తక్కువ పని చేసితివి ? పోయి తీసుకొని వద్దాము పద , కాలము వృధా అవుచున్నది. " మొసలి కోతి మాటలు నిజమని నమ్మి దానిని మోసికొని చెట్టుగల ప్రాంతమునకు తీసుకువెళ్ళింది.

చెట్టు వద్దకు వెళ్ళగానే బలవర్ధనుడు గబగబా చెట్టెక్కి హాయిగా కూర్చుంది. అది ఎంత సేపటికి తిరిగి రాకపోయేసరికి మొసలి విసుగు చెంది " మిత్రుడా! గుండెకాయ తెస్తానని తీరుబడిగా కూర్చుంటివేమి ? వేగముగా రమ్ము " అని పిలిచింది. దానికి కోతి " ఓరి ! మిత్రద్రోహి ! నీ అభిప్రాయము నాకు తెలియదనుకున్నావా ? నన్ను చంపి నీ భార్యను బ్రతికించుకోదలచిన నిన్ను నమ్మి వస్తానని ఇంకా ఆశిస్తున్నావా ? చాలు చాలు సిగ్గుపడి వెనుకకుపొమ్ము " అని మందలించి పంపించింది.

మొసలి తన స్నేహితుడిని కోల్పోయినందుకు , తన దుర్బుద్ధికి విచారించి చేసేదేమి లేక వెనుదిరిగింది.

Comments