Telugu Moral Stories for Kids X

పిల్లి - గ్రద్ద 

telugu neethi kathalu


భాగీరథీ తీరమందు ఒక గొప్ప జువ్వి వృక్షము గలదు. దాని తొర్రలో జరద్గవము అనే ఒక ముసలి గద్ద నివాసముండేది. ఆ వృక్షము మీద నివసించే పక్షులు దానికి తాము తెచ్చుకున్న ఆహారములో కొంచెం పంచి ఇచ్చేవి. గ్రద్ద ఆ ఆహారంతో జీవనం సాగించేది. ఒకనాడు దీర్ఘకర్ణము అనే పిల్లి పక్షి పిల్లలను తినడానికి ఆ చెట్టు వద్దకు వచ్చింది. దాని రాకకు భయపడిన పిల్లలు కూయసాగాయి. ఆ శబ్దానికి ఎవరో చెట్టువద్దకు వచ్చారని గ్రహించి " ఎవరక్కడ ? " అని గట్టిగా హెచ్చరించింది గ్రద్ద.

అప్పుడా పిల్లి గ్రద్దను చూసి భయపడి " అయ్యో ! చచ్చితిని కదా ! ఆకలికి వచ్చి ఇక్కడ చిక్కుకుపోయాను , ఇప్పుడు బయటపడు మార్గం కూడా లేదు. జరిగేది జరగక మానదు. ఇప్పుడు వెనుకంజ వేయరాదు. నిండా మునిగాక ఇంకా చలేమిటి. " అని అలోచించి ఆ గ్రద్ద ఎదురుగా నిలబడి ఇలా అన్నది.

" అయ్యా ! నమస్కారము " అని పిల్లి అనగానే " నీవు ఎవరు ? " అని గ్రద్ద అడిగింది. " నేను పిల్లిని నన్ను దీర్ఘకర్ణమని పిలుస్తారు " అని చెప్పగానే గ్రద్ద కోపంతో " నీవు ఇక్కడ నుండి వెంటనే పారిపో లేకపోతే నీ ప్రాణాలు మిగలవు " అంది. దానికి పిల్లి " ముందు నా మాట వినండి. తరువాత నన్ను చంపడం తగిన పని అనిపిస్తే అలాగే చెయ్యండి. గుణగణములు బట్టి నిర్ణయం తీసుకోవాలి కానీ జాతి బట్టి నిశ్చయించదగునా ?" అని పలుకగా నీవు వచ్చిన పనేమిటని గ్రద్ద అడుగగా యిట్లనియె.

" ఇక్కడ గంగలో నిత్యము స్నానము చేయుచు మాంసము విడిచి బ్రహ్మచారినై చాంద్రాయణ వ్రతము చేయుచున్నాను. మీరు ధర్మజ్ఞులని , మంచివారని ఇచ్చటి పక్షులు పొగుడుతుంటే విన్నాను. చాలా రోజులనుండి మీ దర్శనము చేసుకోవాలని కోరిక వున్నది. అది ఈ రోజుకు ఫలించింది. మీరు విద్యా వయోవృద్ధులు కాబట్టి మీ నుండి ధర్మములు  నేర్చుకోవాలని అనుకుంటున్నాను. శత్రువైనను గృహమునకు వస్తే ఆతిథ్యము చేయవలెనని చెప్పెదరు. మీరు నన్ను చంపుట న్యాయమా చెప్పండి " అని పిల్లి పలికింది.

అప్పుడు గ్రద్ద " పిల్లులకు మాంసము రుచి బాగా మక్కువ. ఇక్కడ నా పక్షి పిల్లలున్నాయి . అందుకే నేను అలా మాట్లాడాను " అనగా పిల్లి రెండు చెవులు మూసుకుని " కృష్ణ ! కృష్ణ ! ఎంతో పాపం చేయడం వల్ల ఈ పిల్లి జన్మ వచ్చింది. అది చాలక మరో పాపం చేస్తానా ? తెలియక చెడిన కాలం పోనిమ్ము. తెలిసి ఇంకా చెడతానా ? ఈ మాటలు వినడం కన్నా ఇక్కడే మరణించడం మంచిది " అని చెప్పింది.

" కోపము చేయకు . క్రొత్తగా రాగానే వచ్చినవారి స్వభావము ఎలా తెలుస్తుంది. అప్పుడు తెలియక చెప్పిన మాటలు తప్పుగా తీసుకోకు. నీవు ఈ ప్రదేశములో ఇష్టానుసారం రావచ్చును పోవచ్చును. నీకు ఏ అడ్డంకి వుండదు. " అని గ్రద్ద చెప్పింది. అవి రెండూ ఇలా కొంత కాలం స్నేహముగా వున్నాయి. కొన్ని రోజుల తరువాత పిల్లి గ్రద్దకు తెలియకుండా ప్రతిరోజూ పక్షిపిల్లల్ని చంపి తన తొర్రలో తినసాగింది.

అక్కడి పక్షులు తమ పిల్లలు కనిపించక దుఃఖముతో ఆ ప్రదేశమంతా వెదకనారంభించెను . అది గమనించి పిల్లి తొర్ర వదిలి పారిపోయింది. ఆ పక్షులు వెదుకుచూ వచ్చి తొర్రలో తమ పిల్లల ఎముకలు చూసి ఆ గ్రద్దయే తమ పిల్లలను భక్షించినదని నిశ్చయించి దానిని గోళ్ళతో రక్కి , ముక్కులతో పొడిచి చంపాయి. గుణగణాలు తెలియకుండా క్రొత్తవారికి స్థానమిస్తే గ్రద్దవలె నాశనం నిశ్చయముగా కలుగును. 

Comments