Telugu Moral Stories for Kids XI

పులితోలు కప్పుకున్న గాడిద 



కరిపురం అను ఊరిలో విలాసుడు అను చాకలి బట్టలు మోయు నిమిత్తం ఒక గాడిదను కొనెను. తన డబ్బు ఖర్చు కాకుండా దానిని పెంచవలెనని తలిచి అతడొక ఉపాయం ఆలోచించాడు. ఎదో ఒక విధముగా పులితోలు ఒకటి సంపాదించి తెచ్చాడు. దానిని ఆ గాడిద పై కప్పి రాత్రి సమయములో ఆ వూరిలో ఉన్న పంటచేలోకి తోలసాగాడు. అది పొలములో పడి చక్కగా పండిన పైరును కడుపు పట్టినంత తిని తెల్లవారేసరికి తన యజమాని ఇంటికి పోవుచుండేది. ఇలా పొలములో ప్రవేశించి పైరు మేయుచున్న పులి తోలు కప్పుకున్న గాడిదను చూసి పొలం కాపు కాసేవారు అది నిజమైన పులే అనుకుని భయపడి పారిపోయేవారు. అందువలన గాడిద ఎలాంటి ఆటంకము లేక ప్రతిదినం ఆ పొలములో పడి  తృప్తిగా మేత మేసి పోయేది.

ఆ విధముగా తన పొలములో ప్రవేశించి పంటనంతా పొట్టన బెట్టుకునే మయాపులిని చూసి ఒక పొలం యజమాని చాల బాధపడేవాడు. దానిని తన పొలములో ప్రవేశించకుండా చేయగల మార్గం తోచక చింతించేవాడు. క్రమముగా అతనికి పులిపై అధికమైన కోపం కలిగింది. అతడు ఇక కోపం పట్టలేక ఏ విధముగానైనా దానిని చంపాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాటి రాత్రి బూడిద రంగు గల దుప్పటి కప్పుకొని , విల్లమ్ములు చేత బట్టి పొలమునకు బయలుదేరాడు. ఒక చెట్టు కింద కూర్చుని పులి రాక కోసం ఎదురుచూశాడు. మరికొంతసేపటికి రోజూలాగే అలవాటు ప్రకారం పులి తోలు కప్పుకొన్న గాడిద పొలంలోకి ప్రవేశించింది. అది ఇటు అటు తిరుగుతూ చెట్టు కింద దుప్పటి కప్పుకొని కూర్చున్న పొలం యజమానిని చూసి ఇంకొక గాడిద అని భావించింది. ఇంత కాలానికి నాకు ఒక జతగాడు దొరికాడు అనుకొని పట్టరాని ఆనందముతో పళ్ళు ఇకిలించి ఓండ్ర పెట్టసాగింది.

పొలం యజమాని దాని అరుపు విని ఎంతో ఆశ్చర్యపోయాడు. ముక్కు పై వేలు పెట్టుకుని " ఔరా ! ఇది మోసకారి గాడిద. పులి తోలు కప్పుకొని వచ్చి ఇంత కాలం మా కళ్ళు గప్పి మా పంటచేలను పొట్టనిండా మెక్కి పోతోంది. దీనికి తగిన శాస్తి చేయకుండా వదలకూడదు. " అని తలచాడు. పులి తోలు కప్పుకున్న గాడిద విషయం అందరి యజమానులకు చెప్పాడు. వారు మొదట అతని మాట నమ్మకపోయినా ఆ రోజు రాత్రి అందరు గాడిద విషయం తేల్చాలని అతని వెంట పొలానికి బయలుదేరారు. అందరు చీకట్లో దాక్కున్నారు , అలవాటు ప్రకారం వచ్చిన గాడిద అక్కడ అలికిడి విని " మిత్రమా! ఈ రోజైనా  నాతో మాట్లాడవా ? " అని ఓండ్ర పెట్టింది. గ్రామస్తులందరూ ఆ గాడిదకు గట్టిగా దేహశుద్ధి చేయడంతో దెబ్బలకి తట్టుకోలేక చనిపోయింది.

నోరు కట్టుకోలేక ఆ గాడిద చనిపోయినది కనుక ఎవరికీ నోటి దురుసుతనం పనికిరాదు. మేలు కోరేవాడు వినయవిధేయతలు కలిగి ప్రవర్తించవలెను గాని నా అంత వాడు లేదని మిడిసి పడకూడదు. 

Comments