బంగారు ఎలుక
అనగనగ భీమవరం అనే పట్టణంలో ఒక వ్యాపారి నివసించేవాడు. తన వ్యాపారం బాగా అభివృద్ధి చేసి అతడు ఎంతో డబ్బు సంపాదించి సుఖంగా జీవించసాగాడు. ఇదిలా ఉండగా ఒకసారి తీవ్రమైన జబ్బు చేసి వ్యాపారి మరణించాడు. ఆ వ్యాపారి భార్య, భర్త అకాల మరణానికి ఎంతగానో దుఃఖించింది. ఆ సమయానికి ఆమె గర్భవతి. భర్త సమీప బంధువులందరూ అతను చనిపోయిన వెంటనే మొత్తం ఆస్తిని కాజేశారు. దానితో ఏమి చేయాలో పాలుపోక ఆ వ్యాపారి భార్య విలపించింది. కొంత కాలానికి ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. తాను కటిక పేదరికం అనుభవిస్తున్నా కష్టపడి తన కొడుకుని పెంచసాగింది. ఎప్పటికైనా తన బిడ్డ బాగా ధనవంతుడవ్వాలని ఆ పిల్లవాడికి కోటీశ్వరుడు అని పేరు పెట్టి భగవంతుని నిత్యం ప్రార్థించేది. కొడుకుని కోటి అని పిలుచుకుని మురిసిపోయేది. కోటి పెద్దవాడయ్యాక ఒక రోజు జరిగిన విషయం అంతా చెప్పింది. ఇదంతా విన్న కోటి తాను కూడా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తానని ఆమెతో చెప్పగా పెట్టుబడి కోసం ఆ ఊరిలో ఉన్న పెద్ద వ్యాపారి ధనగుప్తుని వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చింది. ధనగుప్తుడు కొత్త వ్యాపారులకు డబ్బు ఇచ్చి సహాయం చేస్తాడని పేరు ఉంది.