Telugu Moral Stories for Kids 15 Marugujjula Sahayam

మరుగుజ్జుల సహాయం



అనగనగ సీతాపురం అనే ఊరిలో రాఘవ అనే పేద రైతు ఉండేవాడు. అతడు ఆ ఊరి భూస్వామి నుండి పది ఎకరాల పొలం కౌలుకి తీసుకున్నాడు. అయితే ఆ భూమి ఏమంత సారమైనది కాదు. అయినా కష్టపడితే అసాధ్యమేదీ ఉండదనే మొండి ధైర్యంతో రాఘవ అతని భార్య అందులో ఎండనక వాననక శ్రమపడేవాళ్లు. కానీ అందులో వచ్చే ఆదాయం వారి తిండికి, బట్టకి కూడా సరిపోయేది కాదు. ఇదిలా ఉండగా ఒక సంవత్సరం వరద వచ్చి పంటతో పాటు అతని ఒక ఎద్దు కూడా కొట్టుకుపోయింది. అయినా కౌలు డబ్బు చెల్లించక తప్పదు కనుక తన రెండో ఎద్దును తోలుకుని సంతలో అమ్మడానికి బయలుదేరాడు. దారిలో రాఘవకి వింత దుస్తులలో ఉన్న మరుగుజ్జు ఒకడు కనపడ్డాడు. వాడు కుంటుకుంటూ రాఘవ దగ్గరకి వచ్చి "నా కాలికి దెబ్బ తగిలింది. నేను కూడా నువ్వు వెళ్లే దారిలోనే వెళ్ళాలి. నువ్వు నన్ను నీ ఎద్దు మీద కొంత దూరం సవారీ చేయనిస్తావా?" అని అడిగాడు. అతని పరిస్థితికి రాఘవ జాలిపడి "నీకు బాధ ఉన్న మాట వాస్తవమే. కానీ గాడిద, గుఱ్ఱంలాగా ఎద్దు సవారీ జంతువు కాదు. గోజాతి మీద సవారీ చేయడం తప్పు" అన్నాడు. దానికి ఆ మరుగుజ్జు దీనంగా చీకటి పడేలా ఉంది, ఈ అడివిలో నేను ఏ క్రూర మృగానికో బలవక్క తప్పదు అన్నాడు. రాఘవకు మరింత జాలి కలిగి "సరే ఆపద్ధర్మం అని ఒకటి ఉంది కదా" అని చెప్పి అతనిని ఎద్దు మీద కూర్చోబెట్టాడు.


అలా వెళ్తుండగా మరుగుజ్జువాడు మాటలలో రాఘవ పరిస్థితి తెలుసుకుని "నువ్వు ఎంతో దూరం శ్రమపడి సంతకు వెళ్లడం ఎందుకు? నేనే నీ ఎద్దును కొంటాను." అన్నాడు. రాఘవ దానికి అంగీకరించగా మరుగుజ్జువాడు వెంటనే తన జేబులోనుండి ఒక చిన్న మరచెంబును బయటకు తీసాడు.  అది రాగిది, దాని మీద మరుగుజ్జుల బొమ్మలు చిత్రించబడి వున్నాయి.మరుగుజ్జు దానిని రాఘవకి ఇచ్చి నీ ఎద్దుకు ఇదిగో ప్రతిఫలం సరిపోయింది అన్నాడు. దానికి రాఘవ బిత్తరపోయి నేను ఈ మర చెంబుతో కౌలు డబ్బు ఎలా కట్టగలను అని అమాయకంగా అడిగాడు. అప్పుడు మరుగుజ్జు "అయ్యో నా మతిమరుపు! నీకు అసలు విషయం చెప్పడం మరిచాను, నీవు ఇంటికి వెళ్లి శుచిగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి అక్కడ ఈ మరచెంబు ఉంచు. తరువాత దాని మూత తెరిచి మరచెంబు! మరచెంబు! నీవు చెయ్యగలిగిన సాయమేదో చెయ్యి అని అనాలి. తెలిసిందా?" అని ఎద్దును అదిలించి చెట్ల చాటుకు వెళ్ళిపోయాడు.


రాఘవ ఇంటికి వెళ్లి ఈ విషయం తన భార్యతో చెప్పాడు. దానికి ఆమె "ఏం చేస్తాం, నిన్ను ఎవరో బాగా మోసం చేసారు" అని బాధపడింది. రాఘవ మాత్రం ప్రయతించడంలో తప్పు లేదుగా అని చెప్పి మరుగుజ్జు వివరించిన విధంగా చేసి మరచెంబు! మరచెంబు! నువ్వు చెయ్యగలిగిన సాయమేదో చెయ్యి అని అడిగాడు. వెంటనే ఆ మరచెంబులో నుండి ఇద్దరు మరుగుజ్జులు బయటకు వచ్చి ఆ గది బంగారు,వెండి నాణాలతో నింపేశారు. రాఘవ, అతని భార్య ఆశ్చర్యంతో చూస్తుండగానే బంగారు పాత్రలతో రుచికరమైన భోజనం వడ్డించి మరుగుజ్జులు అదృశ్యమైపోయారు. వారు ఏనాడూ అంత రుచికరమైన భోజనం తినలేదు. ఆ డబ్బుతో మంచి ఇల్లు కొనుక్కుని వారు ఆనందంగా ఉండసాగారు. కొన్ని రోజులకి రాఘవకి పట్టిన అదృష్టం గురించి, మరచెంబు గురించి ఆ నోట ఈ నోట భూస్వామికి తెలిసింది. చెడ్డ బుద్ధి కలిగిన భూస్వామి రాఘవ ఇంట్లో లేనప్పుడు తన అనుచరులతో వచ్చి డబ్బును, మరచెంబును దొంగిలించాడు. భూస్వామికి ఉన్న పలుకుబడివల్ల రాఘవ ఏమి చేయలేక తిరిగి పేదరికం అనుభవిస్తూ కష్టపడ్డాడు. ఇదంతా చూసిన అతని భార్య ఆ మరచెంబు ఇచ్చిన మరుగుజ్జును కలుసుకోమని సలహా ఇచ్చింది. రాఘవ సరేనని బయలుదేరాడు.తాను మరుగుజ్జుని కలిసిన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న మరుగుజ్జు రాఘవని చూసి క్రిందకి దూకి "ఏమిటి ఇలా ఉన్నావు? నేనిచ్చిన మరచెంబు వలన నీకు ఎలాంటి సహాయం అందలేదా?" అని అడిగాడు. రాఘవ జరిగినదంతా మరుగుజ్జుకు వివరించాడు. అంతా విన్న మరుగుజ్జు చెట్టు తొర్రలో నుండి ఒక వెండి మరచెంబు తీసుకుని వచ్చి రాఘవకు ఇచ్చాడు. రాఘవ సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇది తెలిసిన భూస్వామి ఏదో ఒక విధంగా దానిని కూడా సొంతం చేసుకోవాలని ఆ సాయంత్రం విందు ఏర్పాటు చేసి రాఘవను ఆహ్వానించాడు. రాఘవ రాగానే "నీ వద్ద గొప్ప మరచెంబు ఉందని విన్నాను ఒకసారి ప్రదర్శించగలవా?" అని వినయంగా అడిగాడు. రాఘవ జేబులోనుండి వెండి మరచెంబుని తీసి క్రింద పెట్టి "మరచెంబు! మరచెంబు! నువ్వు చేయగలిగిన సాయమేదో చెయ్యి" అన్నాడు. 


వెంటనే ఇద్దరు నల్లని వస్తాదులు మరచెంబు నుండి బయటకు వచ్చి భూస్వామిని కర్రలతో బాదసాగారు. భూస్వామి అరుస్తూ తనని కాపాడమని రాఘవని అడిగాడు. రాఘవ తన రాగి మరచెంబు తిరిగి ఇమ్మని కోరగా వెంటనే లోపలి వెళ్లి దానిని రాఘవకి ఇచ్చేసాడు. వెంటనే ఆ మహాకాయులిద్దరు వెండి మరచెంబులోకి వెళ్లిపోయారు. రాఘవ ఆ చుట్టుపక్కల అందరికన్నా ధనవంతుడై పేదలకు సహాయం చేస్తూ సుఖంగా జీవించాడు. భూస్వామికి తగిన శాస్తి జరిగి బుద్ధి వచ్చింది.

For More Telugu Moral Stories Click Here

Comments