Telugu Moral Stories for Kids 16 - Mosagallu Telivaina Vyapari

మోసగాళ్లు - తెలివైన వ్యాపారి



అనగనగ ఒకప్పుడు బాగ్దాద్ నగరంలో ఒక వర్తకుడుండేవాడు. అతడు దేశ విదేశాలలో వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాడు. అతడు ప్రపంచమంతా తిరిగినప్పటికీ పెద్ద పెద్ద కొండల నడుమ అందంగా ఉండే బసారా నగరానికి మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. అనుకోకుండా ఒకసారి బసారా నగరం నుండి వచ్చిన ఒక బాటసారిని ఆ వర్తకుడు కలుసుకోవడం జరిగింది. మాటల్లో ఆ బాటసారితో "మీ నగరంలో ఏ వస్తువులకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది?" అని అడుగగా "మా నగరంలో చందనం చెక్కలకి మంచి గిరాకీ ఉంది" అని ఆ బాటసారి చెప్పాడు. ఆ తరువాత వర్తకుడు తన వద్ద ఉన్న ధనాన్నంతా వెచ్చించి చందనం చెక్కలను కొనుగోలు చేసాడు. ఆ చెక్కలను కట్టలుగా కట్టించి బళ్లకు ఎక్కించి బసారా నగరానికి బయలుదేరాడు. ఆ నగరాన్ని సమీపిస్తుండగా గొర్రెలను తోలుకొస్తున్న ఒక ముసలి అవ్వ వారికి ఎదురు పడింది. ఆమె ఆ వర్తకుడిని ఆపి "నువ్వు పరదేశీయుడిలా ఉన్నావు. జాగ్రత్త నాయన, ఈ బసారా నగరం నిండా అడుగడుగునా మోసగాళ్లు ఉన్నారు" అని హెచ్చరించింది. వర్తకుడు బసారా నగర ద్వారం దగ్గరకు చేరుకునేసరికి పూర్తిగా చీకటి పడింది.


రాజభటులు ఆ ద్వారం మూసేసారు. వర్తకుడు రాత్రంతా నగర ద్వారం వద్దనే గడిపి మరునాడు ఉదయం నగరంలోకి ప్రవేశించాడు. నగరంలోకి అడుగుపెట్టగానే ఒక వ్యక్తి వచ్చి "మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఎం చేద్దామనుకుంటున్నారు?" అని ప్రశ్నలు వేసాడు. అప్పుడు వర్తకుడు తాను బాగ్దాద్ నుండి చందనపు చెక్కలను అమ్మడానికి వచ్చానని చెప్పాడు. దానికి ఆ వ్యక్తి "మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు, మా నగరంలో చందనపు చెక్కలను వంట చేరుకుగా వాడతాం, అలాంటప్పుడు దాన్ని ఎవరు అధిక ధర పెట్టి కొంటారు?" అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మాటలను వర్తకుడు జీర్ణించుకోలేకపోయాడు. అది నిజామా అబద్దమా? అని తేల్చుకోలేక సరుకుతోపాటు ఒక వంటవాడి ఇంట్లో ఆ రోజుకి బస చేసాడు. కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని బయటకు వచ్చిన వర్తకునికి ఒక వింత దృశ్యం కనిపించింది. తాను ఉదయం కలిసిన వ్యక్తి, ఇంకొకరు ఒక బానలో వంట చేస్తున్నారు మరియు వంటచెరుకుగా గంధపు చెక్కలను వాడుతున్నారు. దానిని చూసి నిర్ఘాంతపోయాడు. అప్పుడు వర్తకుడు "ఈ నగరంలో అందరు వంటచెరుకుగా చందనపు చెక్కలనే వాడతారేమో, ఇలాగైతే నా సరుకుకు గిట్టుబాటు ధర కూడా రాదేమో" అని అయోమయ స్థితిలో ఉండగా ఆ ఇద్దరు వచ్చి మాకు సరుకును అమ్ముతారా అని అడిగారు. దానికి వర్తకుడు మీరు ఎంత ఇస్తారు అని ప్రశ్నించాడు. దానికి వారు మీరు ఇచ్చే సరుకుకు సమాన బరువైన వస్తువు ఏదైనా ఇస్తాము అన్నారు.


వర్తకుడు వారికి తన సరుకుని ఇచ్చేసి బసారా నగరం చూడడానికి బయలుదేరాడు. అలా వెళ్తుండగా ఒక ఒంటి కన్ను వాడు అతనిని గట్టిగా పట్టుకుని "నువ్వే నా కన్ను పోగొట్టావు, ఈ రోజు తప్పించుకోలేవు" అని గట్టిగా అరవసాగాడు. ఎదో గొడవ జరుగుతోందని జనమంతా చుట్టూ మూగారు. అప్పుడు వర్తకుడు "నేను నిన్ను మొదటి సరి చూస్తున్నాను, పైగా ఈ నగరానికి నేను ఎప్పుడు రాలేదు. నేను నీ కన్ను పోగొట్టడమేమిటి?" అన్నాడు. కానీ అక్కడి జనమంతా ఒంటి కన్నువాడి పక్షం వహించి తగిన పరిహారం చెల్లించక తప్పదని వర్తకుడిని అడ్డుకున్నారు. రేపటికల్లా పరిహారం చెల్లిస్తానని మాట ఇచ్చి ఎలాగోలాగ బయటపడ్డాడు. ఇంతలో ఆ రద్దీలో వర్తకుని కాలి చెప్పు తెగిపోయింది. అక్కడే ఉన్న చెప్పులు కుట్టే వాడికి చెప్పులు ఇచ్చి, వాడు తనకు ఏమి ఇస్తావు అని అడుగగా "నిన్ను సంతోషపెడతాలే, నీ కష్టం ఉంచుకోను" అని చెప్పి నడవడం కష్టం కాబట్టి ఆ ప్రక్కనే ఉన్న చెట్టుకింద కొంతమంది జూదం ఆడుతుంటే చూస్తూ నిలబడ్డాడు. కొంతసేపటికి వారిలో ఒకడు వర్తకుడిని కూడా పందెం కాయమన్నాడు. వర్తకుడు ఆట ప్రారంభించి కొంతసేపటికి వారి మోసం తట్టుకోలేక అందరికి బాకీ పడ్డాడు. వారు వర్తకుడితో "పందెం ప్రకారం సముద్రంలో నీరంతా తాగుతావా లేకపోతే నీ దగ్గర ఉన్నదంతా మాకిస్తావా?" అనడిగారు. వర్తకుడు వారి వద్ద కూడా ఒక రోజు గడువు తీసుకుని తన దుస్థితిని తలుచుకుంటూ నడుస్తుండగా మొదట కనిపించిన ముసలి అవ్వ మళ్ళీ కనిపించింది. పాలిపోయిన వర్తకుని మొహం చూసి ఎదో జరిగిందని గ్రహించి అతడిని ప్రశ్నించగా వర్తకుడు జరిగినదంతా చెప్పాడు. అప్పుడు అవ్వ "చూసావా నాయన! ఈ నగరమంతా దుర్మార్గులతో నిండి ఉంది, నేను ముందే చెప్పినప్పటికీ మోసపోయావు. ఈ బసారా నగరంలో ఒక చందనపు కట్ట పది బంగారు నాణాలు విలువకు తక్కువ కాదు. లెక్క ప్రకారం నీకు అంతు లేని బంగారం రావాల్సి ఉంది. సరేలే జరిగినది జరిగింది. నువ్వు నేను చెప్పినట్టు చేశావంటే నీకు న్యాయం జరగవచ్చు. నగర ద్వారానికి సమీపంలో ఒక నిర్జన ప్రదేశం ఉంటుంది. చీకటి పడే వేళకు నీవు అక్కడికి వెళ్తే ఒక గుడ్డి సాధువు కనిపిస్తాడు. నిజానికి అతడు సాధువు కాదు, గుడ్డివాడు కాదు ఈ నగరంలో ఉండే మోసగాళ్లకు గురువు. ఈ మోసగాళ్లంతా రాత్రికి అక్కడికి చేరి తాము చేసిన మోసాలను అతనికి వివరిస్తారు. నీవు వారి సంభాషణ వింటే నీకు ఏదైనా ఉపయోగం ఉండొచ్చు" అని చెప్పింది.


ముసలవ్వ చెప్పినట్టుగానే రాత్రికి వర్తకుడు ఆ ప్రదేశం చేరుకొని చాటుగా నక్కి కూర్చున్నాడు. అనుకున్న విధంగానే ఆ మోసగాళ్లందరూ ఆ సాధువుకు ప్రణమిల్లి తాము చేసిన మోసాల గురించి చెప్పసాగారు. వారిలో వర్తకుని మోసం చేసిన నలుగురు కూడా ఉన్నారు. ఒక్కక్కరు చేసిన మోసం వివరించి చెప్పిన తరువాత ఆ గుడ్డి సాధువు వారిని తిట్టసాగాడు. ఆ మాటలన్నీ వర్తకుడు జాగ్రత్తగా విన్నాడు. మొదటి వాడు సాధువుతో "నేను ఈ రోజు ఒక పరదేశి వర్తకుడి వద్ద చందనం చౌకగా పొందాను. అతనికి దానికి సమానమైన బరువుగల వస్తువు ఏదైనా ఇస్తానని చెప్పను. ఒకవేళ అతను బంగారం అడిగినా కూడా లాభపడేది మనమే" అని గర్వంగా చెప్పాడు. దానికి సాధువు "తప్పు చేసావు, ఒకవేళ ఆ వర్తకుడు దానికి సమానమైన బరువుగల ఈగలను ఇమ్మన్నాడనుకో, అందులో కూడా సగం ఆడవి సగం మగవి అప్పుడు ఏం చేస్తావు?"  అని మందలించాడు. తరువాత ఒంటి కన్ను వాడు "నేను పరదేశి వర్తకుడిని నీవు నా కన్ను పోగొట్టావు, ఐతే నా కన్ను నాకివ్వు లేకపోతే పరిహారం ఇవ్వు అని అడిగాను" అని చెప్పగా దానికి సాధువు "ఒకవేళ వర్తకుడు, పరిహారం బదులు నా కన్ను ఇస్తాను, కాకపోతే ఒకసారి సరిపోతుందో లేదో చూడడానికి నీ రెండో కన్ను ఒకసారి ఇవ్వు అంటే ఏమిచేస్తావు? పూర్తిగా గుడ్డివాడివి అవుతావు. అతనికి ఒక కన్ను పోయినా నీకు రెండు పోతాయి" అన్నాడు. 

ఈలోపు చెప్పులు కుట్టే వాడు వచ్చి "వర్తకుడు నన్ను సంతోషపెడతాను అని చెప్పాడు. అతని దగ్గర ఉన్న ధనమంతా లాగేస్తాను" అని చెప్పాడు. దానికి సాధువు "వాడు నీకు ఏమి ఇవ్వడు. మన సుల్తాన్ని ఎదిరించే ధైర్యం ఉన్న మొనగాడు ఎవడు లేడు, అని చెప్పి ఆ మాటలు నీకు సంతోషాన్నిస్తున్నాయా అని అడుగుతాడు.ఒక వేళ అవునంటే నీకు ఏమి ఇవ్వక్కర్లేదు, కాదన్నవో రాజభటులు నిన్ను రాజద్రోహం పేరుతో చిత్రవధ చేస్తారు." చివరగా జూదం ఆడిన వ్యక్తి వచ్చి "నేను ఈ రోజు ఒకడిని జూదంలో ఓడించాను. పందెంగా సముద్రంలో నీరంతా తాగాలని లేదంటే అతని వద్ద ఉన్నదంతా ఇవ్వాలని షరతు పెట్టాను" అని చెప్పగా సాధువు నవ్వి " వాడు నీకు ఏమి ఇవ్వడు. ఒకవేళ సముద్రంలోని నీరంతా ఏదైనా పాత్రలో పట్టి తీసుకురా నేను తాగుతాను అని చెప్తే నువ్వు తేలేవుగా." అన్నాడు. వాడు కూడా ఉసూరుమంటూ వెళ్ళిపోయాడు.


 ఈ చిట్కాలన్నీ తెలుసుకున్న వర్తకుడు తనని మోసం చేయాలనుకున్న అందరిని సులభంగా ఎదుర్కొని గెలిచాడు. మొదటివాడు ఈగలను ఇవ్వలేక బంగారు నాణాలను లెక్కకట్టి ఇచ్చాడు. మిగిలిన ముగ్గురు వర్తకునికి సమాధానం చెప్పలేక కాళ్ళ మీద పడి క్షమించమన్నారు. వర్తకుడు ఆ సొమ్మంతా తీసుకుని కొంత తనకి సహాయం చేసిన అవ్వకు ఇచ్చి ఇంకెప్పుడు బసారా నగరానికి రాకూడదని నిశ్చయించుకుని బాగ్దాదుకు తిరుగు ప్రయాణమయ్యాడు. తెలివితేటలతో మోసాన్ని జయించొచ్చని అవ్వ ద్వారా తెలుసుకున్నాడు.

For More Telugu Moral Stories Click Here

Comments