చేపల మొక్కలు
అనగనగ పుష్పవరం అనే గ్రామంలో లింగయ్య అనే రైతుండేవాడు. అతనికి కాస్త హాస్య చతురత ఎక్కువ. ఊళ్ళోవాళ్ళని ఎప్పుడూ నవ్విస్తుండేవాడు. లింగయ్యకొకసారి తోటపని మీద ఆసక్తి కలిగింది. వెంటనే తన పెరడు త్రవ్వి రకరకాల పూల మొక్కలు నాటి పెంచసాగాడు. తోటను పెంచడంలో అతని మిత్రులు తోచిన సలహాలు ఇచ్చి సహాయం చేసారు. కొంత కాలానికి లింగయ్య పెరడంతా మంచి పూలతోటగా మారిపోయింది. ఒకసారి భూషయ్య అనే పెద్దమనిషి లింగయ్య తోట దగ్గరకి వచ్చాడు. భూషయ్య ఊర్లో పెద్ద ధనవంతుడే కాక మంచి జిత్తులమారి కూడా. భూషయ్య లింగయ్యను ఆటపట్టించాలనుకున్నాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్లి "లింగయ్య! ఈ మధ్య నువ్వు పెద్ద తోటమాలివి అయ్యావని విన్నాను. అయితే నీ తోటలో క్రొత్త రకం మొక్కలేవి ఉన్నట్టు లేదే." అన్నాడు. "నాకు దొరికిన విత్తనాలు వేస్తూ వచ్చాను. ప్రత్యేకంగా కొత్త రకాలంటూ ఏవి పెంచలేదు." అని చెప్పాడు లింగయ్య. దానికి భూషయ్య "నీకు కావాలంటే క్రొత్త విత్తనాలు నేను పంపిస్తాను. అయితే వాటిని మొలిపించడం నీ వల్ల కాదేమోనని నా అనుమానం." అని నవ్వాడు. లింగయ్య భూషయ్య నవ్వు చూసి "మీరు ముందు విత్తనాలు పంపించండి. వాటిని మొలిపించే పని నేను చూసుకుంటాను." అని అన్నాడు.
మరునాడు భూషయ్య తన నౌకరుచేత లింగయ్యకు విత్తనాలను ఒక సంచిలో పంపించాడు. లింగయ్య ఆ సంచిని విప్పి చూస్తే అందులో విత్తనాలు లేవు. దానికి బదులు ఎండు చేపలు మాత్రం ఉన్నాయి. భూషయ్య తనని అల్లరి పట్టించడానికే ఎండు చేపలు పొట్లం కట్టి పంపించాడని గ్రహించాడు లింగయ్య. తగిన సమయం చూసుకుని భూషయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. రెండు వారాల తరువాత లింగయ్య బయటకు పని మీద వెళ్తే అక్కడ భూషయ్య కనిపించి " ఏం లింగయ్య! నీ తోట ఎలా ఉంది?" అని పలకరించి "అన్నట్టు నేను పంపిన విత్తనాలు నాటావా? విత్తనాలు మొలకెత్తాయా? అసలే అవి మాములు విత్తనాలు కాదు అవి అందరికి మొలిపించడం సాధ్యం కాదు. మరి ఏమైంది?" అని అడిగాడు. దానికి లింగయ్య "అప్పుడే నాటేశానండి, చేసేటట్టు చేస్తే ఏ విత్తనాలైనా మొలకెత్తి తీరుతాయి. మీరు పంపిన విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. వాటికి దిష్టి తగలకుండా వాటిపై మట్టి పిడతలు కప్పి ఉంచాను. రేపొకసారి మా తోటకు రండి, మీ కళ్ళతో మీరే చూద్దురుగాని" అని అన్నాడు. భూషయ్య ఆశ్చర్యపోతూ రేపు వచ్చి విత్తనాల్ని చూస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.