Telugu Moral Stories for Kids 17 - Bangaru phalalu

బంగారు ఫలాలు




అనగనగ కన్నాపురం అనే గ్రామంలో కామాక్షి, ఏకాంబరం అనే వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి ఒక చిన్న ఇల్లు, చిన్న పెరడు తప్ప ఇంకేమి ఆస్తి లేదు. ఏకాంబరం ఎటువంటి కోరికలు లేకుండా వేదాంత ధోరణిలో ఉండేవాడు. అతను వయస్సులో ఉన్నప్పుడు వేదం పఠనం చేసి ఊరి జనం ఇచ్చే తృణమో పణమో తీసుకుని దానితో జీవనము సాగించేవాడు. ఏకాంబరానికి వయసు మీరడంతో వేద పఠనం చేయలేక ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేసి వారిచ్చిన బియ్యం ఇంటికి తీసుకొచ్చేవాడు. కామాక్షి పెరట్లో కాసిన కాయగూరలు కోసి ఏకాంబరం తీసుకు వచ్చిన బియ్యంతో వంట చేసేది. దానితో ఇద్దరు కలిసి భోజనం చేసేవారు. ఆ విధంగా వారిద్దరి జీవితం సాగేది. కాలం గడిచే కొద్దీ ఏకాంబరానికి ప్రతి రోజు భిక్షాటనకు వెళ్ళడానికి కష్టమైపోయింది. ఆ సమయంలో ఒక రోజు కామాక్షి ఏకాంబరంతో "మీకు దూరదృష్టి లేదు. ముందుగానే జాగ్రత్త పడి ఉంటే మనకి ఈ రోజు కష్టాలు వచ్చేవి కాదు." అని అంది. అప్పుడు ఏకాంబరం "నారు పోసిన వాడే నీరు పోయాక మానడు. నువ్వేమి దిగులు పడకు. భగవంతుడే మనకు మార్గం చూపిస్తాడు." అన్నాడు.


దానికి కోపంగా కామాక్షి " మీ వేదాంతం ప్రక్కన పెట్టండి. ఈ దేశపు రాజు క్రాంతివర్మ దానశీలుడు అని అందరు అంటారు. మీరు వెళ్లి అడిగితే అయన మన మనుగడకు ఏదో ఒకటి చేసి తీరతారు." అని చెప్పింది. భార్య మాట కాదనలేక ఒక మంచిరోజు ఏకాంబరం మహారాజును కలిసాడు. అప్పుడు మహారాజు ఏకాంబరాన్ని ఏమి కావాలో కోరుకోమన్నాడు. దానికి ఏకాంబరం "మీరు సంపన్నులే, కానీ నేను పెద్దగా ఏమి అడగను. మీరు కష్టపడి సంపాదించిన ధనం ఏదైనా ఉంటే దానం చెయ్యండి. స్వీకరిస్తాను." అన్నాడు. మహారాజు ఖజానాలో చాలా ధనమే ఉంది. కానీ అందులో ఒక రూపాయి కూడా మహారాజు సంపాదించినది కాదు. నోరు తెరిచి యాచించిన బ్రాహ్మణుడికి ఏదైనా ఇవ్వాలంటే తాను క్రొత్తగా సంపాదించాల్సిందే. అప్పుడు మహారాజు " అయ్యా ! రేపు సాయంత్రం వచ్చి నన్ను కలవండి. అప్పుడు నా కష్టార్జితం మీకు ఇవ్వగలను." అని చెప్పాడు. మరుసటి రోజు మహారాజు పాత వస్త్రాలు ధరించి ఒక శ్రామికుని వేషం వేసుకుని డబ్బులు సంపాదిద్దామని బయలుదేరాడు.


 అలా కొద్ది దూరం వెళ్లేసరికి ఒక కుమ్మరి కుండలు తయారుచేస్తూ కనిపించాడు. రాజు కుమ్మరిని తనకేదైనా పనివ్వగలడా అని అడిగాడు. దానికి కుమ్మరి "దానికేముంది. అక్కడ ఉన్న మట్టిని బాగా తొక్కు. సాయంత్రం వరకు పని చేశావంటే నాలుగు రాగి నాణాలు కూలీగా ఇస్తాను" అన్నాడు. మహారాజు మట్టి తొక్కడం మొదలు పెట్టాడు. కానీ అలవాటు లేని పని మరియు చేతగాకపోవటం వలన కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి. అతని కష్టం చూసిన కుమ్మరి " నీకు ఈ పని చేతకావడం లేదులే. అయినా మాటిచ్చాను కాబట్టి నీకు నాణాలు ఇస్తాను. కానీ మళ్ళీ పని అని మాత్రం నా దగ్గరకు వచ్చి సమయం వృధా చేయకు." అని చెప్పి పంపించేశాడు. రాజు చెప్పిన ప్రకారం ఏకాంబరం రాజు ఆస్థానానికి వచ్చాడు. అప్పుడు మహారాజు నాలుగు రాగి నాణాలు చేతిలో పెట్టి "అయ్యా ! నేను స్వయముగా సంపాదించినది మొత్తం మీకే ఇస్తున్నాను." అన్నాడు. దానికి ఏకాంబరం "మహారాజ! నాకు ఇదే పదివేలు. మీరు చల్లగా ఉండాలి" అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.

తన భర్త రాజుగారి దగ్గర నుండి పెద్ద బహుమానం తీసుకు వస్తాడని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న కామాక్షి ఏకాంబరం ఖాళీ చేతులతో రావడం చూసి "మీకు మహారాజుగారు ఏమి దానమివ్వలేదా?" అని అడిగింది. దానికి తన దగ్గర ఉన్న నాలుగు రాగి నాణాలు చూపించి రాజుగారు ఇచ్చినది ఇదే అని చెప్పి వాటిని కామాక్షి చేతిలో పెట్టాడు. దానిని చూసి కామాక్షికి ఒళ్ళు మండి "కాశీకి వెళ్లి గాడిద గుడ్డు తెచ్చినట్టు మీరు రాజుగారి దగ్గర నుండి ఈ నాలుగు రాగి నాణాలు తెచ్చారు. మీకేమైనా బుద్ధి ఉందా?" అని కోపంగా ఆ నాలుగు నాణాలు పెరట్లోకి విసిరేసింది. చీకటిలో కనపడకపోయేసరికి పొద్దునే లేచి వాటిని వెతుకుదామని ఏకాంబరం నిద్రపోయాడు. మరునాడు ఉదయం ఏకాంబరం యెంత వెతికినా ఆ నాణాలు దొరకలేదు. 


కానీ విసిరిన చోట నాలుగు చిన్న మొక్కలు మాత్రం కనిపించాయి. ఆ మొక్కలు వింతగా మెరుస్తూ ఉన్నాయి. చూస్తుండగానే ఆ మొక్కలు ఏపుగా పెరిగాయి. కొన్ని రోజులకి కాయలు కూడా కాసాయి. బంగారు రంగులో మెరిసిపోతున్న వాటిని చూసి ఏకాంబరం, కామాక్షి రుచి చూద్దామని వాటిని తరిగేసరికి ఆ కాయల నిండా ముత్యాలు కనిపించాయి. ఆ పేద దంపతులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. బంగారు నగల వర్తకులకు వాటిని చూపిస్తే అవి మేలురకం ముత్యాలని చెప్పి మంచి ధరకట్టి  ఇచ్చారు. ఆ నాలుగు చెట్లు ఎడతెరిపి లేకుండా ఫలాలు ఇవ్వడంతో వారి యొక్క పేదరికం తీరిపోయి ధనవంతులయ్యారు. ఆ రాజ్యంలో పేదవారికి బంగారు ఫలాలను దానం చేయసాగారు. కొన్నాళ్ళకి సంగతి రాజుగారికి తెలిసింది. తాను ఇచ్చినది నాలుగు రాగి నాణాలు కదా ! మరి ఈ పేద బ్రాహ్మణుడికి అంత సిరి ఎలా వచ్చింది అనే ప్రశ్న రాజుకు వచ్చి ఆ విషయం తెలుసుకుందామని బయలుదేరాడు. మహారాజు "అయ్యా ! మీరు చేతికి ఎముక లేనట్టు దానం చేస్తున్నారని విన్నాను, ఇంత సిరి మీకు ఎలా వచ్చింది?" అని అడిగాడు. "ప్రభు ! ఆ రోజు మీరు ఇచ్చిన నాలుగు రాగి నాణాలు నా భార్య కోపంతో పెరట్లోకి విసిరేసింది. ఆ నాలుగు నాణాలు విసిరిన చోట మొలిచిన నాలుగు మొక్కల నుండి వచ్చిన బంగారు ఫలాల వల్లే నాకు ఈ సిరి వచ్చింది." అని చెప్పాడు ఏకాంబరం. అప్పుడు రాజుకు కష్టార్జితం విలువ తెలిసింది. కష్టపడితే బంగారు ఫలాలు దొరుకుతాయి అని గ్రహించిన ప్రజలు తాము కూడా దాన్ని ఆచరించసాగారు.

For More Telugu Moral Stories Click Here


Comments