Telugu Moral Stories For Kids 18 - Tella Yenugu

 తెల్ల ఏనుగు


అనగనగ అవంతి దేశాన్ని వీరమల్లు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతను తిక్క తిక్క ఆలోచనలన్నీ చేస్తుండేవాడు. ప్రజలంతా వీరమల్లుని తెలివితక్కువ వాడని అనుకునేవారు. ఆ దేశంలో మల్లయ్య అనే వ్యక్తి బట్టలుతికి జీవించేవాడు. అతను ఎంతటి మాసిన బట్టలనైనా తెల్లగా మల్లెపువ్వులాగ శుభ్రం చేయడంలో ప్రసిద్ధుడు. ఒక రోజు ఉదయం పుల్లయ్య అనే వ్యక్తి మల్లయ్య దగ్గరకి వచ్చాడు. పుల్లయ్య మట్టి పాత్రలు తయారుచేయడంలో నేర్పరి. "మల్లయ్య ! నాకు రాజుగారి దగ్గరనుండి పిలుపు వచ్చింది. మహారాణి గారి మందులకు ప్రత్యేకమైన మట్టి పాత్ర తయారు చేసివ్వాలట." అని మల్లయ్యతో  అన్నాడు. దానికి మల్లయ్య "నువ్వు చాలా అదృష్టవంతుడివి, రాజుగారి పిలుపంటే మాటలా!" అన్నాడు. రాజుగారి దగ్గరకి వెళ్ళేటప్పుడు శుభ్రమైన దుస్తులు ధరించాలని పుల్లయ్య తన మాసిన బట్టలను మల్లయ్యకి ఇచ్చి రేపటి ఉదయానికల్లా తయారుగా ఉంచమని చెప్పాడు. మల్లయ్య ఆ బట్టలను శుభ్రం చేద్దామని వేడి నీటిలో పెట్టేసరికి రంగు వెలసిపోయి నీలం దుస్తులు కాస్తా తెల్లగా మారిపోయాయి. మర్నాడు వచ్చిన పుల్లయ్య తన దుస్తులు తెల్లగా మారిపోవడం చూసి మల్లయ్యతో పోట్లాటకు దిగాడు.
రాజుగారికి ఫిర్యాదు చేస్తానని కోపంతో వెళ్ళిపోయాడు.


రాజుగారి ఆస్థానానికి చేరుకున్న పుల్లయ్య రాజుగారికి నమస్కరించాడు. అప్పుడు రాజు, "ఆహా! ఎంతటి తెల్లటి దుస్తులు. నీ దుస్తులు ఇంత తెల్లగా శుభ్రం చేసినది ఎవరు?" అని అడిగాడు. ఇదే మంచి సమయం అని భావించిన మల్లయ్య "ప్రభు ! ఈ రాజ్యం లో మల్లయ్య అనే బట్టలుతికేవాడు ఉన్నాడు. వాడు దేనినైనా తెల్లగా మార్చేస్తాడు. మీరు ఎప్పటినుండో తెల్ల ఏనుగు కావాలనుకుంటున్నాడు కదా. మీ గజశాలలో ఒక ఏనుగును మల్లయ్యకు అప్పగించండి. వాడు దానిని తెల్ల ఏనుగుగా చేసేస్తాడు. ఇది విన్న వెంటనే మల్లయ్యను తీసుకురమ్మని భటులను పంపించాడు వీరమల్లు. మల్లయ్య వచ్చి రాజు చెప్పినదంతా విని ఇది పుల్లయ్య వేసిన పథకం అని గ్రహించాడు. వెంటనే రాజుతో "మీరు చెప్పినట్టే తెల్ల ఏనుగును చేసి ఇస్తాను. అయితే ఏనుగును ఉడకబెట్టడానికి పెద్ద తొట్టె అవసరం. దానిని ఈ పుల్లయ్య మాత్రమే చేసి ఇవ్వగలడు. వాటిచేత తొట్టెను తయారుచేయించండి. నేను మీకు తెల్ల ఏనుగుని చేసి ఇస్తాను." అన్నాడు. మరుక్షణం రాజు "పుల్లయ్య! రేపు ఉదయానికల్లా ఏనుగు పట్టే పెద్ద తొట్టెని తయారుచేసుకుని రా. లేదంటే నిన్ను రాజ్యం నుండి బహిష్కరిస్తా" అని హెచ్చరించాడు. మల్లయ్య తన పథకాన్ని తిప్పికొట్టాడని గ్రహించిన పుల్లయ్య ఏమి చేయలేక ఇంటిదారి పట్టాడు. ఆ రాత్రంతా కష్టపడి మట్టి తొక్కి ఒక పెద్ద పాత్రను తయారు చేసి తెల్లారాక దానిని రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అప్పుడు మల్లయ్య దాని నిండా నీళ్లు నింపాడు. మావటివాడు గజశాలనుండి ఒక ఏనుగుని తీసుకువచ్చి ఆ తొట్టెలో దింపాడు. వెంటనే ఆ తొట్టె ముక్కలైపోయింది. అది చూసిన మహారాజు కోపంగా పుల్లయ్యతో "ఒరేయ్! ఇది నీ వృత్తికే అవమానకరం. నీకు ఇంకో అవకాశమిస్తున్నాను. రేపు ఉదయానికల్లా మరొక తొట్టె తయారు చేసి తీసుకుని రా. లేకపోతే నీకు కఠిన శిక్ష తప్పదు." అని హెచ్చరించాడు. ఈ సారి మంచి తొట్టె తయారుచేసి తీసుకు వస్తానని చెప్పి బయలుదేరాడు పుల్లయ్య.


ఆ రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా రాజ్య సరిహద్దు దాటి వెళ్ళిపోయాడు పుల్లయ్య. ఈ విషయం విని వీరమల్లు కోపంతో ఊగిపోయాడు. ఆ తరువాత మల్లయ్యతో "నువ్వేమి చేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం రేపటికల్లా తెల్ల ఏనుగును చేసి ఇవ్వాలి." అని కచ్చితంగా చెప్పేసాడు. వీరమల్లు పెద్ద మూర్ఖుడు అన్న విషయం మల్లయ్యకి తెలుసు. అందుకే ఏమి మాట్లాడకుండా తెల్ల ఏనుగును చేసేస్తానని రాజుకి చెప్పి సెలవు తీసుకున్నాడు. ఆ తరువాత మల్లయ్య గజశాలకు వెళ్లి ఒక నల్ల ఏనుగుకి నిచ్చెన వేసి దాని మీద నిలబడి సున్నంతో గోడలకి వెల్ల వేసినట్లు దానికి ఐదారుసార్లు సున్నంతో వెల్లవేసాడు. ఉదయమే తెల్ల ఏనుగును రాజుకి చుపించాడు. అప్పుడు రాజు ఆనందంతో " తెల్ల ఏనుగు కావాలన్న కోరిక ఈ నాటితో తీరింది. " అని మల్లయ్యకు వెయ్యి బంగారు వరహాలతో పాటు ఒక గుర్రాన్ని కూడా బహూకరించాడు. అప్పుడు మల్లయ్య ఇంటికి చేరి మూట ముల్లె సర్దుకుని గుర్రం మీద దేశసరిహద్దును దాటి ఒక నది ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ చిరిగిపోయిన బట్టలతో గాలం వేసి ఒకడు చేపలు పట్టుకుంటున్నాడు. వాడిని చూసి గుర్తుపట్టి "ఒరేయ్ పుల్లయ్య! నా మీద కక్షతో నన్ను సాధించాలని ప్రయత్నించావు. ఇప్పుడు ఇలా దేశాలు పట్టి చేపలు పట్టుకుంటున్నావు." అని దెప్పిపొడిచాడు. దానికి పుల్లయ్య క్షమించమని కోరి మల్లయ్య అక్కడికి రావడానికి కారణం ఏమిటని అడిగాడు. దానికి మల్లయ్య "ఇదంతా నీ పుణ్యమేరా ! నువ్వు ఆ తెలివి తక్కువ రాజుతో నేను తెల్ల ఏనుగుని చేస్తానని ఇరికించావు. మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసిన విధంగా సున్నం కొట్టి తెల్ల ఏనుగుని ఇచ్చేసాను. ఇలా బయటపడ్డాను." అని చెప్పాడు. ఇకపై పక్కరాజ్యానికి వెళ్లి మిత్రుల్లా బ్రతుకుదామని పుల్లయ్యకి చెప్పి గుర్రం మీద ఎక్కించుకుని వెళ్ళిపోయి తమ పనులు చేసుకుని హాయిగా జీవించారు.

For More Telugu Moral Stories Click Here


Comments