Telugu Moral Stories for Kids 19 - Maya Sarassu

 మాయ సరస్సు 

అనగనగ ఆఫ్రికా దేశంలో రూడ్ అనే యువకుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. ఒక పెద్ద సరస్సులో చేపలు పట్టి వాటిని అమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు రూడ్ ఎక్కువ చేపలు పట్టాలని నాలుగు వలలను తీసుకుని ఒక తెప్ప మీద సరస్సు మధ్యకు వెళ్ళాడు. నాలుగు వలలను నాలుగు వైపులా వేసి వాటి కొసలను తాడుతో ఒడ్డుపైనున్న ఒక గుంజకు కట్టేసాడు. కాసేపయ్యాక ఒడ్డు దగ్గర నిలబడి ఎంతో ఆశగా ఒక్కో వలని నెమ్మదిగా లాగసాగాడు. మొదటి వలలో ఏమి పడలేదు. తరువాత రెండో వల లాగాడు. దానిలో ఒక చిన్న ఎండ్రకాయ పడింది. ఉసూరుమంటూ మూడో వల లాగాడు. దానిలో కూడా ఏమి పడలేదు. "ఈ రోజు నా అదృష్టం బాగోలేదు." అనుకుంటూ నాలుగో వల లాగాడు. అది బరువుగా ఉండడంతో రెట్టించిన ఉత్సాహంతో "ఆహా ! మంచి బరువైన చేపలు పడినట్టున్నాయి." అనుకుంటూ వలను మరింత గట్టిగా లాగాడు. తీరా చూసేసరికి దానిలో ఒక ముసలి అవ్వ ఉంది. ఆ అవ్వ నల్లగా, చర్మం ముడతలు పడి, పళ్ళు ఊడిపోయి, నడుము వంగిపోయి చూడడానికి చాలా అసహ్యంగా ఉంది. రూడ్ కి ఆ అవ్వను చూడడానికే చిరాకు వేసింది. "అదృష్టం వస్తుందనుకుంటే ఇలా దరిద్రం వచ్చిందేమిటి?" అనుకుంటూ వలను అలాగే వదిలేసి వెళ్ళిపోబోయాడు. అప్పుడు ఆ ముసలవ్వ రూడ్ తో "నాయన! నాకెవ్వరు లేరు. నన్ను కూడా నీతో తీసుకెళ్ళు." అని అభ్యర్ధించింది. అప్పుడు రూడ్ "నాకే తిండికి గతి లేదు. నిన్నెలా పోషించేది." అని ఈసడించుకున్నాడు. అప్పుడు అవ్వ "బాబు! నావల్ల నీకు నష్టమేమి ఉండదు. పైగా నేను నీ వెంటే ఉంటే నీకు అదృష్టం కూడా పడుతుంది. కాబట్టి నీతో పాటు నన్ను తీసుకు వెళ్ళు" అని పదే పదే అర్థించింది. 

అంతే కాకుండా రూడ్ వద్దన్నా వినకుండా అతని ఇంటికి వెళ్ళింది. అప్పుడు రూడ్ తన కోసం తయారుచేసుకున్న రొట్టెలలో కొన్ని ముసలవ్వకి కూడా పెట్టాడు. రొట్టెలు తినడం పూర్తయ్యాక "అవ్వ! ఇంతకుముందు నాకేదో అదృష్టం పడుతుంది. లాభం వస్తుంది అని చెప్పావు కదా. అదేంటో చెప్పు. విని సంతోషిస్తాను." అన్నాడు. దానికి ముసలవ్వ "బాబు! నువ్వు రేపు సాయంత్రం లోపు ఒక పశువుల మందకు యజమాని కాబోతున్నావు. అందుచేత విశాలంగా ఉండేలాగా ఒక పెద్ద పశువుల దొడ్డి తయారుచేసుకో." అని చెప్పింది. దానికి రూడ్ "మీ మాటలు ఎలా నమ్మేది. హఠాత్తుగా పశువుల మంద ఎక్కడ దొరుకుతుంది?" అని ఏవేవో ప్రశ్నలు వేసాడు. అప్పుడు ముసలవ్వ "నా మాటల మీద నమ్మకముంటే నేను చెప్పినట్టు చెయ్యి లేదంటే లేదు" అని కటువుగా చెప్పింది. రూడ్ తనలో తానూ గొణుక్కుంటూ ఎంతో శ్రమపడి ముళ్లకంపలతో బలమైన కంచె కట్టి ఒక పెద్ద పశువుల దొడ్డి తయారుచేసాడు. ఆ రాత్రి తనకు పెట్టబోయే అదృష్టం తలచుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయాడు. మర్నాడు ఉదయం లేచి బయటకు వెళ్లి చూసేసరికి సరస్సు దిక్కునుండి పశువుల అరుపులు వినబడ్డాయి. ముందు ఒక ఎద్దు, దాని వెనుక అనేక ఆవులు, దూడలు పెద్ద మందగా వచ్చి పశువుల దొడ్డిలో ప్రవేశించి రోజు అలవాటైన వాటిలా ఒక చోట చేరి నిలబడ్డాయి. అప్పటి నుండి రూడ్ జీవితం పూర్తిగా మారిపోయింది. వాడి పేదరికం పోయి ఆ వూరిలో బాగుగా డబ్బునవాళ్లలో ఒకడిగా మారిపోయాడు. సంపాదించిన డబ్బుతో పొలాలు, ఆస్తులు కొనుక్కున్నాడు. పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు. ఆ చుట్టుపక్కల గ్రామాలలో పెద్ద మనిషిగా పేరుపొందాడు.

దానితో రూడ్ కి అహంకారం బాగా ఎక్కువైంది. ఎవరైనా సహాయం కోసం వస్తే వారిని బాగా కసురుకొనేవాడు. అందరితోనూ పొగరుగా మాట్లాడేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు రూడ్ పక్క ఊరిలో విందు జరిగితే అక్కడికి వెళ్ళాడు. అక్కడ కావలసినంత తిన్నాడు. మత్తు పానీయాలు కూడా తలకెక్కేవరకు తాగాడు. బాగా పొద్దుపోయింది. రూడ్ బాగా తూలుతూ ఎవరు దొరికితే వారి మీద విరుచుకుపడదామని అనుకుంటూ ఇంటికి వచ్చాడు. అర్థరాత్రి కావడంతో ఇంట్లో అందరు గాఢనిద్రలో ఉన్నారు. రూడ్ త్రాగిన మైకంలో తలుపులు బాదుతూ "తలుపులు తెరవండి. పెద్దమనిషి రూడ్ వచ్చాడు." అని అరవసాగాడు. ఎంతలా కేకలు పెట్టినా ఎవ్వరూ తలుపులు తెరువలేదు. వెంటనే రూడ్ కి కోపం తారాస్థాయిలో వచ్చింది. అప్పుడు రూడ్ "మీ అందరికి అంత అలుసైపోయిందా. ఇంతకీ నేను సరస్సునుండి బయటకు తీసుకు వచ్చిన ఆ ముసలి నక్క ఎక్కడుంది. ఎక్కడ చచ్చావే? తలుపు తీయవే." అని గట్టిగా అరిచాడు. అలా అరుస్తుండగానే తలుపులు తెరిచి ముసలవ్వ వాకిట్లో నిలబడింది. ముసలవ్వ రూడ్ కేసి కోపంగా చూస్తూ "నీకు బాగా పొగరెక్కి నన్ను అనవసరంగా తిట్టావు. మర్యాదలేని వాళ్ళ దగ్గర, చేసిన సాయం మరచేవాళ్ళ దగ్గర ఒక్క క్షణం కూడా ఉండను. రేపుదయమే వెళ్ళిపోతాను" అంది.

అప్పుడు రూడ్ మరింత పొగరుగా "పోతే పోవే, ముసలిదానా! నీ పీడా నాకు విరగడైపోతుంది." అన్నాడు. మరునాడు ఉదయం ముసలవ్వ నిద్ర లేచిన వెంటనే రూడ్ ఇంటినుండి కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెంట పశువులు కూడా మందగా వెళ్లిపోయాయి. అవ్వతో పాటు పశువుల మంద కూడా సరస్సులోకి వెళ్లి కనిపించకుండా మాయమయింది. రూడ్ మళ్ళీ కటిక పేదవాడిగా మారిపోయాడు. మాయ సరస్సునుండి ముసలవ్వ మళ్ళీ వచ్చి తనను ఆదుకుంటుందని సరస్సు వైపు ఎదురుచూసేవాడు. వాడి జీవితంలో పోగొట్టుకున్న అదృష్టం మళ్ళీ వాడి దగ్గరకు రాలేదు.

For More Telugu Moral Stories for kids Click Here


Comments