Telugu Chandamama Kathalu 1-5

 గండడి గర్వభంగం


పూర్వం తుని రాజా వారి దివాణంలో గండడు అనే పేరు మోసిన వస్తాదు ఉండేవాడు. వాడు ఐదారుగురి తిండి తినేసి, కండలు తిరిగి, చూడటానికే భయంపుట్టేలా ఉండేవాడు. వాడితో మల్లయుద్ధం చేసి గెలిచినవాళ్లు లేరు. ఓడిపోయిన వాళ్ళు నెలరోజులు మంచాన పడి తీసుకునేవాళ్ళు! అందుచేత అనప్పుడల్లా వాణ్ణి ఎవరూ సవాలు చేసేవారు కాదు. అందువల్ల గండడికి గర్వం బలిసిపోయింది. వాడికి ఒకరి భయమూ, అదుపూ, ఆజ్ఞా లేకుండాపోయింది. దుకాణాలలోకి వెళ్లి తనకు కావలిసినవి స్వేచ్ఛగా తీసుకునేవాడు. అభ్యంతరం చెప్పిన వాళ్ళని చితకబాదేవాడు. ఒకరోజు ఒక ముసలిది బత్తాయిపళ్ళు గంపలో పెట్టుకుని అమ్ముకుంటూ వీధిలో కూర్చుని ఉంటే గండడు దాని తట్టలో చెయ్యి పెట్టి తనకు కావలసిన పళ్ళు ఏరుకున్నాడు. ముసలిది డబ్బులడిగింది. గండడు దాని తట్టను వీధిలోకి తన్నాడు. బత్తాయిపళ్ళన్నీ వీధిలో దొర్లాయి. "నీ ప్రతాపం ఈ ముసలిదాని మీద చూపిస్తావట్రా ? చేతనైతే మా ఊరి బండడి మీద చూపించు!" అన్నది ముసలిది, దొర్లిపోయిన పళ్ళు ఏరుకుంటూ. "ఏ ఊరు మీది?" అని గండడు రోషంగా అడిగాడు. "అరట్లకోట," అన్నది ముసలిది. "నా ప్రతాపం చూపిస్తానే, ముసలి నక్కా! రేపీపాటికి ఆ బండడి శవాన్ని తెచ్చి ఈ వీధిలోనే నీ ముందే పడేస్తాను," అంటూ గండడు వెళ్ళిపోయాడు. కానీ ఆ బండడిని పట్టి హతమార్చే దాకా గండడి మనస్సు దహించుకుపోతున్నది. వాడు వెంటనే గుర్రబ్బండి  చేసుకుని, అరట్లకోటకు ప్రయాణమయ్యాడు. 

బండి అరట్లకోట చేరేసరికి సాయంకాలమైంది. గండడు బండిలో నుంచి దిగగానే వాణ్ణి చూసిన గ్రామస్థులు దయ్యాన్ని చూసినట్టు దూరంగా తప్పుకు పోయారు. గండడు గర్వంగా మీసం మెలివేశాడు. తనను చూసి దూరంగా పోతున్న వాళ్ళను గండడు పిలిస్తే, వాళ్ళు మరింత వేగంగా వెళ్లిపోయారు. తరువాత వాడు ఒక ముసలివాడు కనిపిస్తే, "ఏయ్, ముసలాడా! ఈ ఊళ్ళో బండడు అనే వాడు ఉన్నాడట. వాడు ఎక్కడుంటాడో నీకు తెలుసా?" అని అడిగాడు. "తెలియకేం, నాయనా? ఊరవతల తోపులో గొర్రెలను మేపుతూ ఉంటాడు." అన్నాడు ముసలాడు. "సరే, నేనెవరో నీకు తెలుసా?" అని గండడు గర్వంగా అడిగాడు. "నువ్వు ఎవరైతే నాకేం, నాయనా? నువ్వూ నాలాటి మనిషివే. కాకపొతే నువ్వు వయసులో, కండలు తిరిగి ఉన్నావు. నేను వయసు ఉడిగి, బక్కచిక్కి ఉన్నాను," అంటూ ముసలాడు కర్ర ఆడించుకుంటూ వెళ్ళిపోయాడు. గండడు బండి విప్పేసి, ఊరవతల చింతలతోపు కేసి బయలుదేరాడు. గండడు అక్కడికి చేరేసరికి   ఒక మనిషి గడకర్రతో చింతకొమ్మలు కోసి, గొర్రెలకు మేపుతూ కనిపించదు. గండడు ఆ మనిషిని ఎగాదిగా చూసి, "నువ్వేనా బండడివి?" అని అడిగాడు. తాను లోగడ విన్నదాన్ని బట్టి బండడు గండడిని గుర్తించి, వెంటనే తనను తాను బయటపెట్టుకోవటం ఇష్టం లేక," కాదు, మా అన్న! మీరు దివాణంలో మల్లుడుగారు కాదూ? మా అన్నతో ఏం పని?" అన్నాడు. "వాడికి చాలా పొగరుగా ఉందట ! ఒక పట్టుపట్టి చూద్దామని !" అంటూ గండడు, బండడు గడతో లాగుతున్న చింతకొమ్మను పట్టుకుని ఒక్కలాగు లాగాడు. 

అది పెళపెళలాడుతూ పలవతో సహా విరిగి పడిపోయింది. బండడు ఆశ్చర్యంగా చూస్తూ, "ఏడిచాడు! వాడితో మీకేమిటి? నా మాట నమ్మండి. వాడు మీ కాలిగోరికి పోలడు," అన్నాడు. "ముందు వాడు ఎక్కడున్నాడో చెప్పు!" అని గండడు హుంకరించాడు. "పొరుగూరు వెళ్ళాడు. రాత్రికి వస్తాడు. అంతగా మీరు చూడాలనుకుంటే చూపుతానులెండి. అంతదాకా మీరు నాతోనే ఉందురుగాని, ఈ గొర్రెలను యిప్పుడే దొడ్డికి తోలివస్తాను," అన్నాడు బండడు. బండడు గండణ్ణి తన ఇంటికి తీసుకు వచ్చి, "అమ్మా, మరో అతిథికి కూడా వంట చెయ్యి," అని కేక వేశాడు. " ఛ! నీ పిట్టకూడు నాకేమూల?" అన్నాడు గండడు. "అయ్యా, గొర్రెను వండించడానికి అవి మనవి కావు, ఊళ్ళోవాళ్ళవి. ఏదోలా ఈ పూటకు ఈ బక్కవాడి ఆతిథ్యం స్వీకరించండి," అన్నాడు బండడు. మరో గంటకు ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. బండడి తల్లి రెండు పెద్ద ఆకుల్లో ఇద్దరికీ అన్నం వడ్డించింది. గండడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని, "ఛీ, ఛీ! ఇది అన్నమా? రాళ్లా?" అన్నాడు.

"పళ్ళులేని ముసలివాళ్ళకైతే అన్నం మెత్తగా ఉండాలి. రాళ్లు తిని హరాయించుకునే మనకెందుకు?" అని బండడు తేలిగ్గా అనేసరికి, గండడికి కొంచెం సిగ్గయింది. కాని మెత్త మెత్తని మాంసం తినటానికి అలవాటుపడ్డ గండడికి, ఈ ఉడికీ ఉడకని అన్నం మింగుడు పడటంలేదు. మాటిమాటికీ అతను గొంతు తడిచేసుకుంటున్నాడు. తినటం మానేస్తే చిన్నతనం! గండడి అవస్థను గమనిస్తున్న బండడు తనలోతాను నవ్వుకుని, "అమ్మా, నువ్వుల నూనె తీసుకురా!" అని కేకపెట్టాడు. "బతికానురా బాబూ!" అనుకున్నాడు గండడు. కాని బండడి తల్లి తెచ్చినది నువ్వుల నూనె కాదు, ముడి నువ్వులు. "చూస్తారేం! నూనె పోసుకోండి!" అంటూ బండడు, తన ఎడమచేతిలోకి కొన్ని నువ్వులు తీసుకుని పిండుకుని నూనె తెప్పించి, అన్నంలో పోసుకున్నాడు. ఇలాటిది సాధ్యమని గండడు ఎరుగడు, కాని వాడు చేసిన పని తాను మరింత తేలికగా చెయ్యగలనని, తాను కూడా ఇన్ని నువ్వులు చేతిలోకి తీసుకుని, పిండసాగాడు. అతని చేతులు నొప్పిపెట్టాయి తప్ప, ఒక్క చుక్క నూనె రాలేదు. "ఏం, నూనె పడలేదా?" అంటూ బండడు తన ఎడమచేతితో గండడి నువ్వుల చేతిని గట్టిగా పట్టుకుని పిండాడు. గండడి చేతి నుంచి నూనెతో బాటు వెచ్చగా, నెత్తురుబొట్లు కూడా కారాయి. గండడి ప్రాణాలు పోతున్నాయి. చచ్చే బాధ! నొప్పి అనటానికి అభిమానం! చివరకు ఎలాగో గొంతు పెగల్చుకొని "చాలు!" అన్నాడు గండడు. బండడు గండడి చెయ్యి వదిలి, భోజనం చెయ్యసాగాడు. "ఇప్పుడే వస్తాను!" అంటూ గండడు లేచి, మండుతున్న చేతిని ఊదుకుంటూ, చీకటిలోపడి తుని దివాణానికి తిరిగి చూడకుండా పారిపోయాడు.

దారి దోపిడి

రఘుపతి ఉండే ఊరు పట్టణానికి పది మైళ్ళ దూరాన ఉంటుంది. అతని ఇంట ఏదో శుభకార్యం జరగబోతున్నది. దాని కోసం అతని స్నేహితుడు శ్రీకంఠుడు చీకటిపడి గుర్రపుబండి కట్టించుకుని రఘుపతి ఉండే ఊరికి బయలుదేరాడు. పట్టణానికీ, రఘుపతి ఉండే ఊరికీ మధ్య చిట్టడవి ఉన్నది. ఆ అడవిలో కొంతకాలం క్రితం రఘుపతిని దొంగ దోచాడు. అది ఎలా జరిగినదీ రఘుపతి శ్రీకంఠుడికి లోగడ చెప్పాడు. రఘుపతి ఏదో పని మీద పట్నం వచ్చి, త్వరగా తెమలక, చీకటిపడి తన ఊరికి బయలుదేరుతూ, గుర్రపుబండి మాట్లాడుకున్నాడుట. బండి చిట్టడవిలో చాలా దూరం వెళ్లి ఒక మలుపు తిరిగేసరికి దారికి అడ్డంగా ఒక చెట్టుకొమ్మ పడి ఉన్నది. బండి ఆగిపోయింది. ఒక చెట్టు వెనకనుండి ముసుగు మనిషి ఒకడు పదునైన కత్తితో వచ్చి, రఘుపతి మెడకు కత్తిమొన ఆనించి, "ఉన్నదంతా ఇచ్చెయ్యి," అని డబ్బంతా తీసుకుని, బండివాడి జేబులో ఉన్నది కూడా తీసుకుని, చెట్లచాటుకు వెళ్ళాడు. "చీకటి ప్రయాణం వద్దంటే విన్నారు కారు. నా కూతురి పెళ్ళికి కూడబెట్టిన ఐదు వందలూ దొంగ కాజేసాడు," అని బండివాడు లబలబలాడాడు. రఘుపతి తన ఊరు చేరినాక, బండివాడికి ఐదు వందలు ఇచ్చేసి, ఆ రాత్రి వాణ్ణి తన ఇంటనే ఉంచుకొని , మర్నాడు పంపేశాడు. ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన గురించే ఇప్పుడు గుర్రపు బండిలో రఘుపతి ఊరికి చీకట్లో పోతున్న శ్రీకంఠం ఆలోచిస్తున్నాడు.

ఇంతలో బండి అడివి చాలాభాగం దాటి ఒక మలుపు తిరిగేసరికి, దారికి అడ్డంగా ఒక చెట్టు కొమ్మ పడి ఉన్నది. బండి ఆగిపోయింది. ఒక చెట్టు చాటు నుంచి ముసుగు మనిషి కత్తితో వచ్చి శ్రీకంఠుడి కంఠానికి కత్తి ఆనించి, అతని దగ్గర ఉన్నదంతా ఊడ్చేసి, బండివాడి జేబులో ఉన్నది కూడా తీసుకొని, పోతూ పోతూ శ్రీకంఠుడితో, "నీ దగ్గిర ఉన్న ఆ మూట ఏమిటి?" అని అడిగాడు. "చక్రపొంగలి! పిల్లల కోసం తీసుకు వెళుతున్నాను," అన్నాడు శ్రీకంఠుడు. "ఆకలి మండిపోతున్నది! చక్రపొంగలి పెద్దలు కూడా తినవచ్చు," అంటూ దొంగ మూటతో సహా పారిపోయాడు. దొంగ వెళ్ళగానే బండివాడు, "నా కూతురి పెళ్లి కోసం పోగుచేసిన అయిదు వందలూ దొంగ కాజేశాడు!" అని లబలబలాడాడు. రఘుపతి అనుభవమే మళ్ళీ జరుగుతున్నది. బండివాడు కూడా తోడుదొంగే నన్నమాట! బండివాడు చెట్టుకొమ్మ దారికి అడ్డం తొలగించి , బండిని ముందుకు నడిపించబోతుండగా శ్రీకంఠుడు, "కొంచెం ఆగు!" అన్నాడు. "ఇంకా ఎందుకు? మరో దొంగ రావటానికా?" అని బండివాడు అడిగాడు. "రానీ! మన దగ్గిర దోచుకోవడానికి ఇంకేమున్నదీ ? అయినా నా డబ్బూ, నీ డబ్బూ ఎక్కడికీ పోవులే! త్వరలోనే అవి మనకు తిరిగి వస్తాయి. అందుకే ఆగమన్నాను," అన్నాడు శ్రీకంఠుడు. "అది ఎలా సాధ్యం?" అని బండివాడు అడిగాడు. శ్రీకంఠుడు విరగబడి నవ్వి, "ఆ చక్రపొంగలి పిల్లల కోసం తీసుకుపోతున్నది కాదు, ఎలుకల కోసం తీసుకుపోతున్నది! నా స్నేహితుడి ఇంటి నిండా ఎలకలేట! పట్నంలో మంచి ఘాటైన మందు తెమ్మన్నాడు.

దొంగ దాన్ని తిని త్వరలోనే చస్తాడు. మనం వెళ్లి మన డబ్బూ తెచ్చుకోవచ్చు," అన్నాడు. ఈ మాట విని బండివాడు తెల్లబోయి, గజగజ వణుకుతూ, "రంగా, పొంగలి తినకురా!" అని గట్టిగా అరుస్తూ, బండి మీది నుంచి కిందికి దూకాడు. శ్రీకంఠుడు చప్పున వాడి పీక పట్టుకుని, "దొంగ పీనుగా, దారిదోపిడీలో నీక్కూడా భాగం ఉన్నదా?" అన్నాడు. "బుద్ధి గడ్డి తిని ఇలా మొదలుపెట్టాం. నన్ను వదలండి. నా కొడుకు పొంగలి తిని ఛస్తాడో ఏమో!" అన్నాడు బండివాడు ఆందోళనతో. ఇద్దరూ సమీపంలో ఉన్న పాకను చేరుకున్నారు. బండివాడు తొందరగా తలుపు తోసుకుని లోపల ప్రవేశించాడు. వాడి వెనకనే శ్రీకంఠుడు లోపలి వెళ్ళాడు. లోపల బండివాడి కొడుకు ఆవురావురుమని సగం పొంగలి అప్పటికే తినేశాడు. "అందులో ఎలకాలమందు ఉన్నదిరా, నాయనా! తినేశావా?" అన్నాడు బండివాడు ఏడుపు గొంతుతో. "ఏడిస్తే విషం విరగదు. నా మిత్రుడింటికి పద. వైద్యుడి చేత విరుగుడు చేయిస్తాం!" అన్నాడు శ్రీకంఠుడు. సంగతి తెలియగానే రంగడికి నీరసమూ, చెమటలూ ప్రారంభమయ్యాయి. కడుపులో తిప్పటం ఆరంభమయింది. ముగ్గురూ బండిలో రఘుపతి ఇంటికి చేరారు. శ్రీకంఠుడు తండ్రి కొడుకులను వీధిగదిలో కూర్చోబెట్టి, "ఇక్కడే ఉండండి. వైద్యుడికి కబురు పెట్టుతున్నాం," అని లోపలి వెళ్లి, రఘుపతికి జరిగినదంతా చెప్పాడు. వైద్యుడి కోసం ఎదురుచూస్తున్న తండ్రీకొడుకుల కోసం రక్షకభటులు వచ్చి, వాళ్ళను పట్టుకుపోయారు. వెళ్ళేటప్పుడు శ్రీకంఠుడు వాళ్ళతో , "పొంగలిలో ఏ విషము లేదు. కాని మీ రోగానికి చికిత్స చేసే వైద్యులు వీళ్ళే!" అన్నాడు.

పండితుడి శిష్యులు

గోవిందుడు ఒక పండితుడి ఇంట పని చేసేవాడు. తాను కూడా చదువుకోవాలనే కోరిక వాడిలో తీవ్రంగా ఉండేది. అందుచేత వాడు తరచుగా తన పని మరిచిపోయి, పండితుడు శిష్యులకు చెప్పే పాఠాలు ఆలకించేవాడు. ఒకసారి వాడు ఇలాగే పండితుడు శిష్యులకు చెప్పే పాఠం వింటూ చెయ్యవలసిన పనులు మరిచిపోయేసరికి, అది గమనించి పండితుడి భార్య వాణ్ణి నానా మాటలూ అన్నది. "పనిమాని ఏమి వింటున్నావురా?" అని పండితుడు వాణ్ణి అడిగాడు. "నాక్కూడా చదువుకోవాలని కోరిక," అన్నాడు గోవిందుడు. "నీ కోరిక మంచిదే. కాని నీకు అందుకు తగిన అర్హత ఉన్నదా? ఇప్పుడు నేను ఏం పాఠం చెబుతున్నానో చెప్పు. అలా చెప్పగలిగితే నిన్ను నా శిష్యులలో చేర్చుకుంటాను," అన్నాడు పండితుడు వాడితో. ఆయన అలా అనటానికి కారణం ఉన్నది. ఆ రోజు ఆయన బోధిస్తున్న విషయం చాలా కష్టమైనది. వింటున్న శిష్యులలో ఒక్కడికీ అది ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. గోవిందుడికి అది కొంచెమైనా అర్థం అవుతుందని ఆయన ఊహించలేదు. కాని గోవిందుడు దాన్ని అర్థంచేసుకుని, తాను విన్నది ఒక్క ముక్క పొర్లుపోకుండా చెప్పాడు. పండితుడు వాడి గ్రహణశక్తిని మెచ్చుకుని, ఆ రోజు నుంచీ వాణ్ణి తన శిష్యులలో చేర్చుకున్నాడు. త్వరలోనే గోవిందుడు పండితుడి శిష్యులందరినీ మించిపోయాడు.

శిష్యులు వాడి మీద తమకు గల అసూయను గురువుగారి దగ్గిర వెళ్లబోసుకున్నారు. "నేనేం చేసేది? వాడు సరస్వతీదేవి అవతారంలా ఉన్నాడు. వాడు నన్నే మించిపోయేటట్టుగా వున్నాడు!" అన్నాడు పండితుడు. విద్యాభ్యాసం చేస్తుండగానే గోవిందుడికి కవిత్వం అబ్బింది. వాడి కవిత్వానికి ఎంతో ఖ్యాతి వచ్చింది. గొప్పగొప్పవాళ్లు వాణ్ణి తమ ఇళ్లకు ఆహ్వానించి, కవితా గోష్టి జరిపించి, గొప్పగా సత్కరించసాగారు. ఇదంతా చూసి పండితుడి శిష్యులకు కన్నెర్రగా ఉండేది. ఇది చాలదన్నట్టు గోవిందుడు ఒక నాట్యశాల వారికి నాటకం ఒకటి రాసిపెట్టాడు. దాన్ని ప్రదర్శించగా చూసినవారందరూ అద్భుతం అన్నారు. అప్పటినుంచీ గోవిందుడు సంస్కృత నాటకాలు అనేకం రాశాడు. వాటికి పుష్కలంగా డబ్బు కూడా వచ్చింది. క్రియకు పండితుడి పేరు నిలబెట్టిన శిష్యుడు గోవిందుడు ఒక్కడే అయినాడు. మిగిలిన శిష్యులలో ఒక్కడూ ప్రయోజకుడు అనిపించుకోలేదు. వారందరూ ఏకమై, "పనిచేసుకుని రెక్కల కష్టం మీద బతకవలసినవాడు మన గురువుగారి చలవ వల్ల మహాకవి అయి కూర్చున్నాడు. మనకేమో కవిత్వం అబ్బలేదు. అది చూసి గోవిందుడు మరీ మిడిసిపడుతూ ఉండాలి. వాడి గర్వాన్ని అణచాలంటే, మనం ఇతర ప్రాంతాల నుంచి గొప్ప కవులను ఇక్కడికి ఆహ్వానించి ఘనంగా సత్కరించాలి," అనుకున్నారు.

ఈ పథకం కింద కొందరు శిష్యులు ఆంధ్రదేశానికి వెళ్లారు. ఆ రోజులలో ఆంధ్రదేశంలో నాటకాలకు బహుళ ప్రచారం ఉండేది. అక్కడి ప్రజలు ఆదరించిన నాటకాలలో కొన్ని చాలా కీర్తి తెచ్చుకున్నాయి. అలా నాటకరచనలో కీర్తి గడించుకున్న ఆంధ్రనాటకకర్తలలో శ్రేష్ఠుడు భద్రకవి. పండితుడి శిష్యులు భద్రకవిని కలుసుకుని, "మీ దేశంలో మీ నాటకాలంటే అందరూ ఎంతగానో అభిమానిస్తారని విన్నాం. కొన్నిటిని ప్రదర్శించగా మేం చూశాం. తమరు వాటిని సంస్కృతంలో అనువదించి ఇచ్చినట్టయితే, మేం మా దేశంలో ప్రదర్శింపజేస్తాం. మీకు అక్కడ కూడా అఖండ ఖ్యాతి లభిస్తుంది!" అన్నారు. భద్రకవి వారికి ధన్యవాదాలు చెప్పుకుని , "నా నాటకాలన్నిటికీ సంస్కృత మాతృకలున్నవి. నేను వాటిని ఆంధ్రీకరించాను, అంతే!" అన్నాడు. "సంస్కృతంలో వాటిని రచించిన మహాకవి ఎవరు?" అని పండితుడి శిష్యులు అడిగారు. "ఆ మహాకవి ఉండే నగరం ఉజ్జయిని. అతని పేరు గోవిందుడు." అన్నాడు భద్రకవి. శిష్యులకు చచ్చేటంత అవమానమయింది. దేశదేశాలవాళ్ళూ గోవిందుడి నాటకాలను తమ భాషలలోకి తర్జుమా చేసుకుని ఆనందిస్తుంటే, తాము ఆ నాటకాలను వదిలిపెట్టి, ఇతర ప్రాంతాల తిరుగుతూన్నారు! అసూయ ఎంతపనైనా చేయిస్తుంది అనుకుని, వాళ్ళు బుద్ధి తెచ్చుకుని, వెంటనే తమ నగరానికి తిరిగివెళ్లారు.

నేర నిరూపణ


ఒక దేశంలో ఒక ధనికుడైన వర్తకుడుండేవాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. చనిపోయే సమయంలో అతడు తన ముగ్గురు కొడుకులనూ చెంతకు పిలిచి, "నాయనలారా, నా కోసం యమదూతలు రాబోతున్నారు. నేనెంతో శ్రమపడి చాలా ఆస్తి గడించాను, ఆ ఆస్తిలోకల్లా విలువైనవి ఈ మూడు రత్నాలు. మీరు ఏ కారణం చేతనైనా వేరుపడదలిస్తే ఈ మూటినీ ముగ్గురూ తీసుకోండి. మూడూ ఒకే విలువ గలవి," అని చెప్పాడు. ఆయన పోయాక కొద్దికాలానికి అన్నదమ్ములు వేర్లుపడదామని నిశ్చయించుకున్నారు. ఆస్తిలో ముఖ్యమైనవి రత్నాలు గనుక వాటిని తలా ఒకటి తీసుకుందామని రత్నపేటిక తెరిచి చూసేసరికి అందులో రెండే రత్నాలున్నాయి. మూడవదాన్ని ఎవరో దొంగిలించారు. దొంగ ముగ్గురన్నదమ్ములలో ఒకడైవుండాలి. పరాయివాడు కావటానికి వీలులేదు. "మనలో ఒకరు రత్నాన్ని హరించారు. మనం ఒకరినొకరు నిందించుకోవటం ఎంతమాత్రం భావ్యంగా వుండదు. రత్నాన్ని దొంగిలించినవాడు తన నేరం తాను ఒప్పుకోవటానికి బిడియపడవచ్చు. ఎవరికీ అవమానం జరగకుండా, ఎవరికీ అన్యాయం జరగకుండా రేపులోపల ఈ రత్నాన్ని తీసినవారు తిరిగి యథాస్థానంలో ఉంచేది," అన్నాడు పెద్దవాడు. "లేని పక్షంలో ఏం చేయాలి?" అని అడిగాడు రెండోవాడు. "ముగ్గురం వెళ్లి రాజుగారికి ఫిర్యాదు చేద్దాం. నేరాన్ని నిరూపించే భారం రాజుగారిదే గదా?" అన్నాడు పెద్దవాడు. "ఈ ఆలోచన చాలా బాగుంది," అన్నాడు మూడోవాడు.

మరొకరోజు గడిచింది. పోయిన రత్నం తిరిగిరాలేదు. ఆ రోజే ముగ్గురన్నదమ్ములూ ప్రయాణమై రాజుగారి వద్దకు వెళ్లి, జరిగినదంతా నివేదించి, తమలో దొంగ ఎవరో నిర్ణయించవలసిందని కోరారు. ఈ కోరిక విని రాజు నివ్వెరపోయాడు. ఆయన ఈ ముగ్గురన్నదమ్ములనూ ఎరుగు! "మీ తండ్రిగారు న్యాయవర్తనుడు. నాకు మిక్కిలి హితుడు. ఆయన కుమారులు నన్ను ఇలాటి కోరిక కోరటం సంతోషంగానూ, విచారంగానూ కూడా ఉన్నది. మీలో మీరు ఈ చిక్కు విప్పలేకనే నా దాకా వచ్చారు. కొద్దిరోజులలో మీ పని ముగిస్తాను. అంతదాకా మీరు పేదరాసిపెద్దమ్మ యింట బసచేసి వుండండి. మీకు కావలసిన సౌకర్యాలన్నీ నేను ఏర్పాటు చేయిస్తాను," అన్నాడు రాజు. ముగ్గురన్నదమ్ములూ పేదరాసిపెద్దమ్మ యింట బసచేశారు. రోజులు గడవసాగాయి. రాజు అహోరాత్రాలు ఈ సమస్యను గురించి ఆలోచిస్తున్నప్పటికీ విచారణ ఏ విధంగా ప్రారంభించాలో, ఎలా సాగించాలో ఎంతమాత్రమూ పాలుపోలేదు. ఒకరోజు రాజుగారు పేదరాసిపెద్దమ్మకు కబురుచేసి ఈ విధంగా అడిగాడు: "పెద్దమ్మా! అతిథుల వల్ల నీకేమీ ఇబ్బంది కలగటంలేదు కద!" "లేదు, మహాప్రభూ! వాళ్ళు ముగ్గురూ ఎంతో మంచివాళ్ళు. ఎంతో పెద్దమనుషులు, మర్యాదస్తులు!" అన్నది పెద్దమ్మ. "అందుకే ఎటూ పాలుపోవటంలేదు. ఆ ముగ్గురిలో ఒకడు సాహసం గల దొంగ!" అన్నాడు రాజు. పెద్దమ్మ ఆశ్చర్యపోయి వివరాలడిగింది. రాజు దాచకుండా జరిగిందంతా చెప్పాడు. "అయితే ఆ అన్నదమ్ములలో ఎవరు దొంగ అయినదీ నేను తెలుసుకుంటాను మహాప్రభూ! మీరు విచారించకండి!" అన్నది పెద్దమ్మ.


ఆ రాత్రి పెద్దమ్మ వర్తకుడి కుమారులకు భోజనం పెడుతూ ఒక చిన్న కథ చెప్పింది. ఆ కథ యిదీ:

"అనగనగా సింహకేతుడని ఒక రాజు. ఆయనకు గుణవతి అని ఒకతే కుమార్తె. ఆమెకు యుక్తవయసు వచ్చేదాకా ఒక పండితుడి వద్ద విద్య నేర్పించారు. ఆమె కొరకు వివాహ ప్రయత్నాలు ఆరంభం కాగానే చదువు మాన్పించారు. ఒకనాడు ఆమె తన గురువు వద్దకు అనేక వస్త్రాలు, ఆభరణాలు, కొంత డబ్బు తీసుకుని వెళ్లి గురుదక్షిణ సమర్పించింది. కానీ ఆ పండితుడు వాటిని ముట్టక "గురుదక్షిణ ఇవ్వదలచినట్టయితే, నీవు పెళ్ళాడి పరాధీనవయేలోపుగా నా వద్దకు సర్వాభరణాలు ధరించి ఒంటరిగా రావాలి!" అన్నాడు. గుణవతి సరేనని వెళ్ళిపోయింది. "తరవాత కొద్ది కాలానికే ఆమెకు వివాహమయింది. వివాహం జరిగిన వెంటనే భర్తతో తన గురుదక్షిణ గురించి చెప్పింది. భర్త "సరే, వెళ్ళిరా!" అన్నాడు. గుణవతి నగలన్నీ ధరించి గురువుగారింటికి పోతుండగా దారిలో ఆమెను ఒక దొంగవాడు అటకాయించి, నగలన్నీ ఇవ్వమన్నాడు. లేకపోతే చంపుతానని బెదిరించాడు. గుణవతి దొంగవాడితో తన గురుదక్షిణ గురించి చెప్పి, తిరిగి వచ్చేటప్పుడు తన నగలన్నీ ఇస్తానన్నది. దొంగ ఒప్పుకున్నాడు. 

గుణవతి గురువుగారింటికి చేరుకున్నది. గురువుగారు తన శిష్యురాలి సత్యసంధతకు సంతోషించి "తల్లీ! నేను చెప్పిన చదువు సార్థకం చేశావు. ఏమి ప్రమాదం రాబోయేదీ కూడా తెలియకుండానే అన్నమాట నిలబెట్టుకున్నావు. అదే నాకు సరి అ anయిన దక్షిణ. నీవు వెంటనే తిరిగివెళ్ళి నీ భర్తతో కలకాలం సుఖంగా ఉండు." అని ఆమెను హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు. గుణవతి గురువుగారికి నమస్కారం చేసి తిరిగి వస్తూ, దారిలో తన కోసం వేచి వున్న దొంగను చూసి, "ఇవిగో, బాబూ! నా నగలిక నీవుపుచ్చుకోవచ్చు !" అన్నది. ఈ మాటతో దొంగ హృదయం మారిపోయింది. వాడు గుణవతి కాళ్ళపైబడి, "తల్లీ, క్షమించు. నీ వంటి వాళ్ళుండే ఈ ప్రపంచంలో నేను దొంగతనం చేసి బ్రతకలేను," అంటూ చీకటిలో ఎటో వెళ్ళిపోయాడు. గుణవతి తిరిగి భర్త వద్దకు వచ్చి జరిగినదంతా చెప్పింది. భర్త చాలా సంతోషించాడు. వారిద్దరూ చాలాకాలం సుఖంగా కాపరం చేశారు. పెద్దమ్మ చెప్పిన ఈ కథ విని వర్తకుడి ముగ్గురు కొడుకులూ చాలా ఆనందించారు. "నాకొక్కటే సందేహం. ఈ కథలో చాలామంది ఉదారులున్నారు. కాని అందరికన్న ఎవరి ఔదార్యం గొప్పది? ఈ సందేహం నన్ను చాలా కాలంగా పట్టి పీడిస్తోంది. నాయనలారా! మీరేమైనా నా అనుమానం తీర్చగలరా?" అని అడిగింది పెద్దమ్మ. పెద్దవాడు కొంచెం అలోచించి "వివాహమైన రాత్రే తన భార్యను గురువు వద్దకు పోనిచ్చిన భర్త ఔదార్యం గొప్పది," అన్నాడు. 

రెండవవాడు, "అంతకన్న గురువు ఔదార్యం గొప్పది," అన్నాడు. మూడవవాడు, "చేతికి చిక్కిన రాజకుమార్తె నగలను తీసుకోకుండా పోనిచ్చిన దొంగవాడి ఔదార్యం గొప్పది," అన్నాడు. "భర్త యొక్క అగ్రహాన్నీ, గురువు చేత అవమానాన్నీ, దొంగ యొక్క దురాశనూ ఎదుర్కొన్న గుణవతి ఔదార్యం మీలో ఒక్కరికీ నచ్చలేదా, నాయనా?" అంటూ పెద్దమ్మ నవ్వేసింది. ఆ రోజే పెద్దమ్మ రాజుగారి వద్దకు వెళ్లి "మహాప్రభూ! మా యింట వున్న ముగ్గురు అన్నదమ్ములలోనూ నిశ్చయంగా దొంగ మూడవవాడే. తమరు విచారించి నిజం తెలుసుకోండి!" అన్నది. ఆమె ఊహకు కారణమేమని రాజు అడిగాడు. పెద్దమ్మ జరిగినదంతా చెప్పి "ఆ కుర్రవాడు ధనలోభి కాని పక్షంలో దొంగ ఔదార్యాన్ని మెచ్చుకోడు," అన్నది. రాజు పెద్దమ్మ చెప్పినదాంట్లో సత్యమున్నదని గ్రహించి, ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపడ్డాడు. మర్నాడు అయన ముగ్గురన్నదమ్ములనూ పిలిపించాడు. "రత్నపేటికలో వున్న రెండు రత్నాలను పెద్దవారిద్దరూ తీసుకోండి. అది న్యాయం!" అన్నాడు రాజు. మూడవవాడు అన్నల ముఖాలు చూడలేక తల వంచుకున్నాడే గాని రాజు చెప్పిన న్యాయానికి విరుద్ధంగా చెప్పలేదు. తరవాత ముగ్గురన్నదమ్ములూ ఇళ్లకు వెళ్లిపోయారు. తండ్రి విడిచిపోయిన మిగతా ఆస్తిని కూడా సమంగా పంచుకున్నారు. ఆ తరువాత వాళ్ళెన్నడూ రత్నం ఎవరు దొంగిలించారనే సంగతి మాట్లాడుకోలేదు. ఎంతో సోదర భావంతో కాలం గడిపారు.

అప్పు తీర్చిన అప్పు


దశయ్య ఊళ్ళోకెల్లా పెద్ద భూస్వామి. తన కూతురి పెళ్లి సందర్భంగా ఆయన ప్రసిద్ధ నగల వర్తకుడైన మునిస్వామి దగ్గిర యాభైవేల రూపాయలకు నగలు కొని, చేతిలో ఉన్న నలభై వేలూ ఇచ్చి, మిగతాది వీలు చూసుకుని సర్దుతానని చెప్పాడు. మునిస్వామి దశయ్యను బాగా ఎరుగును, అందుచేత దశయ్యకు నగలు ఇచ్చేశాడు. అయితే దశయ్య తనకు పదివేలు బాకీ ఉన్న సంగతి ఎక్కడా గుర్తుగా రాసుకోకపోగా, భారీ వర్తకం మీదవేసుకుని సతమతమవుతూ ఆ బాకీ మాట పూర్తిగా మరచిపోయాడు. దశయ్య మాత్రం తాను మునిస్వామికి పదివేలు బాకీ ఉన్న సంగతి మరిచిపోలేదు. కాని అతనికి కాలం కలిసి రాలేదు. ఆర్థికంగా తీరని చిక్కులు ఏర్పడ్డాయి. వీటితోబాటు దశయ్య ఆరోగ్యం చెడి, మంచాన పడ్డాడు. ఆఖరు క్షణంలో ఆయన తన కొడుకు మురళితో, "నాయనా, అక్క పెళ్ళికి నగలు కొంటూ నగల వర్తకుడు మునిస్వామికి పదివేలు బాకీ పడ్డాను. అది తీర్చే లోపల మన స్థితి చితికిపోయింది. నేను ఖాయిలా పడ్డాను. ఆ బాకీ తీరనే లేదు. ఎప్పటికైనా నువ్వు ఆ బాకీ తీర్చితేగాని నా ఆత్మకు శాంతి ఉండదు. తీర్చుతానని మాటి ఇయ్యి," అన్నాడు. మురళి తండి చేసిన బాకీ తీర్చుతానని ప్రమాణం చేసినాక దశయ్య కన్నుమూశాడు. మురళి తన బతుక్కు కొత్త పునాది వేసుకోవలసి వచ్చింది. అతను అహోరాత్రాలు శ్రమపడి, చిల్లర డబ్బులు కూడబెట్టడమే కాక, తన పొట్టకట్టుకుని అయినా తండ్రి చేసిన బాకీ తీర్చటానికి డబ్బు వెనకవేస్తూ వచ్చాడు.

చివరకు ఎలాగైతేనేం, అతని దీక్ష ఫలించి, పదివేల రూపాయలు పోగయ్యాయి. మురళి దాన్ని తీసుకుని మునిస్వామి ఇల్లు వెదుక్కుంటూ వెళ్ళాడు. ఆ ఇంట్లో ఎవరో యువకుడు ఉండి, "ఎవరు మీరు? ఏం కావాలి?" అని అడిగాడు. "మునిస్వామిగారున్నారా?" అని మురళి ఆ యువకుణ్ణి అడిగాడు. "మునిస్వామిగారు చనిపోయి చాలా కాలమయింది. పోతూ, పోతూ అయన తన కొడుక్కు తన బాకీలు అప్పజెప్పి పోయాడు," అన్నాడు యువకుడు. "ఇప్పుడు మునిస్వామిగారి కొడుకు ఎక్కడ ఉన్నాడు?" అని మురళి మళ్ళీ అడిగాడు. "తండ్రి చేసిన బాకీలు తీర్చలేక, ఆ అబ్బాయి ఇల్లు వదిలి పరారీ అయి కూడా చాలాకాలం అయింది," అన్నాడు యువకుడు. ఈ మాటలు విని మురళి ఆశ్చర్యపోయాడు. "మునిస్వామిగారు పేరు మోసిన నగల వర్తకుడని చెప్పారు, అలాటివాడు అప్పులపాలు కావటం ఎలా జరిగింది?" అని మురళి అడిగాడు. దానికా యువకుడు, "ఎలా జరిగిందంటే, ఏం చెప్పాలి? నిక్షేపంలాటి నగల వర్తకంతో తృప్తిలేక ఆయనగారు సముద్ర వ్యాపారంలోకి దిగాడు. అయన సరుకులు సముద్రంలో మునిగాయి. వాటితో పాటూ ఆయనా మునిగాడు! బాకీలు మాత్రం మిగిలాయి!" అన్నాడు యువకుడు కటువుగా. "అయ్యో పాపం! ఎంత అన్యాయం జరిగిపోయిందీ! మునిస్వామిగారు నగల వ్యాపారం చేసే రోజుల్లో మా నాన్న ఆయనకు పదివేలు బాకీ పడ్డాడు.

మునిస్వామిగారి లాగే మా నాన్నకూ కాలం కలిసిరాక, ఉన్నదంతా పోయింది. ఆఖరు క్షణంలో అయన నాకు ఈ బాకీ తీర్చే భారం అప్పగించి కన్నుమూశాడు. నేను పదివేలు మిగిల్చి, నా తండ్రి ఋణం తీర్చటానికి ఇంతకాలం పట్టింది. మునిస్వామిగారు లేకపోతే మానె, అయన కొడుకు కూడా లేడే? ఈ డబ్బు ఎవరికియ్యను? మునిస్వామిగారి పేర సత్రం కట్టించి, మా తండ్రి ఆత్మకు శాంతి కలిగిస్తాను," అన్నాడు మురళి. వెంటనే ఆ యువకుడు, "అయ్యా, మునిస్వామి కొడుకు ఎక్కడికీ పోలేదు. నేనే మునిస్వామి కొడుకును. మీరు కూడా మా తండ్రి బాకీ వసూలు చెయ్యటానికి వచ్చారని భయపడి మీతో అలా అబద్ధమాడాను," అన్నాడు. మురళి ఆ మాటకు నొచ్చుకుని, "అయ్యా, తండ్రి చేసిన అప్పులకు అలా భయపడాలా? కష్టపడి అయినా తండ్రి బాకీలు తీర్చి, అయన పరువు నిలపటం కొడుకు ధర్మం కాదా? మా తండ్రి బాకీ తీర్చటానికి నేను ఎంత శ్రమపడ్డాను! ఈ డబ్బు పెట్టుబడిగా పెట్టుకుని, డబ్బు సంపాదించి, మీ తండ్రి బాకీలు తీర్చు. అంతేగాని ఆ అప్పులు భారంగా ఎంచకు!" అంటూ అతనికి పదివేలూ ఇచ్చేశాడు. మునిస్వామి కొడుకు ఆ డబ్బుతో వ్యాపారం చేసి, లాభాలు గడించి, కొంతకాలానికి తన తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చేశాడు.

Comments