పిశాచాల అనుమానం
రెండు పిల్ల పిశాచాలకు కొన్నాళ్లపాటు మనుషుల మధ్య పోయి మసలాలని కోరిక కలిగింది. అవి మనుష్యరూపాలు ధరించి ఒక ఊరు చేరుకున్నాయి. ఊరి పొలిమేరలో వాటికి ఒక రైతు కనిపించాడు. "మీ ఇంట్లో మాకు ఏదైనా పని ఇప్పించండి. నమ్మకంగా చేస్తాం." అన్నాయి పిశాచాలు రైతుతో వినయంగా. పని చేసే వంకతో రైతు ఇంట చేరి, అతనిని ఏడిపించాలని వాటి ఎత్తు. "ఎడ్ల ధర పెరిగిపోయింది. నా ఎడ్లను దొంగలు ఎత్తుకుపోయారు. మిమ్మల్ని నాగలికి కట్టితే పొలం దున్నగలరా?" అని రైతు అడిగాడు. "మనుషులు పొలం దున్నడమా?" అని పిశాచాలు ఆశ్చర్యంగా అడిగాయి. "అందులో వింత ఏమిటి? ఎడ్లకన్నా మనుషులే చౌక, నా పొలంలో ఇప్పటికి రెండు నాగళ్లు కట్టాను. మీరు సరేనంటే మూడో నాగలి కట్టుతాను," అన్నాడు రైతు. పిశాచాలు రైతు వెంట అతని పొలానికి వెళ్లి, చూస్తే, నలుగురు మనుషులు రెండు నాగళ్లకు కట్టి ఉన్నారు. మరి ఇద్దరు మనుషులు నాగళ్లను పట్టుకుని అజమాయిషీ చేస్తూ పొలం దున్నిస్తున్నారు. నాగలికి కట్టి ఉన్న మనుషుల అవస్థ చూస్తే పిశాచాలకు జాలి వేసింది. ఆ అవస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవటం కోసం అవి మూడో నాగలికి కట్టించుకుని, కొంత సేపు పొలం దున్నాయి. రైతు ఎంత కర్కోటకుడో వాటికి తెలిసిపోయింది. అవి ధరించి ఉండిన మనుష్య శరీరాలు ఆ శ్రమకు పూర్తిగా అలసిపోయాయి. రైతు వాటికి ఇచ్చిన ప్రతిఫలం కూడా చాలా స్వల్పం.
రైతు దగ్గిర పని చెయ్యటం తమకు ఇష్టంలేదని చెప్పి, పిశాచాలు అక్కడి నుంచి బయలుదేరాయి. అవి ఒక నూనె వ్యాపారి ఇల్లు చేరి, పని కావాలని అడిగాయి. నూనె వ్యాపారి పని ఇస్తానని చెప్పి, పిశాచాలను తన వెంట లోపలికి రమ్మన్నాడు. అతను వాటిని ఒక రహస్యపు గదిలోకి తీసుకుపోయి, "మీరు ఈ గదిలోనే ఉంటూ, రోజూ ఈ ఫలాల నుంచి నూనె తీస్తూండాలి," అన్నాడు. "ఆ నూనె ఎందుకు? అది విషంతో సమానం కదా?" అన్నాయి పిశాచాలు. "ఎందుకేమిటి? మంచినూనెలో కలపడానికి!" అన్నాడు వ్యాపారి. "అందువల్ల ప్రజలకు ప్రమాదం కాదా!" అన్నాయి పిశాచాలు. "కల్తీలేని నూనె ఎక్కువ ధరకూ, కల్తీనూనె తక్కువ ధరకూ అమ్ముతాను. ఎవరేమైపోతే నాకేం? నాకు కావలసినది డబ్బు," అన్నాడు వ్యాపారి. పేదవాళ్లందరూ చవకగా కల్తీ నూనె కొనుక్కుని రోగాలు తెచ్చుకుంటారని పిశాచాలకు అర్థమయింది. "ఈ పని మాకు నచ్చలేదు," అని అవి నూనె వ్యాపారికి చెప్పాయి. "నచ్చలేదంటే కుదరదు. నా రహస్యంతో మిమ్మల్ని బయటకి పోనిస్తానా? ప్రాణాలతో మీరు బయటకి పోలేరు," అన్నాడు వ్యాపారి.
"అలాగా!" అంటూ పిశాచాలు మాయమయ్యాయి. అక్కడినుంచి అవి ఆ దేశపు రాజు వద్దకు వెళ్లాయి. ఆ సమయంలో రాజు సేనాధిపతిని మందలిస్తున్నాడు. "ప్రజలు పన్నులియ్యమంటే కారాగృహంలో తోసి, కొరడాలతో కొట్టండి. బలవంతంగా ఇళ్లలో జొరబడి పన్నులు వసూలు చెయ్యండి." పిశాచాలు రెండూ భటుల వేషంలో అక్కడ ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూస్తూనే సేనాధిపతి, "రాజాజ్ఞ విన్నారు గదా? ఇక వెళ్ళండి," అన్నాడు. పిశాచాలు అక్కడినుంచి పోబోతుండగా, రాజు తాను నృత్యం చూసే వేళ అయిందని వెళ్ళిపోయాడు. పిశాచాలు అనేక చోట్లకు వెళ్లి, ప్రతిచోటా ఎంతోసేపు ఉండలేకపోయాయి. చివరకు అవి ఎంతో నిరుత్సాహపడి, తమ పిశాచాలు ఉండే చోటికి వెళ్లిపోయాయి. ఒక పెద్ద పిశాచం వాటిని పలకరించి, "అప్పుడే వచ్చేశారా? చాలా కాలానికిగాని రారనుకున్నాను. ఏం జరిగిందేమిటి?" అని అడిగింది. "జరగడానికేమీ లేదు. మనుషులంతా చాలా చాలా పేదవాళ్ళు, అమాయకులు. ఇదివరకే కొన్ని పిశాచాలు వాళ్ళ మధ్యకు చేరుకొని, మనుష్య రూపాలు ధరించి, మనుషులను నానా యాతనలూ పెట్టుతున్నాయి. మాబోటి పిల్ల పిశాచాలకు అల్లరి చేసే అవకాశం లేదు, పిశాచాల మధ్యకే వెళ్ళేదేమిటని తిరిగి వచ్చేశాం," అన్నాయి పిల్ల పిశాచాలు. పెద్ద పిశాచం నవ్వి, "మనుషులను యాతనలు పెట్టుతున్నది మనుషులే, పిశాచాలు కావు. మనుషులను గురించి అనుభవం లేక మీరు అలా అనుకున్నారు!" అన్నది. మనుషుల్లో పిశాచాలను మించిన వాళ్లుంటారని తెలిసి, పిల్ల పిశాచాలు ఆశ్చర్యపడ్డాయి.
జ్ఞానోదయం
రామానందులవారు అనే స్వాములవారు భగవద్గీత మీద అద్భుతమైన ఉపన్యాసాలు, చక్కటి ఉదాహరణలతో, ఎంతో ఆసక్తికరంగా చెప్పేవాడు. ఆయన ఉపన్యాసాలు విన్నవారు ఆయనకు బంగారం దగ్గిర నుంచీ ఎన్నో కానుకలు ఇచ్చేవారు. ఆ ధనంతో ధర్మశాలలు కట్టించి, పేదసాదలకు సహాయపడాలని అయన ఉద్దేశం. అందుకోసం ఆయన ఊళ్ళ వెంట సంచారంచేసి, డబ్బు పోగుచేస్తూ వచ్చాడు. రామానందులవారి వెంట ఆయన శిష్యుడు ఆదిత్యుడు కూడా ఉండేవాడు. ఒకరోజు గురుశిష్యులు ఒక గ్రామానికి పోతుండగా ఆదిత్యుడు గురువుగారిని ఒక సందేహం అడిగాడు : "స్వామీ భారతయుద్ధంలో పోరాడినదీ, విజయం సాధించినదీ అర్జునుడు గదా, కృష్ణుడు చెప్పినదీ, చేసినదీ మాట సహాయమే గదా? అలాటప్పుడు అర్జునుడికన్నా కృష్ణుడికి ఎక్కువ పేరు రావటానికి కారణమేమిటి? పై పెచ్చు, దైవాంశ సంభూతుడైన కృష్ణుడు అనేకసార్లు కుయుక్తులు పన్నటమూ, అర్జునుడి చేతా, భీముడిచేతా అధర్మయుద్ధాలు చేయించటమూ, ఆ విధంగా విజయం సమకూర్చి పెట్టటమూ చూస్తే నాకు భగవద్గీతమీదా, పురాణాలమీదా గౌరవం కలగకుండా ఉన్నది," శిష్యుడి అనుమానం విని రామానందులవారు నవ్వి, "బాబూ, అవకాశం వచ్చినప్పుడు నీ సందేహానికి సమాధానం అదే వస్తుంది," అన్నాడు. త్వరలోనే వారు ఒక అడవి ప్రవేశించారు. గురువుగారు ఆదిత్యుణ్ణి ఒక చెట్టు ఎక్కించి, మంచి లావుగల కర్ర ఒకటి కోయించాడు.
ఆదిత్యుడు ఒక కొమ్మ విరుచుకువచ్చి, దాని రెమ్మలు తీసేసి, మంచి లాఠీగా తయారు చేసి, చేత పట్టుకున్నాడు. కొద్దిదూరం వాళ్ళు అడివిలోకి నడిచేసరికి ఒక దొంగ పెద్ద చెట్టుచాటు నుంచి వారి ముందుకు వచ్చి, చేతిలో తుపాకీ పట్టుకుని వారికి గురిపెట్టి, "మర్యాదగా మీ దగ్గిర ఉన్న డబ్బంతా వెంటనే ఇచ్చెయ్యండి. లేకపోతే చస్తారు!" అన్నాడు. అనుకోని ఈ సంఘటనకు భయపడిపోయి, ఆదిత్యుడు వణుకుతున్న కంఠంతో, "గురుదేవా మీవద్ద ఉన్న డబ్బుల సంచీ తక్షణం ఈ వెధవకు ఇచ్చి, ప్రాణాలు కాపాడుకోండి," అన్నాడు. వాళ్ళ దగ్గిర డబ్బున్నదని రూఢీగా తెలియటంవల్ల దొంగ మరింత రెచ్చిపోయాడు. రామానందులవారు దొంగతో, "బాబూ నా దగ్గిర ఉన్న డబ్బు నిరుపేదల సహాయంకోసం ఖర్చు చెయ్యటానికి కూడబెట్టినది. దీన్ని నువ్వు కోరటం న్యాయం కాదు," అన్నాడు. వెంటనే దొంగ స్వాములవారి మీద కలియబడి బంగారునాణాలు గల సంచీ లాగేసుకుని "నేనూ పేదవాణ్ణే! మీ డబ్బు నాకు చేరటం న్యాయమే!" అంటూ వెళ్ళబోయాడు.
స్వాములవారు బాధగా, "బాబూ, నా జీవితమంతా కృషిచేసి కూడబెట్టిన ధనమంతా పోగొట్టుకుని, నేను జీవించటం వ్యర్థం! ఆ తుపాకీతో నన్ను చంపు," అన్నాడు. దొంగ ఆ మాటకు పకపకా నవ్వి, "స్వామీ, ఇది పేలదు! కొయ్యతుపాకీ!" అన్నాడు తన తెలివితేటలూ బయటపెడుతూ. స్వాములవారు వెంటనే, "నా అనుమానం నిజమేనన్న మాట! కొయ్య తుపాకీతో వాడు ఏం చేస్తాడు? ఆదిత్యా చూస్తేవేం? ఆ లాఠీతో రెండు తగలనీ!" అన్నాడు ప్రోత్సాహపూర్వకంగా. అంతే! ఆదిత్యుడు గొప్ప వీరకేసరి అయిపోయి, దొంగ వీపును చిట్లగొట్టేశాడు. దొంగను చేతులు విరిచి చెట్టుకు కట్టేశారు. వాడు తీసుకున్న డబ్బు సంచీ తిరిగి వచ్చింది. గురు శిష్యులు తిరిగి ప్రయాణం సాగించారు. "శిష్యా! భారతయుద్ధం చేసినది అర్జునుడైతే, తంత్రం చెప్పినది కృష్ణుడు. దొంగను కొట్టి లొంగదీసినది నువ్వు! కానీ అడవిలో ప్రవేశించేవాడి చేతిలో కర్ర ఉండాలని చెప్పినదీ, దాన్ని ఎప్పుడు వాడాలో చెప్పినదీ నేను! దొంగ చేతిలో ఉన్న తుపాకీ వాడి చేతిలో మరీ పుల్లలాగా ఆడటం చూసి, అది కొయ్య తుపాకీ ఏమో అని అనుమానించాను. ఆ మాట వాడి చేతనే పలికించి, రుజువు చేసుకున్నాను. వాడి మీద తంత్రం ప్రయోగించే ముందు, నా డబ్బు ఆశించవద్దని నీతి బోధచేశాను. వాడు వినలేదు. దండ ప్రయోగం తప్పనిసరి అయింది. ఒక్క దొంగను లొంగదీసుకోవటానికి ఇంత తతంగం ఉంటే, వందమంది కౌరవులనూ, వారి బలాలనూ జయించట్టానికి కృష్ణుడు ఎంత తంత్రాంగం నడిపి ఉండాలి?" అన్నారు స్వాములవారు. ఆ మాటలతో ఆదిత్యుడికి జ్ఞానోదయమయ్యింది.
పారిపోయిన దొంగ
వీధి తలుపు చప్పుడు కావడంతో, వంటగదిలో ఉన్న రామ వచ్చి తలుపు తీసింది. ఆ సరికే బాగా చీకటి పడింది. అవతల ఉన్న మనిషి ఆమెను తోసుకుని లోపలి వచ్చి, చప్పున తలుపు మూసి, "అరిచావంటే పీక నులిమేస్తాను. అన్నింటికీ తెగించాను! ఖైదులో నుంచి పారిపోయి వస్తున్నాను!" అన్నాడు కరకుగా. వీధి వెంట నలుగురు మనుషులు పరిగెత్తిన శబ్దం అయింది. వాళ్ళు దొంగను తరుముకుంటూ వస్తున్న రక్షకభటులు. వాళ్ళను దూరం కానిచ్చి, రమ నవ్వుతూ, "చెరసాలలో సుఖంగా కాలం గడపక, ఏం బావుకుందామని పారిపోయి వచ్చావు?" అని దొంగను అడిగింది. దొంగ కోపంగా, "ఆ విషయం నీకు అనవసరం. ఇంట్లో ఇంకా ఎవరు ఉన్నారు?" అని అడిగాడు. "నీకేమి భయంలేదు. నేను ఒంటరిగానే ఉన్నాను. వంట సగం అయింది. వంట గదిలోకి వస్తావా?" అంటూ దారి తీసింది రమ. దొంగ ఆమె వెనకనే వంటగదిలోకి వెళ్లి ఆమె వేసిన పీట మీద కూర్చున్నాడు. రమ వంకాయలు తరుగుతూ కళ్ళ నీళ్లు పెట్టుకుని, కొంగుతో తుడుచుకున్నది. "నేను నిన్ను ఏమీ అనలేదే? ఎందుకు కన్నీళ్లు?" అని దొంగ అడిగాడు. "నిన్ను చూస్తే మా అన్న గుర్తుకు వచ్చాడు. వాడు ఆవేశంలో ఎవరినో కొట్టి, ఖైదు అయ్యాడు.
అయితే ఒక రాత్రి నీలాగే పారిపోయి వచ్చాడు. వచ్చిన క్షణం నుంచీ వాడికి శాంతి లేదు! నిద్ర లేదు! అన్న హితవు లేదు! ఇల్లు కదలాలంటే భయం! బయట ఏ చప్పుడు వినిపించినా రక్షకభటులు వస్తున్నారని భయం! పిచ్చివాడిలా తయారయ్యాడు. శిక్ష పూర్తిగా అనుభవించి వస్తే ఇలాటి భయాలు ఉండవు. ధైర్యంగా కొత్త జీవితం ఆరంభించవచ్చును. ఆ మాట నేను చెప్పాను. వాడు వినలేదు. పది రోజులపాటు ఇంట్లోనే అజ్ఞాతవాసం చేశాడు. పదో రోజు హఠాత్తుగా రక్షకభటులు వచ్చారు. భయంతో, ఆలోచించకుండా మేడ మీది నుంచి దూకేసి, దెబ్బలు తగిలి, రెండు రోజుల అనంతరం చచ్చిపోయాడు," అంటూ రమ కథ ముగించింది. దొంగ ఆమెను చూసి జాలిపడుతూ, "గొంతు తగ్గించు! ఎవరైనా రాగలరు!" అన్నాడు. "వంట అయింది. భోజనం చేస్తావా?" అన్నది రమ. దొంగకు తినాలనే ఉన్నదిగాని, సందేహించాడు. "ఇందులో విషం కలపలేదులే! నీ ఎదటేగా వంట చేశాను?" అంటూ రమ దొంగ ముందు అన్నం, కూరలూ వడ్డించింది. వాడు భోజనం చేస్తుంటే రమ, "చూడబోతే మంచివాడిలాగున్నావు! చెరసాలలో ఎలా పడ్డావు?" అని అడిగింది. దొంగ ఇలా చెప్పాడు: "నా తల్లిదండ్రులెవరో నాకు తెలీదు. ఒక అవ్వ నన్ను పెంచి, పెద్ద చేసింది. నన్ను గారాబంగా పెంచటానికి తాను అష్టకష్టాలు పడింది. ఆమె పోయాక నా కష్టాలు ప్రారంభమయ్యాయి. నాకు చదువు లేదు. మా పల్లెలో పనిలేక పట్నం వచ్చాను. ఏ పనీ ఇచ్చినవారు లేరు. నాలుగు రోజులు తిండిలేదు, ఆకలి బాధకు తాళలేక, ఒక వ్యాపారస్థుడి చేతిలో ఉన్న సంచీ లాక్కుని, పారిపోయి పట్టుబడ్డాను. రెండు నెలల శిక్ష పడింది."
"అలానా పాపం! మరి ఇప్పుడు పారిపోయి ఎందుకు వచ్చావు?" అని రమ అతన్ని అడిగింది. "అక్కడ అడ్డమైన చాకిరీ చేయాలి. పెద్ద ఎత్తున వంటలు చెయ్యాలి. తోటపని చూడాలి. బట్టలు పిండాలి. చాపలూ, దుప్పట్లూ నేయాలి. బట్టలు కుట్టాలి, ఇలా ఎన్నోరకాల పనులు! అవన్నీ చేసే ఓపిక నాకు లేదు," అన్నాడు దొంగ విసుక్కుంటూ. రామ నవ్వి, "బయట పని దొరకలేదని, దొంగతనం చేసి, చెరసాలకు వెళ్ళావు! అక్కడ పని ఎక్కువ అని దొంగతనంగా పారిపోయి వచ్చావు! ఇప్పుడు ఏం చేస్తావు?" అని అడిగింది. రమ మళ్ళీ ఇలా అన్నది: "ఇప్పటినుంచీ నీకు నరకబాధలు ప్రారంభమవుతాయి. నిద్రాహారాలుండవు! భయం నిన్ను నీడలా అంటిపెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? ఉద్యోగం ఎలా దొరుకుతుంది? నీకిప్పుడు జైలులో ఉన్న స్వేచ్ఛ కూడా లేదు. పారిపోయి వచ్చి నీ ఖైదు శిక్షను పెంచుకున్నావు. అంతే! ఆ చెరసాలలోనే ఏ వంటలు చెయ్యడంలోనే, బట్టలు కుట్టడంలోనో, దుప్పట్లు నెయ్యడంలోనో, తోటపనిలోనో ప్రావీణ్యం సంపాదించి ఉంటే, విడుదల అయివచ్చాక, నీ బతుకు నువ్వు స్వతంత్రంగా, గౌరవంగా బతికే మార్గం దొరికేది. అక్కడ నీకు శిక్షతోబాటు ఏదో వృత్తిలో శిక్షణ కూడా దొరుకుతుంది! నువ్వు చాలా తెలివితక్కువ పని చేశావు, పారిపోయి వచ్చావు!"
దొంగకు కళ్ళు తెరుచుకున్నాయి. అతను తాను చేసిన పొరపాటు గ్రహించాడు. "నిజమే! పొరపాటు జరిగిపోయింది. దీన్ని దిద్దుకోవడమెలాగా?" అని అతను రమను అడిగాడు. "మించిపోయిందేమీలేదు. నీ అంతట నువే చెరసాలకు వెళ్లి, పెట్టుబడు. అలా చేస్తే నిన్ను దండించారు! కొద్దిగా నీ శిక్ష పెరగవచ్చు. పని నేర్చుకోవడానికి అదీ మంచిదే!" అన్నది రమ. దొంగ సంతోషంగా, "సొంత చెల్లెలులాగా మంచి సలహా చెప్పావు. నీ ఋణం తీర్చుకోలేను. వస్తా!" అని వెళ్ళిపోయాడు. దొంగ వెళ్లిన కొంతసేపటికి మళ్ళీ తలుపు చప్పుడు వినిపించింది. ఈసారి వచ్చినవాడు రమ తండ్రి. "ఎప్పుడూలేనిది, ఇంత ఆలస్యం అయిందేం, నాన్నా?" అని రమ తండ్రిని అడిగింది. "చెరసాల నుంచి ఒక దొంగ పారిపోయాడు. అందుకే ఆలస్యం అయింది," అన్నాడు తండ్రి. ఆయన చెరసాల అధికారి. "మీరు ఖైదీలను చూసే తీరు అలా ఉంటుంది! చెరసాలలు కేవలము ఖైదీలను శిక్షించటానికేకాదు, వాళ్లలో పరివర్తన కలిగించేవిగా కూడా ఉండాలి. మీ చెరసాల నుంచి పారిపోయిన దొంగ మన ఇంటికే వచ్చాడు. నేను ఆ దొంగలో ఉన్న దొంగను పారదోలాను. అందుకోసం ఒక అన్నయ్యను కూడా కల్పించాను," అంటూ రమ జరిగినదంతా చెప్పింది. "భేష్! చెరసాల అధికారి కూతురివి అనిపించుకున్నావు! అతను చెరసాల చేరాడో, లేదో చూసివస్తాను," అంటూ అయన లేచాడు. "ఆ భయం నీకు వద్దు. చెప్పానుగా? అతనిలో దొంగ పారిపోయాడు! భోజనం చేసి నిదానంగా వెళ్ళవచ్చు నువ్వు," అన్నది రమ.
విచిత్ర వివాహం
పూర్వం పాటలీపురంలో ఒక ధనవంతుడైన బ్రాహ్మణుడికి కేసటు డనే కుమారుడుండేవాడు. అతడు అసాధారణమైన అందచందాలు కలవాడు. యుక్తవయసు రాగానే అతనికి పెళ్లాడాలనిపించింది. తనకు తగిన అందగత్తె ఎక్కడా కనపడనందున కేసటుడు, తీర్థయాత్రలు చేసి వస్తానని తల్లిదండ్రులతో చెప్పి కన్యాన్వేషణకు బయలుదేరాడు. కేసటుడు చాలారోజులు ప్రయాణం చేసి నర్మదాతీరం చేరాడు. ఆ సమయానికే అక్కడికి పెళ్ళివారి గుంపొకటి వచ్చి చేరింది. ఆ గుంపులోనుంచి ఒక ముసలిబ్రాహ్మణుడు, కేసటుడి అందచందాలను చూసి అతని దగ్గరికి వచ్చి, "నాయనా, పెద్దవాణ్ణి, నాకొక్క సహాయం చేసిపెడుదూ!" అని ఎంతో దైన్యంగా అడిగాడు. ముసలివాడిపైన జాలికలిగి కేసటుడు, "చెప్పండి, నా చేతనైతే అలాగే చేస్తాను," అన్నాడు. "నాకీ సహాయం చేయటంవల్ల నీకేమీ నష్టం ఉండదు. నా వంశం మాత్రం నిలబెట్టినవాడవవుతావు," అన్నాడు ముసలి బ్రాహ్మణుడు. "నేనేంచేయాలి?" అన్నాడు కేసటుడు. "నర్మదకు ఆ దరిని రత్నదత్తుడనే బ్రాహ్మణుడున్నాడు. ఆయనకు రూపవతి అనే కుమార్తె, చక్కని చుక్క, ఉన్నది. ఆ పిల్లను నా కొడుక్కు చేసుకోవటానికి పోతున్నాం. నా కొడుకుని ఇంకా వారు చూడలేదు. నువ్వు ఎంత అందగాడివో, మా వాడంత కురూపి. వాణ్ణి చూస్తే రత్నదత్తుడు పిల్లనివ్వడు. అందుచేత నువ్వు నా వెంట వస్తివా, నువ్వే నా కొడుకువని చెబుతాను. నిన్నే పెళ్ళికొడుకుని చేస్తాం. పిల్ల మెళ్ళో నువ్వే తాళి కట్టు! పెళ్లి అయిపోయాక నీ దారిన నువ్వు వెళ్ళు, నా దారిన నేను కోడల్ని తీసుకుని మా ఊరు పోతాను. ఈ సహాయం చేసినందుకు నీ ఋణం ఉంచుకొనులే, బాబూ!" అన్నాడు బ్రాహ్మణుడు.
ఆ ముసలివాడు నీచత్వానికి కేసటుడు దిగ్భ్రమచెందాడు. కానీ ముందుగా మాట ఇచ్చాడు కనక ముసలివాడు కోరినట్టు చెయ్యక తప్పిందికాదు. అతను కూడా పెళ్లి ముఠాలో చేరి పడవల మీద నది దాటి ఆ సాయంకాలమే పెళ్ళివారి ఊరు చేరాడు. ఆ సాయంకాలం కేసటుడు కాలకృత్యాలు తీర్చుకునేటందుకు నది దగ్గిరికి వెళ్లేసరికి అతన్ని ఒక రాక్షసుడు పట్టుకుని తినబోయాడు. తాను ఒక బ్రాహ్మణుడికి సాయపడటానికి మాట ఇచ్చాననీ, ఆ పని పూర్తిచేసి మర్నాడు రాత్రి వస్తాననీ, అప్పుడు రాక్షసుడు తనను తినవచ్చుననీ కేసటుడు చెప్పాడు. "ఆడితప్పవు గద?" అన్నాడు రాక్షసుడు. "ఆడితప్పను గనుకనే దుర్మార్గుడైన ఆ బ్రాహ్మణుడికి సాయంచేస్తున్నాను," అన్నాడు కేసటుడు. "సరే వెళ్ళిరా, నీ సత్యసంధత ఎలాంటిదో చూస్తాను!" అన్నాడు రాక్షసుడు. కేసటుణ్ణి పెళ్ళికొడుకుని చేశారు. వివాహం సక్రమంగా జరిగిపోయింది. కానీ కేసటుడు రూపవతి కేసి చూడలేదు, ఆమెతో మాట్లాడలేదు. ఇంత అందగాడు తనకు భర్త అయినాడని సంతోషించిన రూపవతి, తన భర్తకు తనపై ఆగ్రహం కలిగిందనుకుని, ఏమిచెయ్యటానికీ తోచక నిద్రపోయేదానిలాగా కళ్ళుమూసుకుని పడుకున్నది. ఒకరాత్రివేళ కేసటుడు, రూపవతి గాఢనిద్రలో ఉన్నట్టు ఊహించి, మెల్లిగా గది నుంచి బయటికి వచ్చి, నదీతీరాన ఉన్న రాక్షసుడి దగ్గిరికి బయలుదేరాడు.
ఇదంతా గమనిస్తున్న రూపవతి కూడా లేచి మేలిముసుగు కప్పుకుని కేసటుణ్ణి కొంత దూరంలో అనుసరించి నడవసాగింది. కేసటుడు నది దగ్గిరికి వచ్చేసరికి రాక్షసుడు కనిపించి, "యువకుడా, భలే! అన్నమాట నిలబెట్టుకున్నావు. ఇంత సత్యసంధుడివైన నిన్ను తిని నేను పవిత్రుణ్ణవుతాను!" అన్నాడు. ఇది చూసి రూపవతి ముందుకువచ్చి ఆక్రోశిస్తూ, "అయ్యా! ఆయన నా భర్త! వదిలిపెట్టు!" అన్నది. "నాకు ఆకలిగా ఉన్నది. నేనితన్ని తినకమానను. అడ్డురాకు. తక్షణం యిక్కడనుంచి వెళ్ళిపో," అన్నాడు రాక్షసుడు కోపంగా. "నీకు ఆకలిగా ఉంటే నన్ను తిని ఆయనను విడిచిపెట్టు. ఆయనను భక్షించి నన్ను దిక్కులేనిదాన్ని చేస్తే నా గతి ఏంకాను?" అన్నది రూపవతి. "అందుకు నన్నేం చేయమన్నావు? పోయి, ఎక్కడైనా బిచ్చమెత్తుకో!" అన్నాడు రాక్షసుడు. "అనాథనైపోతే నాకెవరు భిక్షపెడతారు? ఆ మాత్రం నీకు తెలియదా," అన్నది రూపవతి. "నువ్వడిగితే భిక్ష పెట్టనివాడు తల పగిలి చస్తాడు, సరేనా? ఇక వెళ్ళు!" అన్నాడు రాక్షసుడు.
"అయితే నిన్నే అడుగుతాను. నాకు పతిభిక్ష పెట్టు," అన్నది రూపవతి. ఆమెను చూసి రాక్షసుడికి చాలా ఆనందమయింది. "ఇడుగో, నీ భర్త! తీసుకో! అతనికి తగ్గ భార్యవే దొరికావు! మీ ఇద్దరూ నాలుగుకాలాలపాటు సుఖంగా ఉండండి," అని వాళ్ళిద్దరినీ దీవించి రాక్షసుడు చీకటిలో ఎటో వెళ్ళిపోయాడు. రూపవతి పతిభక్తి చూసి కేసటుడికి ఎంతో ఆనందం కలిగింది. అయినా అతను ఆమెతో అసలు విషయం చెప్పలేదు. తెల్లవారేలోపుగా వారు ఇంటికి తిరిగి వచ్చారు. మర్నాడు భోజనాలు పెందలాడే ముగించి పెళ్ళివారు పెళ్లికూతురుతో సహా ఇంటికి తరలారు. కృతఘ్నుడైన ముసలి బ్రాహ్మణుడు, యేరు దాటి తెప్ప తగలేసినట్టుగా, కేసటుడితో పని అయిపోయింది గనక అతనికి పెట్టిన నగలూ, వస్త్రాలూ లాక్కుని, తనవారినందరినీ ఒక పడవలో ఎక్కించి, మరొక పడవలో కేసటుణ్ణి ఎక్కించాడు. రెండో పడవవాళ్ళకి పుష్కలంగా డబ్భిచ్చి, నడియేట్లో పడవను ముంచెయ్యమని కూడా చెప్పాడు. నది దాటేటప్పుడు ముందు పడవ సవ్యంగా అవతలి ఒడ్డు చేరింది. వెనక పడవ మాత్రం నట్టేట మునిగిపోయింది. బాగా ఈదటం చేతనైన పడవవాళ్ళు మాత్రం ఈదుకుంటూ ఒడ్డు చేరారు. ప్రవాహం బలంగా ఉండటంవల్ల కేసటుడెక్కిన పడవ మునిగి కూడా చాలా దూరం కొట్టుకుపోయింది. కేసటుడు చావు తప్పి కన్ను లొట్టపోయి ఏదో విధంగా ఆ పడవలో నుంచి బయటపడి ఒడ్డు చేరుకోగలిగాడు. తనకు ముసలి బ్రాహ్మణుడు చేసిన ద్రోహం కన్నా రూపవతి దూరం కావటం కేసటుణ్ణి చాలా బాధించింది. ఇక్కడ పెళ్ళివారి వెంట నది దాటి కాలినడకను నడిచిపోతున్న రూపవతి ముసలి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి, వినయంగా, "ఏమండీ, మిగిలినవారంతా కలిసి నడుస్తున్నారు, ఆయనగారు మాత్రం ఎక్కడా కనిపించరేం?" అని అడిగింది.
"నీ భర్తేనా? ఇడుగో!" అంటూ ముసలి బ్రాహ్మణుడు కురూపి అయిన తన కుమారుణ్ణి చూపించాడు. రూపవతి పట్టరాని దుఃఖమూ, ఆగ్రహమూ వచ్చాయి. "నా భర్త ఈయనా? ఇదేదో రాజుగారిని అడిగి తేలుస్తాను!" అన్నది రూపవతి కోపంగా. పెళ్లికూతురు నిజంగా అంతపనీ చేస్తే రాజుగారు తన తల తీయించేస్తారని ముసలివాడికి భయం పట్టుకుంది. అందుచేత ఆయన ఆ పిల్లను వెంటనే, తన మనుషుల చేత పుట్టింటికి పంపించేసి తనదారిన తాను వెళ్ళాడు. రూపవతికి మాత్రం తను పుట్టిల్లు చేరానన్న సంతోషం లేకుండాపోయింది. ఆమె తన భర్త కోసం అహోరాత్రాలు పరితపించసాగింది. ఆయన సజీవుడో కాదో అన్న భయం కూడా ఆమెను పట్టుకున్నది. దుర్మార్గుడైన వృద్ధ బ్రాహ్మణుడు తన భర్తకేమైనా కీడు కలిగించాడేమో అని ఆలోచించసాగింది. ఈలోపుగా ప్రాణాలతో ప్రవాహంనుంచి బయటపడిన కేసటుడు, రూపవతికి జరిగిన అన్యాయం గురించి ఆమె తండ్రి అయిన రత్నదత్తుడితో చెప్పేసి, ఆ అన్యాయంలో తాను కూడా భాగం పంచుకున్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకుందామని, కాలినడకను రూపవతి తండ్రి ఇల్లు చేరుకున్నాడు. అక్కడ కేసటుడికి రూపవతి కనిపించగానే అతనికి ఎక్కడలేని ఆశ్చర్యమూ వేసింది. రూపవతికి కలిగిన ఆనందానికి మేరేలేదు. కేసటుడికి ఆ యింట అల్లుడికి జరగవలసిన మర్యాదలన్నీ జరిగాయి. కొంతకాలం అత్తవారింట ఉండి కేసటుడు రూపవతితో సహా పాటలీపురానికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ చాలాకాలం వారు సుఖంగా జీవించారు.
సగం ధర
రంగయ్య మధ్యతరగతి రైతు. అతనికి ఉన్న ఆస్తి రెండెకరాల పొలమూ, పాతకాలపు మేడా మాత్రమే. రంగయ్య కూతురు పెళ్లి ఈడుకు వచ్చింది. తన కూతుర్ని గొప్పవాడి చేతుల్లో పెట్టాలని రంగయ్య ఆలోచన. చూడగా, చూడగా, రంగయ్యకు నచ్చిన సంబంధం వచ్చింది. అయితే వాళ్ళు మూడువేల కట్నం అడిగారు. చూస్తూ, చూస్తూ, ఆ సంబంధం వదులుకోలేక, తన పొలం తాకట్టు పెట్టి అప్పు పుట్టించాలని తనకు తెలిసినవాళ్ళ నందరినీ కదిలించి చూశాడు. కానీ అది మెరక పొలం కావటంచేత ఎవరూ డబ్బిస్తామని ముందుకు రాలేదు. ఆ గ్రామంలోనే ఉన్న వడ్డీవ్యాపారి వీరయ్యకు ఈ సంగతి తెలిసింది. వాడు జలగలాంటి వాడు. అప్పు ఇచ్చేవరకూ మంచిగా ఉండి, అప్పు తీరేదాకా అవతలవాణ్ణి పట్టి వదలడు. ఎవరూ తీసుకోని రంగయ్య పొలం తనకు తేలికగా స్వాధీనమవుతుందను కున్నాడు వీరయ్య. వీరయ్య మాటలకు రంగయ్య పొంగిపోయాడు. వీరయ్య రంగయ్య పొలాన్ని సగం ధరకు కొంటానన్నాడు. అయితే రంగయ్య ఎప్పుడు తన పొలాన్ని తిరిగి కొనదలచినా సగం ధరకే అమ్ముతానన్నాడు. వీరయ్య మాటలలో ఏదో మోసం ఉన్నాడని శంకించి, రంగయ్య ఆలోచించుకుని మర్నాడు చెబుతాననీ, అన్నాడు. తర్వాత రంగయ్య గ్రామకరణం లింగయ్య వద్దకు వెళ్లి, వీరయ్య అన్న మాట చెప్పాడు. లింగయ్య అంతా విని, రంగయ్య దురాలోచన గ్రహించి, అతడికి గుణపాఠం చెప్పటానికి మంచి అవకాశం దొరికిందనుకున్నాడు.
"రంగయ్యా, నీ పొలం ఎనిమిది వేలు చేస్తుంది. దాన్ని నాలుగు వేలకే కొట్టేద్దామని వీరయ్య ఎత్తు వేశాడు. నువ్వు నీ కూతురు పెళ్లి అయ్యాక, మళ్ళీ ఆ నాలుగువేలూ చేర్చి తిరిగి పొలం కొంటావనేది ఉత్తమాట! కనక నువ్వు నేను చెప్పినట్టు చేశావంటే నీ కూతురి పెళ్లి అయిపోతుంది, వీరయ్య రోగం కూడా కుదురుతుంది!" అని లింగయ్య తన ఆలోచన రంగయ్యకు చెప్పాడు. రంగయ్య ప్రాణం కుదుటపడింది. మర్నాడు రంగయ్య తీరికగా అరుగు మీద కూర్చుని ఉండగా వీరయ్య వచ్చాడు. అదే సమయానికి లింగయ్య కూడా అటేవచ్చాడు. "సమయానికి వచ్చారు కరణంగారు! సాక్ష్యానికి పనికివస్తారు," అన్నాడు వీరయ్య. కరణం తాను కూడా అరుగు మీద చతికిలపడి, వీరయ్యకేసి చూస్తూ, "ఏమిటి విషయం?" అని అడిగాడు. రంగయ్య గొంతు సవరించుకుని, "మరేం లేదు, కరణంగారూ! వీరయ్య నా పొలాన్ని సగం ధరకు తీసుకుంటానంటున్నాడు. మళ్ళీ సగం ధర నేను ఎప్పుడిస్తే అప్పుడు పొలం నాకు తిరిగి ఇచ్చేస్తాడట. నాకేమో ఇప్పుడు డబ్బు అవసరంగా ఉన్నది. అందుచేత, అదే షరతుకు ఇరవైవేలు చేసే నా మేడను వీరయ్యకు అమ్ముదామనుకుంటున్నాను. ఏమంటారు, వీరయ్యగారూ?" అన్నాడు.
వీరయ్యకు తన రొట్టె విరిగి నేతిలో పడిందనిపించింది. రంగయ్య పది జన్మలెత్తినా పదివేలు పెట్టి తన వద్ద ఇల్లు తిరిగి కొనలేడు! ఇరవైవేలు చేసే ఇల్లు పదివేలకే తనది అవుతుంది! రంగయ్య తన మేడను సగం ధరకు, అనగా పదివేలకు, తనకు అమ్ముతున్నట్టూ, అతను తిరిగి సగం ధరకు తనవద్ద ఆ ఇంటిని ఎప్పుడు కొనదలచినా తాను ఇచ్చేటట్టూ కరణంగారి చేత కాగితం రాయించి, దాని మీద నలుగురిచేతా సంతకాలు పెట్టించి, వీరయ్య అందరి ఎదుటా రంగయ్యకు పదివేలు ఇచ్చేశాడు. దాని మీద తాను కూడా సంతకం పెట్టి, కాగితాన్ని కరణం తన వద్ద ఉంచుకున్నాడు. రంగయ్య తన కూతురి పెళ్లి నిశ్చయం చేసుకుని, బంధుమిత్రులందరికీ ఆహ్వానాలు పంపాడు. ముహూర్తం సమీపిస్తూండగా, వీరయ్య ఆరుగురు పనివాళ్లను వెంటబెట్టుకువచ్చి, "ఈ ఇంటిని నాకు అమ్మావు. ఇందులో నువ్వు పెళ్లి జరిపించటానికి వీల్లేదు. కావాలంటే నా డబ్బు నాకిచ్చి నీ ఇల్లు నువ్వు తీసుకో," అంటూ రంగయ్యతో పేచీకి దిగాడు. ఇలా జరగబోతుందని రంగయ్యకు ముందే తెలుసు. అతను ఎదురుగా కూర్చున్న కరణం కేసి చూశాడు. "నేను చెప్పినట్టు చెయ్యి." అన్నట్టుగా కరణం రంగయ్యకు సైగ చేశాడు.
రంగయ్య లేచి, ఇంట్లోకి వెళ్లి, అయిదు వేలు తెచ్చి వీరయ్య చేతిలో పెట్టి, "ఇదుగో నీకియ్యవలసిన సొమ్ము, ఈ ఇల్లు నీ నుంచి తిరిగి కొనుక్కున్నాను. ఇక ఈ ఇల్లు నాది. అతిథివి కాబట్టి, అక్షింతలు వేసి, భోజనం చేసి వెళ్ళు," అన్నాడు. వీరయ్యకు మతిపోయినట్టయింది. "ఏం రంగయ్యా? నన్ను ఆడిస్తున్నావా? నువ్వు అయిదువేలిస్తే సరిపోయిందా? మరో అయిదువేలు ఇయ్యి. అప్పుడే ఈ ఇల్లు నీది అవుతుంది. చూశావుగా, ఏమంటావు, కరణం?" అన్నాడతను. "నేనేమంటాను? నువ్వు అనేది తప్పంటాను! కాగితంలో రాసినది అక్షరాలా అమలు జరిగిందంటాను!" అన్నాడు కరణం. జేబులో నుంచి కాగితం తీసి "అమలు జరిగిందా? ఏదీ! వీళ్లందరి ముందూ చెప్పు!" అన్నాడు వీరయ్య. "జాగ్రత్తగా విను. రంగయ్య ఇరవైవేలు ఖరీదు చేసే తన మేడను నీకు సగం ధరకు, అంటే పదివేలకు, అమ్మాడు. అంటే నువ్వు కొన్న ఖరీదు పదివేలే. రంగయ్య సగం ధర ఇచ్చి మేడను తిరిగి కొనుక్కుంటే నీకు అభ్యంతరం లేనట్టుగా ఇందులో సంతకం పెట్టావు. అందుకే రంగయ్య ఇప్పుడున్న మేడ ఖరీదులో సగం ధర, అంటే అయిదువేలు, ఇచ్చి మేడను తిరిగి కొనుక్కున్నాడు. ఇందులో నువ్వు కాదనేటందుకు ఏమీలేదు! ఇక నీకు ఈ ఇంటి మీద అధికారం లేదు," అన్నాడు కరణం. రంగయ్య మేడను చవకగా కొట్టేద్దామనుకున్న వీరయ్య ఎత్తు బెడిసికొట్టింది. తగిన శాస్తే జరిగిందనుకున్నాడు వీరయ్య. అతను ఈ విధంగా మరెవరినీ మోసం చెయ్యటానికి మళ్ళీ ప్రయత్నించలేదు.
Comments
Post a Comment