Telugu Chandamama Kathalu 6-10

 కొత్తదయ్యం - పాతదయ్యం

ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. పొలం పనులకూ, బండిలాగటానికీ అతని వద్ద రెండు ఎడ్లు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోయింది. దానికి బదులుగా మరొక ఎద్దును కొనుక్కురావటానికి రైతు, తన కొడుకును వెంటబెట్టుకుని ప్రయాణమయ్యాడు. దారిలో తినటానికి రైతు భార్య వాళ్ళ కోసం మూడు సజ్జరొట్టెలు కాల్చి, మూటగట్టి ఇచ్చింది. తండ్రి కొడుకులు సంతకు వెళ్లి వెతకగా, వెతకగా ఒక ఎద్దు దొరికింది. బేరం కుదుర్చుకుని ఆ ఎద్దును కొని తిరిగి వస్తూ, దారిలో ఒక దిగుడు బావి కనబడితే అక్కడ రొట్టెలు తినటానికి తండ్రి కొడుకులు మెట్లు దిగి, కాళ్ళూ, చేతులూ కడుక్కున్నారు. రైతు కొడుకు మూట విప్పి, మూడు రొట్టెలుండటం చూసి, "నాన్నా, నాకు ఆకలిగా లేదు. నీకు రెండూ, నాకు ఒకటీ!" అన్నాడు. ఆ దిగుడు బావిలో మూడు దయ్యాలు కాపరం ఉంటున్నాయి. రైతు కొడుకు అన్న మాటకు అవి హడలిపోయి, పైకి వచ్చి, "బాబ్బాబు,  మమ్మల్ని తినకండి. మీరు ఏం పనిచెబితే అది చేస్తాం!" అన్నాయి తండ్రి, కొడుకులతో. రైతు అవి దయ్యాలనీ, తమను చూసి భయపడ్డాయనీ గ్రహించి, "మా వెంట వచ్చి, మేం చెప్పిన పనులన్నీ చేస్తే, మిమ్మల్ని తినం," అన్నాడు. "మీరు ఏం చెయ్యమంటే అది చేస్తాం," అన్నాయి దయ్యాలు విధేయతగా. రైతూ, అతని కొడుకూ కొత్త ఎద్దుతో బాటూ దయ్యాలను కూడా ఇంటికి తెచ్చి, వాటిచేత అడ్డమైన చాకిరీ చేయించుకోసాగారు.

దయ్యాల సంగతి ఇలా ఉండగా, వాటిని అప్పుడప్పుడూ చూడవచ్చే దయ్యాలు, బావిలో అవి లేకపోవటం గమనించి, విచారించగా, ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి వాటిని వెంటబెట్టుకుపోయినట్టు తెలిసింది. ఆ పాతదయ్యాలను వెతుక్కుంటూ ఒక కొత్తదయ్యం రైతు ఇంటికి వచ్చి, వాటిని ఒక పశువుల కొట్టంలో చూసి, "మీరు మీ బావిని వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు ఉన్నారు?" అని అడిగింది. "మా కష్టాలు ఏమని చెప్పం? ఇద్దరు మనుషులు మేము ఉండే బావిలో దిగి, మమ్మల్ని తింటామని భయపెట్టి, మా చేత చాకిరీ చేయించుకుంటున్నారు!" అని పాతదయ్యాలు లబలబలాడాయి. "అదెంతపని? నేను ఆ మనుషులను అమాంతం చంపేస్తాను. నన్ను ఆ మూల దాక్కోనియ్యండి," అన్నది కొత్తదయ్యం. ఇంతలో రైతూ, కొడుకూ పశువుల కొట్టంలోకి వచ్చారు. తండ్రి కొత్త ఎద్దును చూసి, కొడుకుతో, "ఒరే, ఈ కొత్తదానికి వాతం చేసింది. వాతపెట్టటానికి గరిట కాల్చి ఉంచాను. దాన్ని పట్టుకురా!" అన్నాడు. దాక్కుని ఉన్న దయ్యం హడలిపోయి, పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ళ మీద పడి, "బాబోయ్, నాకు వాతలు పెట్టవద్దు. నేను కూడా పాతదయ్యాలు చేసే పనులన్నీ చేస్తాను. వాళ్ళు పొలం నుంచి పత్తి మాత్రమే తెస్తున్నారు. నేను దాన్ని ఏకిపెట్టుతాను," అన్నది. "ఆ మాట నేనే చెబుదామనుకుంటున్నాను. ఇకమీద నాకు పొలం నుంచి తెచ్చే ముడిపత్తి చాలదు. ఎకినదూది కావాలి," అన్నాడు రైతు. తరవాత పాతదయ్యాలు, కొత్త దయ్యాన్ని తిట్టుతూ ,"నీ ప్రయోజకత్వం అడుక్కుతిన్నట్టే ఉన్నది. మమ్మల్ని చెర విడిపిస్తానని ప్రగల్భాలు పలికి, ఉన్న చాకిరికి పత్తి ఏకడం పని ఒకటి కొత్తగా తెచ్చిపెట్టావు!" అన్నాయి.   

మనుషులమధ్యరాక్షసుడు


వింధ్యాటవుల్లో కామరూపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి కోరిన రూపం ధరించే శక్తి ఉండేది. వాడికి కొంత కాలానికి జీవితంపై విరక్తిపుట్టి, చచ్చిపోవాలనుకున్నాడు. కాని ఎలా చావాలో వాడికి తెలియలేదు. కొండల మీది నుంచి వాడు ఒక్క అంగలో కిందికి దిగగలడు, అందుచేత కొండల మీది నుంచి దూకి చావలేడు. సముద్రంలో పడి చద్దామంటే, సముద్రం వాడికి మోకాలి లోతు కూడా రాదు. మారురూపంలో చావటానికి ప్రయత్నించినా, ప్రమాదపరిస్థితిలో వాడికి అసలు రూపు వచ్చేస్తుంది. అందుచేత వాడికి చచ్చే మార్గం లేకపోయింది. ఒకసారి వింధ్యాటవులకు ఒక మహాతేజస్వి అయిన ఋషి వచ్చాడు. ఆయన తేజస్సు చూసి ప్రభావితుడై, కామరూపుడు మనుష్యరూపంలో ఆయనను కలుసుకుని, తన కథ  అంతా చెప్పుకున్నాడు. "రాక్షసులకు ఇవి రోజులు కావు. రాక్షసజన్మలో సుఖం లేదు. కాని నీకు ఇంకా చాలా ఆయుస్సు ఉన్నది. ఇప్పుడు నీవు చనిపోతే, ఆ ఆయుస్సు కోసం మరో జన్మ ఎత్తవలసివస్తుంది. ఏ జన్మ కావాలో కోరుకో, నీకు ఈ జన్మ నుండి విముక్తి కలిగిస్తాను," అన్నాడు ఋషి. అయితే, కామరూపుడికి ఏ జన్మ కోరుకోవాలో తెలియక, ఋషినే సలహా అడిగాడు. "అన్ని జన్మలలోకీ ఉత్తమమైనది మానవజన్మ. అదే కోరుకో," అన్నాడు ఋషి కామరూపుడితో. ఋషి మాటలలో ఎంత నిజం ఉన్నదీ తెలుసుకోవడానికై, మనుషుల మధ్య కొంతకాలం ఉంది వస్తానని కామరూపుడు బయలుదేరాడు.

వాడు మనిషి రూపంలో ఒక నగరం చేరుకున్నాడు. అక్కడ వాడు ఒక ఇంట మకాంపెట్టి, మనుషులను గమనించసాగాడు. మనుషులు నీతినియమాలు పాటిస్తూ, ఎంతో హాయిగా జీవిస్తున్నట్టు వాడికి తోచింది. ఆ నగరానికి వీరసింహుడు అనేవాడు రక్షకుడు. వీరసింహుడు నగరరక్షకుడుగా ఉండగా నగరానికి ఎవరివల్లా, ఎలాటి ప్రమాదమూ ఉండదని నగరవాసులకు గట్టి నమ్మకం. ఆ వీరసింహుడి ప్రతాపం ఎటువంటిదో  తెలుసుకోవాలని ఒకసారి కామరూపుడు అతన్ని చూడబోయాడు. వీరసింహుడు తన శక్తిసామర్థ్యాలను గురించి కామరూపుడి దగ్గిర ఎన్నో ప్రగల్భాలు పలికి, చివరకు, "విక్రమార్కుడి వంటివారు ఎందరో రాక్షసులను ధైర్యంగా ఎదిరించి, చంపారని చెబుతారు. అవకాశం దొరికితే నేను కూడా అలా చేయగలను!" అన్నాడు. కామరూపుడు వెంటనే తన అసలు రూపం ధరించి, "నా చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి, నా కాళ్లకు మొక్కితే నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను," అన్నాడు. వీరసింహుడు వణికిపోతూ, రాక్షసుడి చుట్టూ మూడుసార్లు తిరిగి, కాళ్ళ మీద పడ్డాడు.

మనుషుల ప్రతాపం ఏపాటిదో తెలుసుకుని, కామరూపుడు అక్కడినుంచి మాయమయ్యాడు. ఆ నగరంలోనే ఒక ధనికుడు ఉన్నాడు. ఆయనకు హేమాంగి అని ఒకే ఒక కూతురు. ఆమెకు పెళ్లీడు వచ్చింది. ఆమెకు పెళ్లి చేసెయ్యాలని ధనికుడు తొందరపడుతున్నాడు. కామరూపుడు అందమైన యువకుడి రూపంలో ధనికుణ్ణి చూడబోయి, హేమాంగిని పెళ్లాడతానన్నాడు. ధనికుడు అతన్ని అనేక ప్రశ్నలు వేసి, అభ్యంతరాలు చెప్పాడు. కామరూపుడు తన అసలు రూపు ధరించి, "నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా, చెయ్యవా?" అని అడిగాడు. ధనికుడు నిలువునా వణికిపోతూ, చంపవద్దని వేడుకుని, తన కూతుర్ని ఆ రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చెయ్యటానికి ఒప్పుకున్నాడు. కామరూపుడు దిక్కులు దద్దరిల్లేటట్టు నవ్వి, అక్కడనుంచి అదృశ్యమయ్యాడు. మనుషులలో ఉండే ప్రేమాభిమానాలు వాడికి తెలిసాయి. అదే నగరంలో శివానందుడు అనే మహాభక్తుడు ఉన్నాడు. ఆయన ఇంట నిత్యమూ భజనలు జరిగేవి. జనం తండోపతండాలుగా అయన ఇంటికి వెళ్లి వస్తుండేవారు. ఒకనాటి అర్ధరాత్రివేళ కామరూపుడు శివానందుడి ఇంటికి వెళ్లి, తన అసలు రూపం చూపించి, "నువ్వు రోజూ అర్చించే దేవుణ్ణి ఇప్పుడు తిట్టుతావా, తిట్టవా?" అన్నాడు. 

తన చేత అంత పాపం చేయించవద్దని శివానందుడు రాక్షసుడి కాళ్లావేళ్లా పడుతూ, బతిమాలాడు. కాని రాక్షసుడు ఒప్పుకోలేదు. శివానందుడు తన దేవుణ్ణి రాక్షసుడు ఎలా తిట్టమంటే, అలా తిట్టాడు. కామరూపుడు పెద్దగా నవ్వుకుని, అక్కడనుంచి మాయమైపోయాడు. మనుషుల భక్తి గురించి కూడా వాడికి తెలిసిపోయింది. కామరూపుడు తిన్నగా వింధ్యాటవులకు వెళ్లి, ఋషిని కలుసుకుని, "తమరు మానవజన్మ ఉత్తమమైనదని అన్నారు గాని, మనుషులు అవకాశవాదులు. వాళ్ళు సృష్టిలోని సమస్తజంతుజాలాన్ని తమ అదుపులోకి తెచ్చుకుని, నాగరికత సృష్టించుకుని, హాయిగా జీవిస్తున్నప్పటికీ వాళ్ళ జీవితమంతా బూటకం! నాటకం! వాళ్ళు కోరి ఆచరించే పనులలో కూడా వాళ్లకు నమ్మకంలేదు," అన్నాడు. "అయితే, ఏ జన్మ కోరుకుంటావు?" అని ఋషి అడిగాడు. "మానవజన్మే!" అన్నాడు కామరూపుడు. ఋషి ఆశ్చర్యపడి, కారణం అడిగాడు. "ఎంత బూటకంగా జీవిస్తున్నా ఇది మానవుల కాలం. ఎన్ని శక్తులున్నా నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. కాని మనుషులలో జీవితం మీద ఆశ ఉన్నది. వాళ్ళు చావంటే భయపడతారు. చావును దూరంగా ఉంచటానికి వాళ్ళు తమ విశ్వాసాలన్నిటినీ విసర్జించగలరు. మనిషికి జీవించటంలో ఏదో ఆకర్షణ ఉన్నది. బతికి ఉన్నంతకాలము జీవనాకాంక్ష ఉండే మానవజన్మ నాకు నచ్చింది," అన్నాడు కామరూపుడు. ఋషి మంత్రజలం చల్లగానే వాడు చచ్చిపోయి, త్వరలోనే నగరంలో ఎక్కడో మనిషిగా పుట్టాడు.

దురాశాపరులు

సుబ్బయ్య శెట్టి చిల్లరకొట్టు వ్యాపారంతో బాటు, మేకలను కూడా పెంచేవాడు. అతని భార్యకు నగల పిచ్చి, చీరల పిచ్చీనూ. ఆవిడ కోసం మేకలు అమ్మగా వచ్చిన డబ్బు మాత్రమే శెట్టి ఉపయోగించేవాడు. ఇలా ఉండగా ఏదో పండగ దగ్గిరపడింది. శెట్టి భార్యకు చీర కొనవలసి వచ్చింది. శెట్టి ఒక మేకను అమ్మటానికి పొరుగూరు సంతకు తీసుకువెళ్లాడు. అతను డబ్బు వ్యవహారాలలో ఇతరులను ఏమాత్రం నమ్మడు. సంతరోజు అనుకోకుండా పెద్దవర్షం పడడం వల్ల జనం పలచగా ఉన్నారు. క్రయవిక్రయాలు మందంగా ఉన్నాయి. శెట్టి మేకకు పదిరూకల ధర కూడా పలకలేదు. ఇరవైకి తక్కువైతే అమ్మే ఉద్దేశం లేక, చీకటిపడినదాకా మంచిబేరం కోసం ఎదురుచూసి, చివరకు మేకను తీసుకుని నిరుత్సాహంగా ఇంటికి తిరుగుప్రయాణమయాడు శెట్టి. అంతా కొండదారి. ఊరి దగ్గిర కొండ మలుపులో గుహ ఉన్నది. అందులో దయ్యాలుంటాయని చెప్పుకునేవారు. ఆ పరిసరాలకు చేరేసరికి శెట్టికి గుండె దడ పట్టుకున్నది. అసలే చీకటి గాఢాంధకారం! శెట్టి గబగబా అడుగులు వేస్తూ ఆ మలుపు తిరగబోతుండగా, "ఎవరు వారు? చీకటిపడి ఈ వైపు రావడానికి ఎంత ధైర్యం!" అన్న మాటలు భయంకరంగా వినిపించాయి. శెట్టి గజగజలాడిపోతూ, "నేను సుబ్బయ్యశెట్టిని! అమ్ముడుపోని మేకని ఇంటికి తోలుకుపోతున్నాను. ఆలస్యమయింది. ఇంకెన్నడూ చీకటిపడి ఈ ఛాయలకు రాను," అన్నాడు.


 "ఆ మేకను నా గుహలోకి తోలేసి, నీ దారిన నువుపో. మళ్ళా తెల్లవారేలోపుగా ఇక్కడికి వచ్చి దాని ఖరీదు పట్టుకుపో!" అన్న మాటలు గుహలో నుంచి వినిపించాయి. బతుకుజీవుడా అని శెట్టి తన మేకను గుహలోకి తోలేసి, గబగబా ఊరి కేసి నడిచాడు. కాని ఇంటికి వెళ్ళటానికి అతనికి ధైర్యం లేదు. డబ్బు ఏదని అతని పెళ్ళాం ప్రాణాలు తోడేస్తుంది. దయ్యం ఏమిస్తుందో, అది తీసుకుపోతేగాని ఆమె తనను ఇంట్లో అడుగుపెట్టనియ్యదు. శెట్టి తూర్పు తెల్లవారేదాకా ఎవరి వీధి అరుగుమీదనో కాలక్షేపం చేసి, కాస్త ధైర్యం తెచ్చుకుని, కాళ్ళీడ్చుకుంటూ మళ్ళా గుహకేసి వచ్చాడు. "మేక బాగా కొవ్వి, చాలా రుచిగా ఉన్నది! ఇదుగో దాని ఖరీదు!" అన్న మాటలతోబాటు గుహలో నుంచి ఒక మూట వచ్చి శెట్టి కాళ్ళ ముందు పడింది. దాన్ని తీసుకుని పరుగులాటి నడకతో ఇల్లు చేరాడు, శెట్టి. శెట్టి లోపలికి పోతూనే తలుపు మూసి, సంచిలో డబ్బంతా నేల మీద పోసి, లెక్క చూశాడు. యాభైరూకలు! "ఆ డొక్కు మేకకు ఇంత డబ్బు పోసిన వెర్రిపీనుగు ఎవరబ్బా!" అంటూ శెట్టి భార్య బుగ్గలు నొక్కుకున్నది. "ఈ సంగతి ఎవరికీ చెప్పకుసుమా!" అంటూ శెట్టి జరిగినదంతా తన భార్యకు చెప్పేశాడు. శెట్టి భార్య కూడా, "ఎవరికీ చెప్పకు సుమా!" అంటూ ఈ విషయం పొరుగింటి పుల్లమ్మకు చెప్పింది. అది పుల్లమ్మ మొగుడికి, ఎదురింటి వాడికీ, వెనకింటి వాళ్లకూ, చివరకు ఊరందరికీ తెలిసిపోయింది. మేకలున్న వారందరికీ పరమానందమయింది. మేకలు లేని వాళ్ళు కొందరు హెచ్చుధర ఇచ్చి మేకలను కొన్నారు.

చీకటి పడేసరికి ఒకరికి తెలియకుండా ఒకరు దయ్యపుగుహలోకి తమ మేకలన్నీ తోలేసి, వచ్చేశారు. తన భార్య బాధపడలేక, శెట్టి కూడా మరో పదిమేకలను గుహలోకి తోలి ఇంటికి వచ్చాడు. తూర్పు తెల్లవారుతుండగా పాతికమంది జనం గుహ బయట పోగుపడ్డారు. కాని ఎవరికీ మేకల ఖరీదు అందలేదు. కనీసం దయ్యం కంఠమైనా వారికి వినిపించలేదు. తెల్లగా తెల్లవారిపోయింది. అందరూ ధైర్యం చేసి గుహలోకి వెళ్లారు. గుహలో ఒక్కమేక కూడా లేదు. కాని గుహ మధ్య బండ  మీద ఒక కాగితం ఉన్నది. దాని మీద చిన్నరాయి బరువుపెట్టి ఉన్నది. ఆ కాగితం మీద ఇలా రాసి ఉన్నది: " ఈ ఉత్తరం రాస్తున్నది దయ్యం కాదు, మీలాటి మనిషే! పని కోసం మాసం రోజులుగా మీ చుట్టూ తిరిగిన శేషయ్యను నేను! మా నాన్న పోయాడు. ఇంట్లో ఉన్నదంతా కలిసి వందరూకలు. అవి తీసుకుని నేను మీ ఊరు వచ్చి మిమ్మల్ని పని అడిగితే, "కొత్తవాడివి, నిన్ను నమ్మి పని ఎలా ఇస్తాం?" అన్నారు. ఉన్న డబ్బు సగం ఖర్చయింది. ఇంకో ఊరు పోదామని సాయంకాలం ఈ దయ్యం గుహలో పడుకున్నాను. మేకను తోలుకు వస్తున్న శెట్టిని చూశాక నాకీ ఊహ కలిగింది. మనిషిని నమ్మలేని మీరు దయ్యాన్ని నమ్మారు! లేని దయ్యం నాకు ఎంతో మేలు చేసింది. పని చేస్తానని వచ్చినవాడికి పైసా కూడా విడవని మీరు, తేరగా డబ్బు వస్తుందనగానే, కట్టకట్టుకు వచ్చి పడ్డారు. మీ మేకల్ని అమ్మిన డబ్బుతో ఎక్కడైనా వ్యాపారం ప్రారంభించి ఏడాది లోపల మీ ఋణం తీర్చేస్తానన్న నమ్మకం నాకున్నది. అంతదాకా ఓపిక పట్టండి." ఈ ఉత్తరం చదివించుకుని విన్నవాళ్లంతా నోళ్లు వెళ్ళబెట్టారు.

బ్రతుకుతెరువు

ఒక నగరంలో ఒక విద్యావంతుడు ఉండేవాడు. అతను గర్భదరిద్రుడు. అందుచేత అతను ఎలాగైనా రాజుగారి కొలువులో చిన్న ఉద్యోగం సంపాదించటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే అతనికి రాజదర్శనం కాలేదు సరికదా, రాజుగారి దివాణంలో పనిచేసే ఉద్యోగుల ఆశ్రయం కూడా దొరకలేదు. కాని తాను ఎలాగైనా బతకాలి. కూటి కొరకు కోటివిద్యలన్నారు. ఆ కోటిలో ఏదో ఒకటి ఎన్నుకుంటే తప్ప అతనికి పొట్టగడవదు. ఒకరోజు అతను ఊరికి దూరంగానూ, అడవికి దగ్గరగానూ రెండు గోరీలు ఉండటం గమనించాడు. వాటి చుట్టూ పుట్టలూ, పొదలూ పెరిగి ఉన్నాయి. ఆ గోరీలను చూడగానే విద్యావంతుడికి ఒక ఆలోచన వచ్చింది. అతను శ్రమపడి గోరీల చుట్టూ పెరిగి ఉన్న పొదలను కొట్టేసి, చుట్టూ ఉన్న ప్రదేశం చదునుచేసి, ముగ్గులు పెట్టి, గోరీల మీద తులసి మొక్కలు తెచ్చిపెట్టి, గోరీలను రోజూ పూలతో అలంకరించి, పూజిస్తూ రాసాగాడు. ఊరి ప్రజలు ఊరి బయట దేవాలయానికి వచ్చినప్పుడూ, అరణ్యమార్గాన పొరుగూరికి పోయేటప్పుడూ  ఈ గోరీలను చూసి, ఆశ్చర్యపడి ఆగి, అక్కడే కుటీరం వేసుకుని నివసిస్తున్న విద్యావంతుణ్ణి అడిగారు. "ఇవి రాజుగారి పూర్వీకుల గోరీలు, శిథిలావస్థలో ఉండిన వీటిని చూసి, రాజవంశం మీది గౌరవం కొద్దీ వీటిని పునరుద్ధరించి, వీటి పోషణ చూస్తున్నాను. వీటికి పూజాపునస్కారాలు చేస్తున్నాను." అన్నాడు విద్యావంతుడు.

అతని మాటలు ప్రజలు నమ్మారు. ఎందుకంటే  గోరీలు చక్కగా వెల్లవేసి ఉన్నాయి. వాటిమీద తులసిమొక్కలూ, దీపారాధనా ఉన్నాయి. అవి నిజంగా రాజవంశం వారివి కాకపోతే ఈ మనిషి వాటిపట్ల అంత భక్తిశ్రద్ధలు ఎందుకు చూపుతాడు? ఊరి ప్రజలు కూడా ఆ గోరీల పట్ల శ్రద్ధాసక్తులు కనబరచి, దేవాలయానికి వచ్చినట్టుగా వచ్చి, గోరీల దీపారాధనకు చేతనైనంతలో నూనె, డబ్బులూ ఇయ్యసాగారు. వారిలో కొందరు భక్తితో గోరీలకు ప్రదక్షిణలు చేసి, కోరికలు కోరసాగారు. గోరీలకు మొక్కుకుని, ప్రదక్షిణలు చేసినవారి కోరికలు తీరుతున్నాయని విద్యావంతుడు వచ్చే జనంలో చల్లగా ప్రచారం చేశాడు. త్వరలోనే ఆ గోరీలు గొప్ప యాత్రాస్థలం అయ్యాయి. ఈ సమాచారం క్రమంగా రాజుగారి దాకా వెళ్ళింది. ఆ గోరీలు నిజంగా రాజవంశానికి చెందినవో, కావో, రాజవంశానికి చెందినవే అయితే ఇంతకాలమూ ఎలా మరుగునపడిపోయాయో విచారించి తెలియపరచమని రాజుగారు మంత్రికి ఉత్తరువు ఇచ్చాడు. మంత్రిగారు గోరీలను పరిశీలించి రమ్మని పరిశోధకులను పంపాడు. వాళ్ళు వచ్చి గోరీల మీద రెండు పేర్లు చెక్కి ఉన్న సంగతి తెలుసుకున్నారు. అవిగాక అక్కడక్కడ ఏవో చిహ్నాలు కూడా చెక్కి ఉన్నాయి. ఆ వివరాల వల్ల వెంటనే ఏమీ తేలలేదు. రాజుగారు తమ వంశవృక్షం వివరాలు తెప్పించి పరిశీలింపజేసాడు. పధ్నాలుగు తరాల క్రితం ఆ గోరీల మీద పేర్లు గల భార్యాభర్తలు దేశాన్ని పాలించినట్టు స్పష్టమయింది. గోరీల మీద ఉండిన చిహ్నాలు కూడా ఆనాటి రాజవంశపు చిహ్నాలే!

"మన వంశప్రతిష్ఠను తన స్వశక్తితో పునరుద్ధరించిన ఆ మనిషికి ఏమిచ్చినా మన ఋణం తీరదు," అని రాజు విద్యావంతుణ్ణి తన వద్దకు పిలిపించి, "ఆ గోరీలు రాజవంశానివని ఏ ఆధారంతో కనిపెట్టగలిగావు?" అని ఆసక్తిగా అడిగాడు. "మహారాజా, నేనేమీ కనిపెట్టలేదు. మరోవిధంగా తమ దర్శనం లభించక, కంటపడిన గోరీలను బ్రతుకుతెరువుగా ఉపయోగించుకున్నాను. నా ఈ మోసం తమదాకా వస్తుందనుకోలేదు. నన్ను మన్నించండి. నా మోసం ప్రజలకు చెప్పుకుని, మరొక బ్రతుకుతెరువు చూసుకుంటాను! గర్భదరిద్రుణ్ణి. నాకు విద్య అయితే అబ్బిందిగాని ఎంత ప్రయత్నించినా  ధనం అబ్బింది కాదు!" అన్నాడు విద్యావంతుడు. "నువ్వు ఎవరినీ మోసగించలేదు. అవి రాజవంశపు గోరీలే. మధ్యకాలంలో రాజవంశంలో దీర్ఘకాలపు కలతలు సాగి, ఆ గోరీల విషయం పూర్తిగా మరుగున పడిపోయింది. తెలిసో తెలియకో నువ్వు వాటిని ఉద్ధరించి, మాకు చాలా మేలు చేశావు. నీకు అసలు రాజదర్శనం ఎందుకు కావలసివచ్చిందీ?" అని రాజు అడిగాడు. "చెప్పానుగదా, మహారాజా? పేదవాడిని. నేను చదువుకున్న చదువు నాకు తమ కొలువులో చిన్నపాటి ఉద్యోగం ఇప్పిస్తుందేమోనని ఎంతగానో ఆశపడ్డాను. నా ఆశ తీరలేదు." అన్నాడు విద్యావంతుడు. "నీ ఆశ తప్పక తీరుతుంది. నీకు నా కొలువులో మంచి జీతంతో ఉద్యోగంతో బాటు మాన్యం కూడా ఇప్పిస్తాను," అన్నాడు రాజు. ఆ విధంగా, కాకతాళీయంగా, ఆ విద్యావంతుడు తన ఉదరపోషణ చూసుకునే ప్రయత్నంలో రాజవంశానికి గొప్ప మేలుచేసి, రాజాదరణకు పాత్రుడై ప్రసిద్ధికి వచ్చాడు.

నాలుగో దొంగ

ఒక దేశంలో ముగ్గురు గజదొంగలుండేవారు. వారు రోజుకొక దొంగతనం చేసినా వారిని పట్టటం ఎవరికీ సాధ్యంకాలేదు. వాళ్ళ పేరు చెబితే ధనికులకు  సింహస్వప్నంగా ఉండేది. వాళ్ళను ఏ విధంగానైనా పట్టాలనే ఉద్దేశంతో ఆ దేశపు రాజు ప్రతి రాత్రీ తాను కూడా ఒక దొంగ లాగా వేషంవేసుకుని, నగరం నాలుగు మూలలూ తిరగసాగాడు. ఈ విధంగా కొన్ని రాత్రులు తిరగగా, తిరగగా ఒక చీకటిరాత్రి రాజుకు దొంగలుండే స్థలం చిక్కింది. రాజు అక్కడికి చేరుకునేసరికి ఆ దొంగలు ఆ రాత్రి తాము చేయదలచిన దొంగతనం గురించి ఆలోచిస్తున్నారు. కొత్త దొంగను చూడగానే గజదొంగలకు కొంత అనుమానం కలిగింది. వాళ్ళు రాజుకేసి కోపంగా చూస్తూ, "ఎవరు నీవు? ఇక్కడికి ఏం పనిమీద వచ్చావు?" అని అడిగారు. "నేనూ దొంగనే. ఈ ప్రాంతాల మీరు గొప్ప దొంగలని విని మీకు నా శక్తి ఎలాంటిదో చూపించవచ్చాను," అన్నాడు రాజు. దొంగలు నవ్వి, "మా శక్తులను గురించి నీకేమైనా తెలుసా?" అని అడిగారు. "తెలియదు. నేను యీ ప్రాంతాలకు కొత్తవాణ్ణిగదా, చెప్పండి, వింటాను!" అన్నాడు రాజు. "నేను ఎంత లావు తాళాన్నైనా పూచికపుడకతో తీయగలను," అన్నాడు మొదటి దొంగ. "నేను భూమికి చెవి పెట్టి ఆలకించానంటే డబ్బు ఎక్కడ ఉన్నదీ పసికట్టగలను," అన్నాడు రెండో దొంగ.

"ఒకసారి చూసిన మనిషిని నేను ఏ మారువేషంలో ఉన్నా పోల్చుకోగలను," అన్నాడు మూడో దొంగ. "మా శక్తుల సంగతి చెప్పాం. నీకుగల శక్తి ఏమిటి?" అని ముగ్గురు దొంగలూ రాజునూ అడిగారు. ఏం చెప్పాలో రాజుకు తోచలేదు. అందుచేత ఆయన ఈ విధంగా అన్నాడు: "నేను బొటన వేలు కిందికి దించానంటే ఎవరినైనా యమలోకానికి పంపగలను. చూపుడువేలు పైకి ఎత్తానంటే చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్లు కూడా బతికి బయటపడతారు." ఈ మాట విని ముగ్గురు దొంగలూ సంతోషించారు. తమ అంత శక్తిసామర్థ్యాలు కలవాడూ, తెలివైనవాడూ తోడు వచ్చాడనుకున్నారు. "ఈ రాత్రి ఎక్కడికి దొంగతనానికి పోదాం?" అని అడిగాడు రాజు. "నీ యిష్టం! నువ్వు కోరుకున్నచోటికి పోదాం. మా శక్తిసామర్థ్యాలు స్వయంగా చూతువుగాని!" అన్నాడు రాజు. నలుగురూ కలసి రాజప్రాసాదానికి బయలుదేరారు. పహారావాళ్ళ కంటపడకుండా లోపలికి చేరారు. రెండో దొంగ నెలకు చెవిపెట్టి ఆలకించి, "ఖజానా ఈ వైపుగా వుంది, జాగ్రత్తగా నడవండి!" అని చెప్పాడు.

నలుగురూ అటుకేసి వెళ్లారు. ఖజానాకు పెద్దతాళం వేసివుంది. కాని దాన్ని మొదటి దొంగ క్షణంలో ఊడదీశాడు. దొంగలు లోపల ప్రవేశించారు. ఈ సమయంలో రాజు వాళ్లకు తెలియకుండా వెళ్ళిపోయి తన భటులను పంపాడు. గజదొంగలు ముగ్గురూ సొత్తుతో సహా పట్టుబడ్డారు. మర్నాడు వారిని విచారణకు దర్బారుకు తెచ్చారు. సింహాసనం మీద కూర్చున్న రాజును చూస్తూనే మూడో దొంగ తోటివాళ్లతో, "ఈయనే నిన్న మనతో దొంగతనానికి వచ్చిన కొత్త మనిషి!" అని చెప్పాడు. విచారణ అంతా అయిపోగానే రాజు తన కుడిచేతి బొటనవేలు కిందికి తిప్పాడు. గజదొంగలకు మరణశిక్ష విధించబడింది. మర్నాడు ఉదయం వారిని ఉరికంబం వద్దకు తీసుకుపోయారు. అధికారి, "చెప్పండి! మీ ఆఖరు కోరిక ఏమిటి?" అని దొంగలను అడిగాడు.  "రాజుగారిని ఒక ప్రశ్న అడగాలి. అదే మా ఆఖరు కోరిక!" అన్నారు దొంగలు. అధికారి యీ సంగతి చెప్పగానే రాజుగారు వచ్చారు. "మీరు నన్నడగగోరే ప్రశ్న ఏమిటి?" అన్నాడాయన. "మరేంలేదు, మహాప్రభూ! మా శక్తులు మీకు ప్రదర్శించాం. మీ శక్తులను గురించి మాకు రెండు విషయాలు చెప్పారు. అందులో ఒకటే ప్రదర్శించారు. రెండవది కూడా చూసి సంతోషించాలని మా కోరిక!" అన్నాడు మూడో దొంగ. రాజు చిరునవ్వు నవ్వి తన చూపుడు వేలు పైకెత్తాడు. వెంటనే రాజభటులు వచ్చి గజదొంగల కట్లు విప్పేసి, ఉరికంబం నుంచి దించేశారు. తరువాత ఆ గజదొంగలు దొంగతనాలు చేయటం మాని రాజు దగ్గిరే కొలువుంటూ, రాజుగారి పట్ల ఎంతో భక్తిగా కాలం గడిపారు.


Comments