Telugu Chandamama Kathalu 16-20

పోలికలు  


"వెళ్లిన పని ఏమయింది?" అని భర్తకు మంచినీళ్లు అందిస్తూ పార్వతమ్మ అడిగింది. రాజేశం మంచినీళ్లు తాగి, "వాళ్లకు మన రాగిణి నచ్చింది. అయితే, పదివేలు కట్నం కావాలని పట్టుబట్టుతున్నారు," అన్నాడు. ఈ మాట విని పార్వతమ్మ నోరు వెళ్లబెట్టింది. వాళ్లకు రాగిణి ఒకతే సంతానం. పెద్ద అందగత్తె కాదు, సర్వసాధారణంగా ఉంటుంది. రాగిణి పుట్టిననాటినుంచీ రాజేశం ఆమె పెళ్లి కోసం కూడబెట్టుతూ వచ్చినదంతా కలిపి అయిదువేలు. రాగిణికి రెండు, మూడు సంబంధాలు చూశారు. కానీ వారికి పిల్ల అంతగా నచ్చలేదు. ఇప్పుడు చూసిన సంబంధానికి పిల్ల నచ్చింది గాని, ఇచ్చుకోలేనంత కట్నం అడుగుతున్నారు! రాగిణి అక్కడే ఉండి, తల్లిదండ్రుల సంభాషణ విని, "కట్నం కోసమే పెళ్లి చేసుకునే మనిషి నాకు అక్కర్లేదు," అన్నది కోపంగా. "నువ్వు నోరుమూసుకుని అవతలికి పో!" అని కూతుర్ని కసిరింది పార్వతమ్మ. తరువాత ఆమె తన భర్తతో, "వీళ్లకు పిల్ల నచ్చింది. మనం డబ్బు కోసం చూస్తే ఈ సంబంధం కాస్తా తప్పిపోతోంది. ఇక దానికి ఈ జన్మలో పెళ్లి కాదు," అన్నది. "అలా అని నన్ను ఏం చేయమన్నావు? ఏ ఇంటికైనా కన్నం వెయ్యనా?" అన్నాడు రాజేశం చిరాకుగా. ఇద్దరూ చాలాసేపు తర్జనభర్జనలు జరిపారు. కానీ మరో అయిదువేలు ఎక్కడ నుంచి తేవాలో తేల్చుకోలేకపోయారు.

ఈ లోపల బాగా చీకటిపడిపోయింది. ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టారు. రాజేశం వెళ్లి తలుపు తీసి చూస్తే, బయట ఎవరో కొత్త మనిషి నిలబడి ఉండి, "సుబ్బయ్యశ్రేష్ఠి ఈ పెట్టెను మీకు ఇయ్యమన్నాడు. ప్రస్తుతం ఎనిమిదివేల రూపాయల నగలే పంపుతున్నాడట. శ్రేష్ఠికి ఏమైనా చెప్పమన్నారా?" అంటూ ఒక పెట్టె అందించాడు. రాజేశానికి అంతా అయోమయంగా ఉన్నది. సుబ్బయ్యశ్రేష్ఠిని అతను ఎరగడు. "ఏ సుబ్బయ్యశ్రేష్ఠి దీన్ని పంపించాడు?" అని అతను కొత్త మనిషిని అడిగాడు. కొత్త మనిషికి రాజేశం మాటలతో అనుమానం వచ్చినట్టు కనబడింది. అతను ఒకసారి ఇంటి ముందున్న రావిచెట్టును చూసి, "రావిచెట్టు ముందున్న ఇంట్లో నారాయణకు ఇచ్చి రమ్మన్నాడు. ఇంతకూ మీరు నారాయణ కారా?" అని అడిగాడు. రాజేశం నోరు తెరిచేలోపల, అతని వెనకనే ఉన్న పార్వతమ్మ కల్పించుకుని, "నువ్వు రావలసిన ఇంటికే వచ్చావు బాబూ, నిజానికి సుబ్బయ్యశ్రేష్ఠి నిన్ననే నగలు పంపించి ఉండవలసింది! ఆలస్యం ఎందుకు అయిందో కనుక్కో!" అన్నది తెలివిగా. అలాగే అని చెప్పి, ఆ మనిషి వెళ్ళిపోయాడు. రాజేశం చప్పున తలుపుమూసి, పెట్టె తెరిచాడు. పెట్టెలో కళ్ళు మిరిమిట్లు గొలిపే నగలు ఉన్నాయి. "ఎనిమిదివేలు ఖరీదు చేసే నగలు! అమ్మాయి పెళ్లి అయిపోయినట్టే!" అని ఆనందంగా అన్నది పార్వతమ్మ. "నగలు ఎవరివో? నా పెళ్లి ఎలా జరుగుతుంది?" అన్నది రాగిణి గుమ్మంలో నిలబడి అంతా చూస్తూ. "నువ్వు నోరుమూసుకుని అవతలికి పో!" అని కసురుకుని, కూతుర్ని లోపలికి పంపించేసింది  పార్వతమ్మ.

"దేవుడు మనని కనికరించి, కూతురి పెళ్లి చేసుకోమని, ఈ నగలు పంపాడు. రెండురోజుల్లో వీటిని కరిగించి అమ్మేస్తాను," అన్నాడు రాజేశం. "దేవుడు అవకాశమైతే ఇచ్చాడు గాని దాన్ని మనం ఉపయోగించుకోవద్దూ? తెల్లవారేసరికి సుబ్బయశ్రేష్ఠికి ఆ నగలు అందవలసిన చోట అందలేదని తెలిసిపోతుంది. రేపు ఆ మనిషి వచ్చి అడుగుతాడు! అప్పుడు ఏం చేద్దాం?" అన్నది పార్వతమ్మ. "నిజమే! ఒక పనిచేద్దాం. నేను నగలపెట్టె పెరట్లో పాతిపెట్టుతాను. ఎవరైనా వచ్చి అడిగితే మాకేమీ తెలియదని చెబుదాం. వాడు నగలపెట్టె తెచ్చి మనకియ్యడం ఎవరు చూశారు గనక!" అన్నాడు రాజేశం. తరవాత భార్యాభర్తలు నగలపెట్టెను తీసుకుపోయి, పెరట్లో కొబ్బరిచెట్టు కింద పూడ్చిపెట్టారు. తెల్లవారి ఎవరో వచ్చి కేకలు పెట్టసాగారు. భార్యాభర్తలు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని, ముందుగదిలోకి వచ్చారు. క్రితం రాత్రి నగలపెట్టె తెచ్చిన మనిషి గుమ్మంలో నిలబడి ఉండి, ఎంతో ఆందోళనపడే ముఖంతో, "ఎంత మోసం! ఎంత దగా! నారాయణ పేరు చెప్పి నగలపెట్టె తీసుకుంటారా? అది పక్కవీధి నారాయణది! శ్రేష్ఠి నా పీక మీద కూర్చున్నాడు! మర్యాదగా నగలపెట్టె ఇచ్చేయండి!" అన్నాడు. "పొద్దున్నే తాగి వచ్చి, ఏమిటీ రచ్చ?" అన్నాడు రాజేశం నిబ్బరంగా. "పిచ్చివాడేమో? తలుపు మూసేసి రండి!" అన్నది పార్వతమ్మ. ఆ మనిషి రెచ్చిపోయి గొంతు హెచ్చించాడు. రాజేశం అతన్ని లక్ష్యపెట్టకుండా, "నువ్వు చీకట్లో ఆ నగల పెట్టె ఎవరి ఇంట్లో ఇచ్చావో! మాకేమీ తెలియదు. శుభమా అని మా అమ్మాయి పెళ్లి పనులు ప్రారంభించబోతూ ఉంటే, తెల్లవారకుండగానే ఇదేం గొడవ!" అన్నాడు.  

పార్వతమ్మ అతనికి వంత పలికింది. "మీకు ఇక ఆ శ్రమ తప్పింది! ఈ పెళ్లి జరగదు," అంటూ స్తంభం చాటు నుంచి పెళ్ళికొడుకు తండ్రి ఇవతలకు వచ్చాడు. అతన్ని చూసి భార్యాభర్తలు తెల్లబోయారు. ఆయన ఇలా అన్నాడు: "మాకు కట్నం దమ్మిడీ కూడా అవసరం లేదు. మాకు కావలసినది కుటుంబగౌరవమూ, సంప్రదాయమూనూ! మీ గుణగణాలు, నైజము తెలుసుకోవాలనే అంత కట్నం కోరి, నగలతో నాటకం ఆడించాను. మీ అసలు బుద్ధి తెలిసిపోయింది. మీరు డబ్బు కోసం గడ్డి తినే రకం! మీ పిల్లకు మీ పోలికలే వస్తాయి. అటువంటి అమ్మాయిని మేం చేసుకోము." అకస్మాత్తుగా రాగిణి బయటనుంచి లోపలికి వచ్చి , "ఆపండి! మీ వాదనకు అర్థంలేదు. తల్లిదండ్రుల ముక్కూ, ముఖమూ పిల్లలకు వస్తాయేమోగాని, బుద్ధులు రానవసరంలేదు. మా వాళ్ళు నిద్రలేస్తే వీలుపడదని, చీకటితోనే లేచి, నగలపెట్టెను రక్షకభటులకు అప్పగించి వస్తున్నాను. మీ నగలపెట్టెను వారి నుండి తీసుకోండి. ఈ పెళ్లి జరగకపోతే మాకు జరిగే నష్టం ఏమీ లేదు," అంటూ గబగబా లోపలికి వెళ్ళిపోయింది. రాజేశం, పార్వతమ్మ నోరు మెదపలేకపోయారు. పెళ్ళికొడుకు తండ్రి తలవంచుకుని వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం రాగిణి మొక్కలకు నీరు పోస్తుండగా పెళ్ళికొడుకు అక్కడికి వచ్చి, "మా నాన్న ఇలా నాటకం ఆడిన సంగతి నాకు తెలియదు. మీకు జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. నువ్వు క్షమించగలిగితే, నిన్ను పెళ్లాడటానికి నేను ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాను." అన్నాడు. రాగిణి ఏమీ చెప్పకుండా, సిగ్గుతో తల వంచుకున్నది. వారి పెళ్లి ఘనంగా జరిగి సంతోషంగా జీవించారు.

నేర పరిశోధన 

శ్రావస్తి నగరాన్ని ప్రసేనజిత్తు పరిపాలించే కాలంలో దూరదేశం నుంచి ఒంటరిగాడైన బ్రాహ్మణుడొకడు వచ్చాడు. అదృష్టవశాత్తు నగరంలోని గొప్ప వైశ్యుల ప్రాపకం ఆ బ్రాహ్మణుడికి దొరికింది. నిత్యమూ ఆయనకు అన్నవస్త్రాలు పుష్కలంగా దొరకటమే గాక దానాలు, దక్షిణాలూ, సంభావనలూ దొరుకుతుండేవి. ఒంటరివాడు కావటంచేత ఆయన ఇలా దొరికిన సొమ్మును కొద్దికాలంలోనే వెయ్యి బంగారు దీనారాలుగా నిలవచేసి, దాన్ని మరొకవిధంగా భద్రపరచలేక, అడివిలో ఒకచోట పాతిపెట్టేశాడు. భార్యాబిడ్డలూ, అన్నదమ్ములూ, బంధువులూ, ఎవరూ లేని బ్రాహ్మణుడి పంచప్రాణాలూ ఆ బంగారం మీదే ఉండేవి. రోజూ ఆయన అడివికి పోయి, తాను పాతిపెట్టిన ధనం ఎవరూ తవ్వుకు పోలేదు గదా అని చూసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండేవాడు. ఒకరోజు ఇలాగే ఆయన అడవికి పోయి చూసేసరికి అక్కడ బంగారం లేదు. అంతకుముందే దాని నెవరో తవ్వి తీసుకున్నారు. ఇది తెలుసుకుని బ్రాహ్మణుడు పిచ్చెత్తిపోయి, గుండెలు బాదుకుని ఏడుస్తూ నగరంలో వచ్చిపడ్డాడు. కనిపించిన వారికల్లా తనకు కలిగిన ఆపదను గురించి చెప్పుకున్నాడు. ఆయనను ఓదార్చటం ఎలాగో ఎవరికీ తెలియలేదు. "నా డబ్బే పోయాక నేను జీవించటం మాత్రం దేనికి? నది దగ్గరకు వెళ్లి అందులో పడి ఆత్మహత్య చేసుకుంటాను." అంటూ బ్రాహ్మణుడు నదికేసి పరిగెత్తాడు. 

అప్పుడే నదిలో స్నానంచేసి తిరిగివచ్చే రాజు ప్రసేనజిత్తు ఆత్మహత్య చేసుకోబోయే బ్రాహ్మణుణ్ణి చూసి, విషయం తెలుసుకుని, "ఎందుకయ్యా పిచ్చి వాడిలాగా ఆత్మహత్య చేసుకుంటావు? రాజ్యంలో దొంగతనం జరిగితే తెలుసుకునేటందుకు నేను లేనా? నీ సొత్తు అపహరించినవాణ్ణి పట్టుకుంటాను. లేదా, నీ సొమ్ము నా బొక్కసం నుంచి ఇప్పిస్తాను. డబ్బు పాతిపెట్టిన చోటుకు గుర్తులేమైనా ఉన్నాయా?" అని అడిగాడు. "మహాప్రభూ! నేను ధనం పాతిపెట్టిన చోట అడివిబీర మొక్క ఒకటి గుర్తుండేది, ఇప్పుడదికూడా పోయింది." అన్నాడు బ్రాహ్మణుడు. "అడివిబీరమొక్క ఎలా గుర్తవుతుంది. అవి ఎన్నయినా ఉండవచ్చు గదా?" అన్నాడు రాజు. "లేదు, మహాప్రభూ! ఆ ప్రాంతంలో అదొక్కటే అడివిబీరమొక్క," అన్నాడు బ్రాహ్మణుడు. "అయితే, నువ్వక్కడ సొమ్ము దాచిన సంగతి ఎవరెవరికి తెలుసు?" అని అడిగాడు రాజు. "మహాప్రభూ, నాకు తప్ప మరొక పిట్టకు తెలీదు. నేనక్కడికి పోవటం ఎన్నడూ ఎవరూ చూసివుండలేదు," అన్నాడు బ్రాహ్మణుడు. రాజు తన భవనానికి తిరిగివచ్చి ఆ దొంగతనం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు. దొంగను పట్టుకునే ఉపాయం రాజుకు కొద్దిసేపట్లోనే స్ఫురించింది. 

ఆయన మంత్రిని పిలిపించి: "మంత్రీ, నాకు ఆరోగ్యం సరిగాలేదు. వెంటనే వైద్యులను చూడటం మంచిదనుకుంటున్నాను. నగరంలో ఉన్న వైద్యులనందరినీ పిలిపించండి," అన్నాడు. త్వరలోనే వైద్యులంతా వచ్చారు. రాజు ఒక్కొక్కరినే తన సన్నిధికి రప్పించి, "ఏమయ్యా, నువ్వు నిన్నా, ఇవాళా ఏయే రోగాలకు ఔషధం ఇచ్చావు? ఏయే మూలికలు వాడావు?" అని ప్రశ్నించి, వారు చెప్పినదంతా విని పంపివేయసాగాడు. అదంతా చూస్తున్న మంత్రికి రాజు అభిప్రాయం కొంచెమైనా అర్థం కాలేదు. ఆఖరుకు ఒక వైద్యుడు, "మహాప్రభూ, మాతృదత్తుడనే వైశ్యశిఖామణికి అడవి బీరమొక్క రసం నిన్న వాడాను." అన్నాడు. రాజు ఆసక్తితో, "అలాగా? ఆ మొక్క ఎక్కడ దొరికింది?" అన్నాడు. "అడవిలో కష్టపడివెతికి నా సేవకుడు పట్టుకొచ్చాడు, మహారాజా," అన్నాడు వైద్యుడు. "అయితే ఆ సేవకుణ్ణి మా వద్దకు వెంటనే పంపించు," అన్నాడు రాజు. వైద్యుడి సేవకుడు రాగానే రాజు, "ఒరే, నిన్న నువ్వు అడివిబీరమొక్కను తవ్వినప్పుడు దాని కింద దొరికిన వెయ్యి దీనారాలు ఏం చేశావు?" అన్నాడు. సేవకుడు తెల్లబోయి , "మా యింట దాచాను, మహారాజా!" అన్నాడు.

"అవి ఫలానా బ్రాహ్మణుడివి. అతడికి వప్పగించు, వెళ్ళు," అన్నాడు రాజు. చిత్తమంటూ సేవకుడు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇదంతా పరికిస్తున్న మంత్రికి రాజే విధంగా ఆ బంగారం ఎత్తుకుపోయిన వాణ్ణి గుర్తించాడో అర్థంకాలేదు. రాజునే అడిగి ఆ రహస్యం తెలుసుకోదలిచాడు. "మహారాజా, మీరీ దొంగతనాన్ని ఇంత సులువుగా ఎలా పట్టగలిగారో నాకర్థంకాలేదు," అన్నాడు మంత్రి. రాజు నవ్వి ఇలా వివరించాడు: "దొంగతనం గురించి బ్రాహ్మణుడు చెప్పినదంతా నిజమనే నమ్మకంతోటే నేను దొంగను పట్టటానికి ఆలోచించాను. నగరంలోని ఇన్ని లక్షలమందిలో ఒక్కడే ఆ దొంగతనం చేసి వుండాలి గద! అక్కడ ధనం ఉన్న సంగతి ఎవరికీ తెలియదని బ్రాహ్మణుడు చెబుతున్నాడు. ఆ ప్రత్యేక స్థలంలో ధనం ఉన్నదని తెలియకుండా అక్కడ తవ్వవలిసిన అవసరం ఎవరికి కలుగుతుంది? అడివిబీరమొక్కతో పని ఉన్నవాడికి. ఆ చుట్టుపక్కల ఎక్కడా అడవి బీరమొక్క లేదు. ఆ సంగతి బంగారం పోగొట్టుకున్న బ్రాహ్మణుడే చెబుతున్నాడు. అది నిజమేనని నాకు నమ్మకం కలిగింది. అదీగాక, ధనం కోసమే తవ్విన వాడెవడైనా అడివిబీరమొక్కను అక్కడే పారేసిపోతాడు. అడివిబీరమొక్క కోసం తవ్వినవాడైతేనే మొక్కనూ, ధనాన్నీ కూడా తన వెంట తీసుకుపోవటం జరుగుతుంది. అయితే అడివిబీరమొక్కతో ఎవరికి పని ఉంటుంది? వైద్యుడికి ! అందుచేతనే వైద్యులందరినీ పిలిపించాను. అడివిబీరమొక్కతో వైద్యం చేసిన వైద్యుడు దొరకగానే దొంగ కూడా దొరికిపోయాడు. ఇందులో కష్టం ఏమిటి మంత్రీ?" ఈ మాటలను విని ప్రసేనజిత్తు తెలివితేటలకు మంత్రి చాలా సంతోషించాడు.

తల్లిలేనివాడు 

రంగడు తల్లి చెప్పినమాట బొత్తిగా వినేవాడు కాదు. అల్లరిచిల్లరగా తిరుగుతూ, ఆకతాయిపనులు చేస్తూ, డబ్బు దుబారా చేసేవాడు. వాడి భవిష్యత్తు గురించి తల్లి బెంగపడేది. ఒకసారి రంగడు ఎవరో పెద్దమనిషితో గొడవపెట్టుకుని, దురుసుగా మాట్లాడాడు. ఆయన రంగణ్ణి తన్నడానికి సిద్ధంకాగా, వాడి తల్లి వెళ్లి, ఆయన కాళ్ళా, వేళ్ళాపడి, కొడుకును రక్షించుకున్నది. తరువాత ఆమె, "ఎందుకురా పెద్ద, పెద్దవాళ్ళతో గొడవలు తెచ్చుకుంటావు?" అని రంగడిని మందలించింది. తన తప్పు ఏమీ లేదనీ, ఆ పెద్దమనిషి తనతో అమర్యాదగా మాట్లాడాడనీ రంగడు తల్లితో అన్నాడు. "మనకు డబ్బు లేదు. ధనవంతులు మనలాటి వాళ్ళని ఎన్ని మాటలన్నా, ఎంత అగౌరవంగా చూసినా సహించాలి," అన్నది రంగడితో తల్లి. ఈ మాట రంగడికి నచ్చక, సహించకపోతే ఏమవుతుందని అడిగాడు. "తినడానికి తిండి కూడా దొరకదు," అన్నది తల్లి. "పెద్దవాళ్ళతో దెబ్బలాడితే నువ్వు కూడా తిండి పెట్టవా?" అని రంగడు తల్లిని అడిగాడు. తల్లి వాణ్ణి అక్కున చేర్చుకుని, "ఎందుకు పెట్టనురా, బాబూ? అయితే ఎల్లకాలమూ నేను బ్రతికి ఉండను గదా! అదే నా బాధ," అని కళ్లనీళ్లు పెట్టుకున్నది. తాను కూడా గొప్పవాడు కావాలని రంగడికి అనిపించింది. అదిమొదలు వాడు గురువు వద్దకు వెళ్లి, శ్రద్ధగా విద్యాభ్యాసం చెయ్యసాగాడు. అయినప్పటికీ, తనను ఎవరైనా అనవసరంగా మాటలంటే పడేవాడు కాడు.

దురదృష్టవశాన రంగడి విద్యాభ్యాసం పూర్తికాకముందే రంగడి తల్లి చనిపోయింది. రంగడితో వాడి గురువు, "నీకు చదువు బాగా వస్తున్నది. ఎలాగో మరి రెండేళ్లు శ్రమపడ్డావంటే నీ చదువు పూర్తి అవుతుంది. రోజుకొక ఇల్లు చొప్పున వారాలు ఏర్పాటు చేసుకుని, చదువు ముగించు," అన్నాడు. రంగడు వారాల పిల్లాడు అయ్యాడు. వారాలు చేసే ఇళ్లలో రంగడికి చాలా పనులు చెప్పేవాళ్ళు. చెప్పిన పనులు ఎంత బాగా చేసినా ఏదో వంకపెట్టి, అస్తమానమూ తిట్టుతూ ఉండేవారు. మొదట్లో వాడికి ఇది కష్టంగా ఉండేది. కానీ క్రమంగా దీనికి అలవాటు పడ్డాడు. ఒక ఇంట్లో మొక్కలకు నీళ్లు పోస్తుంటే, "ఒరే, అంత ఎక్కువగా నీళ్లు పోస్తే, మొక్క కుళ్ళి చస్తుంది," అనేవారు. అలా అని నీళ్లు కొంచెం తగ్గించి పోస్తే, "ఆలా కొంచెంగా నీళ్లు పోస్తే, ఎండకు నీరు ఆవిరి అయి, మొక్క ఉడికి చచ్చిపోతుంది," అనేవారు. ఇలా రంగడు ఏది చేసినా తప్పుగానే ఉండేది. అయినా రంగడు సహించి ఊరుకునేవాడు. క్రమంగా వాడు తన సహనంతో వారాల ఇళ్ళవాళ్లనే కాకుండా ఊళ్ళోవాళ్ళను కూడా మెప్పించాడు.

ఆ ఊళ్ళో ఒక మోతుబరి కొడుకు, రాముడు అనేవాడు, రంగడి ఈడువాడే, ఉండేవాడు. పెద్దవాళ్ళ నుంచి మాటపడేవాడు కాదు. అందరినీ ఎదిరించేవాడు. ఒకనాడు రాముడి తల్లి వాడితో విసిగిపోయి, "ఆ రంగణ్ణి చూసి నేర్చుకోరాదట్రా? ఎంతో కష్టపడి చదువుకుంటున్నాడు. అయినా వాడికి కొంచెం కూడా గర్వం లేదు. ఎవరినీ పల్లెత్తుమాట అనడు," అన్నది. ఇది ఎంతవరకు నిజమో చూడాలని రాముడు రంగడిని ఒక కంట కనిపెట్టుతూ వచ్చాడు. ఒక ఇంట్లో రంగడు ఏడుస్తున్న పిల్లను ఎత్తుకోనందుకు తిట్లుతిన్నాడు. ఇంకో ఇంట్లో ఏడుస్తున్న పిల్లను ఎత్తుకుంటే, రంగడు పిల్లకు ఎత్తుకోవడం అలవాటుచేస్తున్నాడని తిట్టారు. ప్రతి ఇంట్లోనూ వాడు ఎందుకో ఒకందుకు తిట్లు తింటూనే ఉన్నాడు. తిట్లను సహిస్తూనే ఉన్నాడు. రాముడు రంగడితో, "నీ ఓర్పు అద్భుతం! అవమానాలన్నీ నువ్వు ఎలా సహించగలుగుతున్నావు?" అని అడిగాడు. "మాటలంటే ఏం? వాళ్ళ మనసు అమృతం! నాకు రోజూ కడుపునిండా తిండి పెడుతున్నారు. నేనంటే అభిమానంగా ఉంటున్నారు," అన్నాడు రంగడు. "పట్టెడు అన్నం కోసం మాటలు పడటం సాధ్యమా?" అని రాముడు ఆశ్చర్యంగా అడిగాడు. "మా అమ్మ బ్రతికి ఉన్నంత కాలమూ నాకు కూడా అది సాధ్యం కాలేదు," అన్నాడు రంగడు. అసలు విషయం రాముడికి అర్థమయింది. తల్లి కొడుకుకు పెద్ద అండ! ఎవరు తిట్టినా ఆదరిస్తుంది. తల్లిలేని వాడికి ఓర్పులేకపోతే, వాణ్ణి ఎవరు ఆదుకుంటారు? ఆ రోజు నుంచీ రాముడు తల్లి చెప్పినట్టు వింటూ ఓర్పు అలవరచుకున్నాడు.

నిజమైన గొప్పవాళ్ళు 

శ్రవణానందుడు అనే ధనవంతుడు పెద్దలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ, గ్రంథపఠనంతో కాలయాపన చేస్తూ, ఉన్న ఊళ్ళోనే సుఖంగా బతుకుతూ వచ్చాడు. ఒకనాడు అతని ఇంటికి ముగ్గురు బంధువులు వచ్చారు. వారిలో ఒకడు వ్యాపారి, ఒకడు గాయకుడు, ఒకడు రాజోద్యోగి. శ్రవణానందుడు ముగ్గురికీ ఆతిథ్యం ఇయ్యటమేగాక, వారి వారి వ్యాపకాలను గురించి తెలివిగా మాట్లాడాడు. "నీకు మంచి పరిజ్ఞానం ఉన్నట్టున్నది. మా ముగ్గురిలో ఎవరు గొప్పవాళ్ళో చెప్పగలవా?" అని వాళ్ళు శ్రవణానందుణ్ణి అడిగారు. "గొప్పతనానికి వీరూ, వారూ అని ఏమున్నది? బతికినన్నాళ్ళూ సంతోషంగా ఉండగలిగినవారంతా గొప్పవాళ్లే. జీవితానికి సంతోషమే గదా ముఖ్యం?" అన్నాడు శ్రవణానందుడు. "అలాగనకు. ఎందరికో వ్యాపారం చెయ్యాలని ఉంటుంది. మరి అందరూ గొప్ప వ్యాపారులు కాగలరా!" అని వ్యాపారి అడిగాడు. అలాగే గాయకుడూ, రాజోద్యోగీ తమ ప్రత్యేకతలను గురించి చెప్పుకున్నారు. శ్రవణానందుడు నవ్వి, "ఆ మాటకు వస్తే మీలో గొప్పతనమేమీ లేదు. నేను మీ ముగ్గురినీ మీ వ్యాపకాలలో మించగలను," అన్నాడు. అతని బంధువులకీ మాటలు సవాలుగా తోచాయి. అతను తన మాట రుజువు చేసుకోగలిగితే వెయ్యేసి వరహాలు ఇచ్చుకుంటామన్నారు. శ్రవణానందుడు ఈ పందాన్ని ఆమోదించి, తన బంధువుల వెంట రాజధానీ నగరానికి వెళ్లి, మొట్టమొదట వ్యాపారి ఇంట్లో మకాం చేశాడు. 

వ్యాపారికి ఎన్నో దుకాణాలున్నాయి. వాటిలో కూరగాయల దుకాణం కూడా ఉన్నది. శ్రవణానందుడు వ్యాపారి దుకాణం నుంచి గంపెడు వంకాయలు తీసుకుని, వేరే కూర్చున్నాడు. అతను కొనవచ్చినవారికి అందరికన్న వంకాయల ధర హెచ్చుగా చెప్పాడు. "ఇతరులకన్న ధర హెచ్చు చెబుతున్నావేం?" అని అడిగినవారికి శ్రవణానందుడు, "నాణ్యాన్ని బట్టి ధర ఉంటుంది. ఇతరులు అమ్మే సరుకే అయితే, నేనెందుకు హెచ్చు ధర చెబుతాను? నా సరుకు అందరూ కొనేది కాదులెండి. ధనగుప్తుడుగారు  ఎప్పుడూ నా దగ్గిరే కొంటారు," అనేవాడు. అది అసలే ధనికులు కొనుక్కునే బజారు. కాస్త డబ్బుగలవాళ్ళమనుకునే వారికి అతని దగ్గిర వంకాయలు అతను చెప్పిన ధరకే కొనటం తమ తాహతుకు నిదర్శనమనిపించింది. అతని సరుకంతా అమ్ముడుపోయి చాలా లాభం వచ్చింది. మర్నాడు శ్రవణానందుడు సామాన్యుల సంతకు వెళ్ళాడు. అక్కడ అతను తన సరుకు మీద తక్కువ లాభం వేసుకుని ఇతరులకన్న చవుకగా సరుకంతా అమ్మేసి, అమ్మకం హెచ్చుగా జరిగిన కారణంగా హెచ్చు లాభం తీశాడు. "నీ తెలివితేటలు వెయ్యి వరహాల విలువే!" అంటూ అతని బంధువైన వ్యాపారి శ్రవణానందుడికి వెయ్యి వరహాలూ ఇచ్చేశాడు. శ్రవణానందుడు అక్కడి నుంచి గాయకుడి ఇంటికి మకాం మార్చాడు. అక్కడ అతను రోజూ గాయకుడి వద్దనే సంగీతం అభ్యసిస్తూ, రోజూ సాయం సమయాల్లో ఎక్కడికో వెళ్ళి వస్తూండేవాడు. ఒక రోజు అతను ఒక లేడిని తీసుకువచ్చి, "మన మధ్య సంగీతం పోటీ జరిగితే ఎవరు నెగ్గినదీ ఈ లేడి చెబుతుంది," అని గాయకుడితో అన్నాడు. 

ఇద్దరికీ పాటలో పోటీ అని తెలిసి చుట్టుపక్కలవాళ్ళు చాలామంది వచ్చారు. ముందు గాయకుడు అద్భుతంగా పాడి, అందరి మెప్పూపొందాడు. తరవాత శ్రవణానందుడు ఒక విరహ గీతం పాడాడు. తన ప్రియురాలైన రాణీ కోసం ప్రియుడు పాడే గీతం అది. అతని పాట బొత్తిగా పాడుగా లేదు. కాని అతను పాట ఆరంభించగానే లేడి వచ్చి అతని ముందు నిలబడి, అతని పాట అయిపోయే దాకా విని, తరవాత అవతలికి వెళ్ళింది. వినేవాళ్లూ, గాయకుడూ కూడా నిర్ఘాంతపోయారు. అందరూ శ్రవణానందుణ్ణి మెచ్చుకున్నారు. పాటతో జంతువును ఆకర్షించటమంటే మాటలా? గాయకుడు శ్రవణానందుడికి వెయ్యి వరహాలూ ఇచ్చుకుంటూ ,"మృగాన్ని కూడా నీ పాటతో ఎలా ఆకర్షించావు?" అని అడిగాడు. "ఇందులో పెద్ద విశేషమేమీలేదు. నేను లేడికి అర్ధమయ్యే పాట పాడాను. దాన్ని ముందుగా తయారుచేశాను. దాని పేరు రాణి! తన పేరు విని అది నా ముందుకు వచ్చింది," అన్నాడు శ్రవణానందుడు. అక్కడి నుంచి అతను రాజోద్యోగి ఇంటికి వెళ్ళి, "నీకు రాజు చేత మంచి బహుమతి ఇప్పించగలను," అన్నాడు. అతను ఆ మాట అన్నందుకు రాజోద్యోగికి కోపం కూడా వచ్చింది. శ్రవణానందుడు రత్నం ఒకటి కానుకగా తీసుకుని మంత్రిగారి ఇంటికి వెళ్ళి, ఆయనకు దాన్ని బహూకరించాడు. మంత్రి సంతోషించి, "నా వల్ల మీకు ఏమి సహాయం కావాలి?" అని అడిగాడు. "నాకు ఒక విఘడియపాటు రాజదర్శనం చేయించండి," అన్నాడు శ్రవణానందుడు. మంత్రి అతన్ని మర్నాడు సభకు రమ్మన్నాడు.

శ్రవణానందుడు మంత్రి వద్ద సెలవు పుచ్చుకుని ఒక ప్రసిద్ధ కవి వద్దకు వెళ్ళి, అతనికొక బంగారు కానుక ఇచ్చి, మహారాజును పొగుడుతూ ఒక పద్యం రాయించి పుచ్చుకున్నాడు. మర్నాడు అతను రాజసభకు వెళ్ళి, రాజుకు నమస్కరిస్తూ ఆ పద్యం చదివాడు. రాజు చాలా ఆనందపడి, "ఎవరు రాశారు ఈ పద్యం?" అని శ్రవణానందుణ్ణి అడిగాడు. దానికి శ్రవణానందుడు, "కవి ఎవరో తెలియదు, మహారాజా, కాని మా బంధువు ఒకడు తెల్లవారి లేచి ఈ పద్యం చదివిగాని, ఏ పనీ ప్రారంభించడు. ఈ పద్యం విన్నమీదటనే నాకు తమ దర్శనం చేసుకోవాలని బలమైన కోరిక కలిగింది. నా కోరిక ఫలించింది," అన్నాడు. శ్రవణానందుడి బంధువు తన కొలువులోనివాడేనని తెలిసి, రాజు వెంటనే అతని జీతం పెంచమని ఉత్తరువిచ్చాడు. రాజోద్యోగి శ్రవణానందుడికి సంతోషంగా వెయ్యివరహాలూ ఇస్తూ, "నువ్వు నాకు చేసిన మేలుకు ఈ బహుమానం చాలదు," అన్నాడు. తరువాత ముగ్గురు బంధువులూ శ్రవణానందుడితో, "నీలో ఇంత శక్తి ఉండి, ఆ మారుమూల పల్లెటూళ్ళో నివురు గప్పిన నిప్పులాగా ఎందుకుంటావూ? మా మాటవిని రాజధానికి వచ్చెయి . ఇక్కడ నీ తెలివితేటలు అఖండంగా రాణిస్తాయి," అన్నారు. శ్రవణానందుడు నవ్వి, "నా విజయాలు క్షణికమైనవి. మీలాగా మీ మీ వృత్తులలో నిలవదొక్కుకుని రాణించటం తేలికకాదు. మీకన్నా నేను నిజంగా గొప్పవాణ్ణి కాలేను. కాని నాకు కావలసినది విజ్ఞానం సంపాదిస్తూ, జీవితం సంతోషంగా గడపడం. అది మా వూళ్ళో నాకు సాధ్యమే," అన్నాడు. అతని వినయం చూసి అందరూ సంతోషించారు.

పనికిరాని వస్తువులు 

మణిపురంలో రామయ్య కొబ్బరినూనె వ్యాపారం చేసేవాడు. గానుగ ఆడటానికి కొబ్బరి కురిడీలు పనికివస్తాయి. కాని అవి తగినన్ని దొరకవు. అందుచేత రామయ్య తన అవసరానికి సరిపడా ముదురు కొబ్బరికాయలు తెప్పించి, వాటి నుంచి కొబ్బరి తీసి ఎండబెట్టి, కొబ్బరి పెంకులు అవతల పారేసేవాడు. ఒకసారి అతని ఇంటికి జనార్ధనుడు అనే యువకుడు వచ్చి, ఇంటి ఆవరణలో గుట్టలుగా పడి ఉన్న ఖాళీ కొబ్బరి చిప్పలను చూపించి, "వీటిని ఏం చేస్తారు?" అని అడిగాడు. "పొయ్యిలో పెట్టుకుంటాం. అంతకన్న అవి దేనికి పనికివస్తాయీ?" అన్నాడు రామయ్య. "పెద్ద పెద్ద చిప్పలు నాకు అమ్మితే కొంటాను," అన్నాడు జనార్ధనుడు. చలికాలంలో నీరు కాచుకునేటందుకు తప్ప పనికిరాని ఖాళీ కొబ్బరి చిప్పలను కొని ఏం చేసుకుంటాడా అని ఆశ్చర్యపడుతూ రామయ్య సరేనన్నాడు. వీలయినంతవరకు పెద్దగా ఉన్న కొబ్బరి దీపాలను ఏరి, వాటికి కొంత డబ్బు ఇచ్చి జనార్ధనుడు తీసుకుపోయాడు. అటు తరువాత రామయ్య కొబ్బరి కాయలను పగల గొట్టించేటప్పుడు ప్రతి కాయకూ రెండు నిండు డిప్పలు వచ్చేటట్టు పగలగొట్టించేవాడు. పదిహేను రోజుల కొకమారు వచ్చి, డిప్పలు కొనుక్కుపోయేవాడు జనార్ధనుడు. ఇలా ఒక సంవత్సరం పాటు జరిగింది. తరవాత జనార్ధనుడు రావడం మానేశాడు. రెండు నెలలు గడిచాయి. జనార్ధనుడు ఆకులకట్ట అనే గ్రామంలో ఉంటున్నట్టు రామయ్యకు తెలుసు.

ఆ గ్రామం మణిపురానికి పాతికమైళ్ళ దూరాన ఉన్నది. ఒకసారి పనిమీద నగరం వెళ్లిన రామయ్య పని పెట్టుకుని ఆకులకట్ట గ్రామం మీదుగా తిరుగు ప్రయాణమయ్యాడు. ఆకులకట్ట ఊరుచేరి జనార్ధనుణ్ణి గురించి అడిగితే, అతని ఇంటికి దారి తెలిసింది. రామయ్య కొన్ని కొబ్బరి తోటలు దాటి ఒక మామిడితోట మధ్య ఉన్న ఇంటికి చేరుకున్నాడు. అది ఐశ్వర్యవంతుల ఇల్లులాగున్నది. జనార్ధనుడు ఆ ఇంటి వారి వద్ద పనిచేస్తూ ఉండవచ్చుననుకున్నాడు రామయ్య. ఇంటి తలవాకిలి సమీపంలో పని చేస్తున్న మనిషిని రామయ్య, "జనార్ధనుడు ఉన్నాడా?" అని అడిగాడు. ఆ మనిషి రామయ్యను ఎగా దిగా చూసి, లోపలికి వెళ్ళమని దారి చూపించాడు. ఆ ఇల్లు జమీందారీ భవనంలా ఉన్నది. మేడ మీద కొంతమందితో మాట్లాడుతున్న వ్యక్తి  జనార్ధనుడి లాగే ఉన్నట్టు కనిపించాడు. కాని చాలా విలువైన దుస్తులు ధరించి ఉన్నాడు. అతను పై నుంచి రామయ్యను చూస్తూనే, రామయ్యను లోపలికి తీసుకురమ్మని ఒక మనిషిని పంపి, తాను మేడ దిగాడు. కింద రామయ్యా, జనార్ధనుడూ కలుసుకున్నారు. జనార్ధనుడి అవతారమూ, ఠీవి చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు. "రామయ్యగారూ, నా ఇల్లూ, వ్యవహారమూ చూసి మీకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది కదూ? కొబ్బరి చిప్పలు కొనుక్కుపోయిన వాడికి పట్టు బట్టలూ, మేడా ఎలా వచ్చాయనుకుంటున్నారు కదూ! ముందు నా ఆతిథ్యం స్వీకరించండి. తరవాత అన్ని విషయాలూ మాట్లాడుకోవచ్చు," అన్నాడు జనార్ధనుడు. విందు భోజనం ముగించి, కచేరీ గదిలో విశ్రాంతి తీసుకుంటూ జనార్ధనుడు రామయ్యకు తన కథ ఇలా చెప్పాడు:

ఒకప్పుడు మాది జమీందారీ వంశం. మా తాత తండ్రులు ముందూ, వెనకా చూడకుండా దానధర్మాలు చేసి, చితికిపోయారు. నాకు జ్ఞానం తెలిసేనాటికి ఆ తాత తండ్రులూ లేరు. ఆస్తీ లేదు! ఇక్కడికి దగ్గిరలో వున్న కోటిపల్లి జమీందారు సుందరయ్యగారు వస్తున్న బండి ఒకనాడు ప్రమాదవశాన తిరగబడింది. సమయానికి అటు వచ్చిన నేను ఆయనను బండిలో నుంచి పైకి లాగాను. బండివాడూ, నేనూ కలిసి బండిని సరిగా నిలబెట్టినాక నేను ఆయనను వారి ఇంటికి చేర్చాను. మాటల సందర్భంలో ఆయన నా పరిస్థితి గురించి విని చాల విచారించారు. "ఎందుకండీ విచారం? ఎందుకూ పనికిరావని మామూలుగా అందరూ అనుకునే వస్తువుల సహాయంతో ఒక్కొక్కప్పుడు శ్రీమంతుడు అయిపోవచ్చు," అన్నాను గంభీరంగా. సుందరయ్యగారు నవ్వుతూ, "జనార్దనా, నువ్వన్నట్టు ఎవరికీ పనికిరావనుకునే వాటితో నువ్వు ధనం సంపాదించగలిగితే, నా ఒక్క కూతురినీ నీకిచ్చి వివాహం చేస్తాను. నీకు పెట్టుబడి కావలిస్తే తీసుకో," అన్నారు. నేను ఆయన వద్ద కొంత సొమ్ము అప్పుగా మాత్రమే తీసుకుని, బొమ్మల మీదా కుండల మీదా రంగులు వేసేవారిని ఇద్దరినీ, పనితనంగల వడ్రంగులను ఇద్దరినీ కుదుర్చుకున్నాను. కొబ్బరి చిప్పలు సేకరించి, వాటితో రకరకాల బొమ్మలూ, ఆట వస్తువులూ, గరిటెలూ వడ్రంగుల చేత చేయించాను. బొమ్మలకు రంగులు వేయించాను. రంగు రంగుల బొమ్మలు కదులుతూ తలలు ఊపుతూ ఆకర్షణీయంగా ఉండటం చేత, అవి ఈ చుట్టుపక్కల జరిగే సంతలలోనూ, పట్నంలోనూ మంచి ధరకు విరివిగా అమ్ముడు పోయాయి.

అదే సమయంలో ఎక్కడెక్కడి కొబ్బరి మట్టలూ కొని తెప్పించి, ఆడ కూలీలను నియమించి కొబ్బరి ఆకుల నుంచి ఈనెలు తీయించి, చీపుళ్లు తయారుచేయించాను. నా బొమ్మలూ, చీపుళ్ళూ, కొబ్బరి కాయలూ మధ్యదేశంలో అపురూపంగా ఉండి, వాటికి గిరాకీ ఉండేది. అక్కడ చవుకగా దొరికే వస్తువులు తెప్పించి, ఇక్కడ మంచి ధరలకు అమ్మి అటూ, ఇటూ కూడా వ్యాపారం సాగించి, సంవత్సరం లోపల చాలా డబ్బు గడించాను. ఆరంభంలో నాకు ముడిసరుకు మీ నుంచి లభించింది. మీరు కొబ్బరినూనె వ్యాపారం చేస్తారు గద! డబ్బు బాగా చేరినాక ఆకులకట్టలో స్థిరపడ్డాను. ఎందుకంటే ఇక్కడ కొబ్బరితోటలు జాస్తి. సుందరయ్యగారు నా కృషి చూసి మెచ్చుకుని, "కేవలము కొబ్బరి డిప్పలతోనూ, కొబ్బరిమట్టలతోనూ, వ్యాపారం చేసి ఇంత ధనం సంపాదించావంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉన్నది. అందరూ నీలాగా ప్రయత్నిస్తే సాధించరానిది ఉండదేమో!" అని తాను అన్న ప్రకారం నాకు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. నేను వారి జమీవ్యవహారాలన్నీ చూస్తూ, ఈ ఆకులకట్టలో వారి భవనంలోనే ఉంటున్నాను. వారు మాత్రం కోటిపల్లిలోనే ఉంటున్నారు. ఇదీ నా కథ! రామయ్య జనార్దనం కథ విని చాలా సంతోషించి, "జనార్దనంగారూ, మీరు యువకులకు ఒక చక్కని బాట చూపారు. మీలా అందరూ ఏదో ఒక పథకం ఆలోచించుకుని ముందుకు సాగితే, బాగుపడటానికి ఎన్నో మార్గాలుంటాయి," అన్నాడు. తరువాత ఆయన జనార్దనం నడుపుతున్న గృహపరిశ్రమలన్నీ స్వయంగా చూసి, తాను బాగుపడటమే గాక అనేకమందికి ఉపాధి కలిగించిన జనార్దనాన్ని అభినందించి తన ఇంటికి బయలుదేరాడు.

Comments